Sunday, January 19, 2025

నాగాలాండ్‌లో శాంతి సాధ్యమేనా!

- Advertisement -
- Advertisement -

నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఐజాక్ ముయివా వర్గం లేదా ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం)గా పరిగణించే తీవ్రవాద నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిమ్, భారత ప్రభుత్వం(జిఒఐ) నాగా శాంతి ప్రక్రియలో ఆటంకాన్ని తొలగించేందుకు 2015 ఆగస్టు 3 నాటి ‘ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్’(ఎఫ్‌ఎ)ను పునఃపరిశీలించాయి. ఉభయ పక్షాలు సోమవారం (14న) న్యూఢిల్లీలో చర్చలు జరిపాయి. ప్రత్యేక జెండా, ఒక రాజ్యాంగం కోసం ఎస్‌ఎస్‌సిఎన్ డిమాండ్ పర్యవసానమైన ఆటంకాన్ని తొలగించేందుకు ఈ నెల 9న జరిపిన లాంఛనప్రాయ సమావేశం అనంతరం ఈ సమావేశం జరిగింది. ఆ డిమాండ్‌ను జిఒఐ తిరస్కరించింది. చర్చల పూర్తి ఫలితం ఇంకా వెల్లడి కావలసి ఉంది. ఈ సంప్రదింపుల కోసం పది మంది సభ్యుల ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం ప్రతినిధి వర్గం న్యూఢిల్లీలో ఉన్నది. ఆ గ్రూప్ ప్రత్యేక జెండాను, రాజ్యాంగాన్ని, వేర్వేరు ప్రాంతాల్లోని నాగాలు అందరినీ సమైక్యం చేస్తూ పార్ నాగా ఫ్రేమ్‌వర్క్‌ను కోరుతున్నది. 2015 ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ వాస్తవిక ఫలితాలు, అమలు ఆవశ్యకతను నొక్కిచెబుతూ వారు చర్చలకు మద్దతు తెలియజేశారు. సంప్రదింపుల ఫలితం కోసం వివిధ నాగా తెగలు, ప్రాంతీయ సంబంధితులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్‌పై ఎంతో ఆర్భాటంగా ఎన్‌ఎస్‌సిఎన్‌ఐఎం, భారత ప్రభుత్వం మధ్య సంతకాలు జరిగాయి. ఎఫ్‌ఎపై సంతకాలు జరిగిన 9 సంవత్సరాల తరువాత అది అనుత్పాదక విన్యాసంగా తేలింది. ఎన్‌ఎస్‌సిఎన్‌ఐఎం నేత ముయివా వివిధ సందర్భాల్లో స్వతంత్ర మహా నాగాలిమ్ డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నారు. నాగాలు ఎన్నడూ భారత్‌లో భాగం కారని ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం, ఇతర నాగా తిరుగుబాటు వర్గాలు సదా వాదిస్తున్నారు. స్వాతంత్య్రం ప్రకటనకు ముందు రోజు 1947 ఆగస్టు 14న నాగా సంస్థలు ‘స్వతంత్రం’ ప్రకటించాయి. వారు ప్రతి సంవత్సరం ఆ రోజున ‘వేడుకు చేసుకుంటున్నారు’. తమ స్వాతంత్య్ర దినం సందర్భంగా ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం నేత తుయిగలెంగ్ ముయివా భారత రాజ్యాంగాన్ని తోసిపుచ్చుతూ, స్వాతంత్య్రం కోసం నాగాల ఆకాంక్షను పునరుద్ఘాటించారు. నాగా సార్వభౌమత్వాన్ని గుర్తిస్తూ 2015 ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కిచెబుతూ దాని అమలులో భారత జాప్యాన్ని విమర్శించారు.

నాగాలిమ్ ఖనిజ సంపద, భారత్‌తో ప్రస్తుతం సాగుతున్న చర్చల గురించి ముయివా నొక్కిచెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం అనంతరం 2015 ఆగస్టు 3న న్యూఢిల్లీలో కేంద్రం, ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం సంతకాలు చేసిన ‘ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్’ గురించి ముయివా మాట్లాడుతూ, ఆ ఒప్పందం చర్చల మైలురాయి విజయం అని పేర్కొన్నారు. ‘భారత నాగా చరిత్రలో లిఖితం కాగల రాజకీయ ప్రాధాన్యం దృష్టా ప్రధాని నరేంద్ర మోడీ ఆది నుంచి తుది వరకు వివరాలను పర్యవేక్షించే బాధ్యత చేపట్టారు. విచిత్రంగా అదే ప్రధాని ఏళ్లు గడుస్తున్న కొద్దీ అంతగా పట్టించుకోవడం మానారు. తన మదిలో మెదిలిన ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్‌ను అమలు మందకొడిగా వ్యవహరించేందుకు ఆయనను ఏది పురికొల్పింది? కచ్చితంగా, సుదీర్ఘ నాగా సమస్యపై వ్యవహరణలో ఆయనదే తప్పు’ అని ముయివా అన్నారు. ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్‌ను అమలు చేయకపోవడానికి ప్రధానిదే బాధ్యత అని ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం నిందించింది.
కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఎన్‌ఎస్‌సిఎన్‌ఐఎం అంగీకరించి, సంప్రదింపులు కొనసాగించిన సమయం 1997 వరకు నాగా సంఘర్షణల్లో వందలాది మంది నాగాలు, భద్రత బలగాలు మరణించారు. ఆ మధ్య లో కొన్ని ఒప్పందాలు కుదిరాయి.

