పెషావర్/ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజిరిస్థాన్ గిరిజన జిల్లాలో సోమవారం ఆత్మాహుతి బాంబు దాడికి నలుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మీర్ అలి తహసీల్ రీజియన్‌లో పట్టాసి చెక్‌పోస్టు దగ్గర మూడు చక్రాల రిక్షా భద్రతా దళాల వాహనాన్ని ఢీకొనడంతో ఈ సంఘటన జరిగిందని మంగళవారం మిలిటరీ మీడియా వ్యవహారాల విభాగం వెల్లడించింది. గాయపడిన ఏడుగురిలో ముగ్గురు సిపాయిలు, ఇద్దరు నాయిక్ ర్యాంకు జవాన్లు, మరో ఇద్దరు పౌరులు ఉన్నారని వివరించింది. ఈ దాడికి ప్రధాని షాబాజ్ షరీఫ్ సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దేశం గట్టిగా ఉండాలని సూచించారు. ఇలాంటి హింసాత్మక ప్రయత్నాల వల్ల ఉగ్రవాదులు విజయం సాధించలేరని వ్యాఖ్యానించారు. గత నెల 4న ఆత్మాహుతి బాంబు దాడికి భద్రతా సిబ్బంది పది మంది తీవ్రంగా గాయపడ్డారు.