ఫాంటేన్‌లీ కాంటే: యువతలో అవాంఛిత గర్భాలను తగ్గించడం కోసం 18నుంచి 25 ఏళ్ల లోపు యువకులందరికీ ఫార్మసీల్లో (మందుల దుకాణాల్లో) ఉచితంగా అందజేయనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మ్యాక్రోన్ ప్రకటించారు. ‘గర్భ నిరోధకంలో ఇదొక చిన్న విప్లవం’ అని పశ్చిమ ఫ్రాన్స్‌లోని ఫాంటేన్‌లీ కాంటేలో గురువారం యువతతో ఆరోగ్యంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమం సందర్భంగా మ్యాక్రోస్ చెప్పారు. పాతికేళ్ల లోపు యువతులందరికీ ఉచితంగా గర్భ నిరోధక శస్త్ర చికిత్సలు అందజేయడాన్ని ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు యువకులకు ఉచితంగా కండోమ్‌లను అందజేయాలని నిర్ణయించడం గమనార్హం.
ఎయిడ్స్, ఇతర లైంగిక వ్యాధుల వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఇప్పటికే డాక్టర్లు లేదా మిడ్‌వైఫ్‌లు కండోమ్‌లను ప్రిస్కైబ్ చేసినట్లయితే జాతీయ వైద్య వ్యవస్థ వాటిని తిరిగి చెల్లిస్తోంది. కాగా సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నామని, థియరీతో పోలిస్తే వాస్తవం చాలా చాలా భిన్నంగా ఉందని అధ్యక్షుడు అంటూ ఈ విషయంలో టీచర్లను మరింత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా సదస్సులో మాస్క్ ధరించి కనిపించిన మ్యాక్రోన్ తాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటిస్తున్నానని అన్నారు. సెలవుల నేపథ్యంలో కొవిడ్ కేసులు పెరక్కుండా చూడడం కోసం రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లను ధరించాలని, బూస్టర్ డోసులు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.