జలాంతర్గాముల ఒప్పందం రద్దుకు నిరసనగా..
క్యాన్‌బెర్రా: తమతో చేసుకున్న 90 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల(66 బిలియన్ల అమెరికన్ డాలర్ల) జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడం పట్ల ఫ్రాన్స్ ఘాటుగా స్పందించింది. అమెరికా తయారీ అణు జలాంతర్గాముల కోసం తాజాగా ఆస్ట్రేలియా మరో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆ రెండు దేశాల నుంచి తమ రాయబారులను తక్షణమే వెనక్కి పిలిపిస్తున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. ఇండోపసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యుకె కూటమిగా ఏర్పాటైన నేపథ్యంలో ఫ్రాన్స్‌తో 2016లో 12 డీజిల్‌ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ల కొనుగోలుకు జరిగిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకోవడం వివాదానికి కారణమైంది. ఆస్ట్రేలియా చాలా పెద్ద తప్పు చేసిందని ఈ సందర్భంగా ఆ దేశంలోని ఫ్రాన్స్ రాయబారి జీన్‌పెర్రే థేబాల్ట్ వ్యాఖ్యానించారు. భాగస్వామ్య దేశంతో ఆస్ట్రేలియా చాలా చెడ్డగా వ్యవహరించిందన్నారు. ఆస్ట్రేలియాతో తమ దేశానికి జరిగిన ఒప్పందాన్ని నమ్మకానికి, పరస్పర అవగాహనకు గుర్తుగా భావించామని ఆయన అన్నారు. పారిస్ నుంచి ప్రకటన వెలువడిన 17 గంటల్లోనే ఆస్ట్రేలియా నుంచి దోహా(కతార్) మీదుగా విమానంలో తమ దేశానికి థేబాల్ట్ బయలుదేరారు.