Friday, December 20, 2024

త్వరలో హైదరాబాద్‌లోనే ఐఫోన్‌లు,

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోతైవాన్‌కు చెందిన ఐఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ నిర్మాణానికి సోమవారం ఉదయం పదిన్నర గంటలకు భూమి పూజ చేయనున్నారు. రూ.1,656 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్‌కాన్ కంపెనీ నిర్మాణం చేపడుతున్నారు. టిఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తయితే సుమారు 35 వేల మందికిపైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఫాక్స్‌కాన్ సంస్థ అందుకు అంగీకరించింది.

Also Read: పెట్రోలు, డీజిలు ధరలపై కేంద్రం తప్పుడు ప్రచారం

దాంతో సర్కారు కంపెనీ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్ సంస్థకు 196 ఎకరాల భూమిని కేటాయించింది. కాగా, సోమవారం కంపెనీ భూమి పూజకు మంత్రి కెటిఆర్ హాజరవుతుండటంతో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సోమవారం భూమిపూజకు సంబంధించిన విషయాలపై వారితో చర్చించారు. కంపెనీ ప్రాంగణంలో నిర్మించబోయే రోడ్లు, ఇతర భవనాల మ్యాప్‌లను కూడా ఎంఎల్‌ఎ పరిశీలించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ గ్రూప్ ఛైర్మన్ యంగ్ ల్యూ తోపాటు మంత్రి సబితా రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్. సుమారు 70శాతం యాపిల్ ఐఫోన్లు ఫాక్స్‌కాన్ కంపెనీయే తయారు చేస్తుంది. యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News