680 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,479 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం
నిందితులపై 22 కేసులు
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఇళ్లల్లో చోరీలు చేస్తున్న నలుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 680 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,479 గ్రాముల వెండి వస్తువులు, ల్యాప్‌టాప్, కెమెరా, రెండు బైక్‌లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం, తిరునవేలి జిల్లా, రెట్టాయికులంకు చెందిన రామకృష్ణన్ బతుకు దెరువు కోసం వచ్చి జవహర్‌నగర్‌లో ఉంటున్నాడు. మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన కోగ్ గోవింద్, మహేందర్ పవార్, బాచు సంతోష్ కలిసి చోరీలు చేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన రామకృష్ణన్ స్నాక్స్ విక్రయిస్తున్నాడు.
గోవింద్, రామకృష్ణన్ స్నేహితులు ఇద్దరు ఆన్‌లైన్ ప్లేయింగ్ కార్డుకు బానిసలుగా మారాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు చోరీలు చేయడం ప్రారంభించారు. రామకృష్ణ కీసర, కుషాయిగూడ, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. చోరీ చేసిన సొత్తును నలుగురు కలిసి పంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. విచారణ చేస్తున్న పోలీసులు బండ్లగూడ నుంచి నాగారం వస్తుండగా నిందితులను పట్టుకున్నారు. కీసర ఇన్స్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సైలు మధు, నాగరాజు, జోజి తదితరులు పట్టుకున్నారు.