Sunday, November 17, 2024

బూతులు తిట్టారు..లైంగికంగా వేధించారు

- Advertisement -
- Advertisement -

పోలీసులపై అట్రాసిటీ,
అత్యాచార కేసులు పెట్టాలి
బిఆర్‌ఎస్ నేతృత్వంలో
ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు
లగచర్ల బాధితుల ఫిర్యాదు

లగచర్ల ఘటనలో నలుగురు లొంగుబాటు

మన తెలంగాణ/హైదరాబాద్: లగచర్ల దాడి కేసు బాధితులు రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ను కలిశారు. బాధిత మహిళలతో కలిసి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి సత్యవతి రాథోడ్,పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లు శనివారం రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు తమపై పోలీసులు ఏ విధంగా అఘయిత్యాలకు పాల్పడ్డారో కమిషన్‌కు వివరించారు. రైతులు దాడులు చేశారన్న కారణంతో అర్థరాత్రి ఇంటిపైకి వచ్చి మహిళలను బూతులు తిట్టారని…లైంగికంగా వేధించారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పరాకాష్ట పాలనకు లగచర్లలో పోలీసుల అమానుష దాడియే ఉదాహరణ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనులపై దురహంకారంతో వ్యవహరిస్తూ వారి భూములను లాక్కుకుంటారని మండిపడ్డారు.

సొంత నియోజకవర్గంలో రైతులను మెప్పించటంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి…ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మెప్పిస్తాడో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి సిఎం అయితే తమకు లాభం జరగుతుందని గిరిజనులు అనుకుంటే వారి పొట్టకొడుతున్నాడని విమర్శించారు. ఫార్మా కంపెనీ కారణంగా కాలుష్యంతో జీవితాలు ఆగమావుతాయని లగచర్లలో చిన్న పిల్లలు కూడా చెబుతున్నారని…ఈ రేవంత్ రెడ్డికి మాత్రం ఎందుకు సోయి లేదో చెప్పాలన్నారు. కడుపు కాలి తిరగబడితే వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టటమేమిటనీ ప్రశ్నించారు. అర్థరాత్రి, అపరాత్రి అని చూడకుండా రైతులను జైలుల్లో పెట్టటం అమానుషమని మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీని మెప్పించేందుకు పెడుతున్న దృష్టిలో 10 శాతమన్న ఇక్కడ ప్రజలపై పెట్టాలని సూచించారు. ఇకనైనా బుద్ధి మార్చుకొని…గిరిజనులను వాళ్ల బతుకు వాళ్లు బతికేలా వదిలేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారాడని మండిపడ్డారు. కలెక్టర్‌పై దాడులు చేశారంటూ అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. వెంటనే రైతులపై పెట్టినా కేసులు ఉపసంహరించుకోవాలన్నారు.

అధికారులపై కాదు.. గిరిజనులపైనే దాడి జరిగింది : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
లగచర్లపై నిజానికి ఎస్‌సి, ఎస్‌టిపైనే దాడి జరిగిందని బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులు దాడులు చేశారన్న నెపంతో ఎస్‌సి,ఎస్‌టి మహిళలపై పోలీసులు అసభ్యకంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఎస్‌సి. ఎస్‌టి మహిళలు చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. వెంటనే ఆ పోలీసులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులతో పాటు అత్యాచార కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలకు ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి మహిళపై చేస్తున్న దమనకాండను రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తోందన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామని చెప్పారు.

ఎస్‌సి, ఎస్‌టిలకు అన్యాయం జరిగితే ఊరుకోం: బక్కి వెంకటయ్య (కమిషన్ ఛైర్మన్)
ఎస్‌సి, ఎస్‌టి మహిళలపై దాడులను నియంత్రించే విషయంలో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతామన్నారు. త్వరలోనే లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందని వెల్లడించారు. ఎస్‌సి, ఎస్‌టిలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పారు. ఫార్మా కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కమిషన్‌ను కలిసిన వారిలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్,పార్టీ నాయకులు జాన్సన్ నాయక్, రూప్ సింగ్ సహా నేతలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News