కానీ వాటిని ‘చెల్లనివి’గా ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం ప్రకటించింది. ఆ వివాదం అంతానికి తుది ఒప్పందంపై సంతకాలకు ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్‌ను ప్రాతిపదిక కావలసి ఉన్నది. కానీ, ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం, కేంద్రం రెండూ 2015 ఒప్పందంపై పరస్పర విరుద్ధ భాష్యాలు చెప్పడం పరిష్కారాన్ని ఆలస్యం చేసింది. నాగాలకు ఒక ప్రత్యేక జెండా, రాజ్యాంగం గుర్తింపు కోసం ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం పట్టుబట్టడం ఆ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని కేంద్రం అంటుండగా, జెండా, రాజ్యాంగం, ఈశాన్యలో నాగా నివాసిత ప్రాంతాల ‘సమగ్రత’ చర్చించదగినవి కావని నాగా సంస్థ వాదిస్తున్నది. రాజకీయ చర్చల మధ్య ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం, జిఒఐ ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగించాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గౌహతిలోని ఒక కోర్టులో ఒక చార్జిషీట్ దాఖలు చేసింది. రెండు నిషిద్ధ మైతై సంస్థలు, పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ), కంగ్లై యవోల్ కన్బా లుప్ (కెవైకెఎల్) భారత్‌లో చొరబడేందుకు నాగాలాండ్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సిఎన్)లోని ఐజాక్ ముయివాకు చెందిన ‘చైనా మయన్మార్ మాడ్యూల్’ మద్దతు ఇస్తున్నదని ఎన్‌ఐఎ ఆ చార్జిషీట్‌లో ఆరోపించింది.

మణిపూర్‌ను అస్థిరపరచడం, భారత ప్రభుత్వంపై పోరాటం సాగించడం అనే విస్తృత లక్షంతో ఆ రాష్ట్రంలో 2023 మేలో మొదలైన జాతుల అశాంతిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం వాటి ధ్యేయం అని ఎన్‌ఐఎ ఆరోపించింది. ఎన్‌ఐఎ చార్జిషీట్‌లో కేసు నేపథ్యాన్ని విశదీకరిస్తూ, మణిపూర్‌లో భద్రత పరిస్థితిని అస్థిరం చేయడానికి, ‘భారత ప్రభుత్వంపై పోరాటం చేయడానికి’ ‘ఉగ్ర సంస్థల’ మయన్మార్ కేంద్రంగా గల నాయకత్వం పన్నిన దేశాంతర కుట్ర గురించి కేంద్రానికి నిఘా సమాచారం అందిందని తెలియజేసింది. ఉగ్ర దాడులు నిర్వహించేందుకు భారత భూభాగంలోకి తమ తిరుగుబాటుదారులను చొరబడేలా చేయాలని మయన్మార్‌లోని కెవైకెఎల్, పిఎల్‌ఎ నాయకత్వం నిర్ణయించిందని ఎన్‌ఐఎ తెలిపింది.

ఇందుకోసం వారికి సురక్షిత ప్రయాణం, ఆయుధాలు, ఆయుధ సామగ్రి, పేలుడు వస్తువులు, ఇతర ఉగ్ర సామగ్రి సమకూర్చేందుకు ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) నాయకత్వం వాగ్దానం చేసిందని ఎన్‌ఐఎ చార్జిషీట్‌లో భాగమైన నేపథ్య పత్రంలో పేర్కొన్నది. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, 27 ఏళ్ల పాటు చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ కేంద్రం మయన్మార్ కేంద్రమైన కుకీ నేషనల్ ఆర్మీ (బి) లేదా కెఎన్‌ఎ (బి) ని, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పిడిఎఫ్)ను వినియోగించుకోవడం ద్వారా పరోక్ష యుద్ధానికి మద్దతు ఇస్తోందని ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) ఒక ప్రకటనలో ఆరోపించింది. తనపై ఆరోపణలను ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం ఖండిస్తూ, ఆ ఆరోపణలు ‘తప్పుదోవ పట్టించేవే కాకుండా క్రూరమైనవి, విషపూరితమైనవి, అందునా కచ్చితత్వానికి, నైతికతకూ దూరమైనవి కూడా’ అని వ్యాఖ్యానించింది.

