Monday, December 23, 2024

మరో పది పదిహేను నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే..

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ ః మరో పది పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారి పట్ల విధి కన్నెర్ర చేసింది. వారు ప్రయాణిస్తున్నా ఆటో వెనుక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిపాలిట మృత్యు శకటమైంది. గుడిహత్నూర్ మండలంలోని మేకల గండి సమీపంలో రోడ్డు ప్రమాదంలో నలుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో ఐదుగురు గాయాలపాలైన సంఘటన సంఘటన చోటు చేసుకుంది. ఇచ్చోడ ఇంచార్జీ సీఐ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం … ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీకి చెందిన ఏముల పోచన్న (56) , ఆయన భార్య ఏమల గంగమ్మ (52) జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలో

నివాసం ఉండే వారి కూతురు దాసరి శైలజ (34) మనుమరాళ్లైన ఆరాధ్య, చిన్నితో పాటు జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్‌కు మడవి సోంబాయి(63), తేజ వర్థన్, ప్రేమ్ సాగర్, దీపాక్ రాజ్‌లతో కలిసి ఆటోలో ( టిఎస్01యుఎ 8195) ఇచ్చోడ మండల కేంద్రంలోని హోలీ మౌంటెన్ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు శుక్రవారం రాత్రి వచ్చినట్లు తెలిపారు. ప్రార్థనల అనంతరం వీరంతా కలిసి శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం కాగా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మేకల గండి సమీపంలో వారు ప్రయాణిస్తున్నా ఆటోను వెనుక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆటో రోడ్డు పక్కన గల కాలువలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఏముల గంగమ్మ , దాసరి శైలజ, మడవి సోంబాయి సంఘటన స్థలంలోనే చనిపోగా మిగిలిన వారికి గాయాలు కావడంతో వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రమాదం అనంతరం ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనంతో సహా డ్రైవర్ పరారైయ్యాడు. మృతుడి కుమారుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్ కుమార్, ఎస్సై ప్రవీణ్ కుమార్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News