అనర్హతపై బాక్సింగ్ రింగ్ వద్దే కూర్చుని ఫ్రాన్స్ బాక్సర్ నిరసన
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. హెవీ వెయిట్విభాగంలో ఫ్రాన్స్ బాక్సర్ మౌరాద్ అలీవ్ బాక్సింగ్ రింగ్‌పై కూర్చుని నిరసన తెలియజేశాడు. ఉదయం బ్రిటీష్ బాక్సర్ ఫ్రేజర్ క్లర్క్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడిన సందర్భంగా మౌరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో మౌరాద్‌పై రెండో రౌండ్లో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిపై ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టి గాయపరిచడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో న్యాయనిర్ణేతలు ఫ్రేజర్ క్లర్క్‌ను విజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ బాక్సర్ బాక్సింగ్ రింగ్ వద్ద కూర్చుని నిరసన తెలియజేశాడు. అనంతరం ఆ దేశ అధికారులు వచ్చి అతనితో మాట్లాడాక అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి అక్కడే కూర్చుని తన నిరసనను తెలియజేశాడు. కాగా అంతకు ముందు తొలి రౌండ్లో క్లర్క్‌పై మౌరాదే పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
అయిదుగురు న్యాయనిర్ణేతల స్కోరులో అతనికే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కానీ రెండో రౌండ్లో మరింత దూకుడుగా ఆడిన ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు.ఈ క్రమంలోనే మౌరాద్ ప్రత్యర్థిపై పలుమార్లు తలతో దాడి చేశాడు. రిఫరీ అతడిని ఆపేందుకు ప్రయత్నించినా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో కొద్ది సేపట్లో మ్యాచ్ ముగుస్తుందనుకునే సమయంలో మౌరాద్ అనర్హతకు గురయ్యాడు. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రిటీష్ బాక్సర్ .. తాను ఆ సమయంలో మౌరాద్‌ను స్థిమితంగా ఉండమని చెపానని అన్నాడు. అతడు తనపై దాడి చేశాడని, అయితే అది ఉద్దేశపూర్వకమో లేక అలా జరిగిపోయిందో తనకు తెలియదన్నాడు. ఏదేమైనా క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదన్నాడు. కాగా 1988 సియోల్ ఒలింపిక్స్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పట్లో దక్షిణ కొరియా బాక్సర్ బై యున్ జంగ్ ఇల్‌పై రెండు పెనాల్టీ పాయింట్లు విధించడంతో అప్పుడతను దాదాపు గంట సేపు రింగ్‌లో అలాగే ఉండిపోయి అభ్యతరం తెలిపాడు.