కుకీ తెగలు తమ భూమిని ఆక్రమించుకుంటున్నారని నాగాలు ఆరోపించిన తరువాత 90 దశకంలో నాగాలతో కుకీ తెగలు పోరు సాగించడం గమనార్హం. ఆ సంఘర్షణలో రెండు తెగల నుంచి అనేక మంది హతులయ్యారు. నాగాలాండ్ ప్రభుత్వ ప్రాజెక్ట్ ‘ఆర్‌ఐఐఎన్’ (రిజిస్టర్ ఆఫ్ ఇండీజినస్ ఇన్‌హాబిటెంట్స్ ఆఫ్ నాగాలాండ్)కు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) ఈ నెల 1న సంయుక్త మండలి సమావేశంలో ఆమోదించింది. అది ‘భగవంతుడు ఇచ్చిన నాగా దేశం నేపథ్యంలో స్వదేశీ ప్రజల అసలు అర్థాన్నే ఉల్లంఘిస్తోంది’ అని తీర్మానం పేర్కొన్నది. స్వదేశీ అన్న నాగా అర్థాన్ని పలుచన చేస్తున్న ఆర్‌ఐఐఎన్ నాగాకు వ్యతిరేకంగా శక్తుల ప్రేరణతో నాగాలను చీల్చాలన్న విచ్ఛిన్న విషంతో వస్తున్నది అని ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) ఆరోపించింది.

స్వదేశీ వ్యక్తులుగా నాగాకు ఏ తరగతీ, ఏ సరిహద్దూ లేదని అది పేర్కొన్నది. ‘నాగాలు ఒక్కటే, నాగాలు తమ దైవదత్తమైన భూమి నాగాలిమ్‌లో ఎక్కడ నివసించినా స్వదేశీలే’ అని ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) స్పష్టం చేసింది. అందువల్ల, కృత్రిమ రాష్ట్ర సరిహద్దు ప్రాతిపదికగా స్వదేశీని వర్గీకరిస్తున్న ఆర్‌ఐఐఎన్ ప్రస్తుత రూపం ‘నాగా ప్రజలకు ఆమోదయోగ్యం కాదు, ఏదిఏమైనా మేము ప్రతిఘటిస్తాం’ అని ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) ఉద్ఘాటించింది. 2021 డిసెంబర్ 4న ఓటింగ్ మారణకాండలో ప్రమేయం ఉన్న 30 మంది భారత సైనిక సిబ్బందిపై గత సెప్టెంబర్ 17న క్రిమినల్ విచారణను సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని ఎన్‌ఎస్‌సిఎన్‌ఐఎం, నాగా విద్యార్థి సంఘాలు విమర్శించాయి. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, 1958 (అఫ్‌స్పా) సెక్షన్ 6 దృష్టా సైనిక సిబ్బందిపై క్రిమినల్ విచారణ ప్రారంభించే అధికారం నాగాలాండ్ ప్రభుత్వానికి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం కింద సైనికాధికారులపై ఏ క్రిమినల్ విచారణనైనా ప్రారంభించేందుకు కేంద్రం ముందస్తు అనుమతి ఇవ్వవలసిన అవసరం ఉంది.

2023 ఫిబ్రవరి 28న ఆ సిబ్బందిపై ప్రాసిక్యూషన్ అనుమతి మంజూరును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనులను కేంద్రం ఈ విధంగా రక్షిస్తుండడం కూడా కేంద్రం, ఇతర నాగా సంఘాలతో సహా నాగా తిరుగుబాటు వర్గాల మధ్య అంతరాన్ని పెంచుతోంది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి నాగా తిరుగుబాటు వర్గాల మధ్య ఒప్పందాల మీద ఒప్పందాలు కుదిరాయి. అయితే, నాగా శాంతి ప్రక్రియపై భేదాభిప్రాయాలు కానవస్తున్నాయి. 1997 కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు జరిగిన 18 సంవత్సరాల తరువత 2015లో ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ కుదిరింది. అటు పిమ్మట 9 సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ సంక్లిష్ట సమస్యకు హేతుబద్ధ పరిష్కారం మనకు కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ దేశ శాంతి కాముక ప్రజలు పరస్పర విశ్వాస వాతావరణంలో నాగా సమస్యలకు చిరకాల పరిష్కారం కుదరగలదని ఆశిస్తున్నారు.

గీతార్థ పాఠక్, ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News