Tuesday, October 8, 2024

మా దేశంలోకి రావడానికి వీల్లేదు

- Advertisement -
- Advertisement -

లాడెన్ కుమారుడిపై ఫ్రాన్స్ ఆంక్షలు కఠినతరం

పారిస్: అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారులలో ఒకరైన ఓమర్ బిన్ లాడెన్ ఫ్రాన్స్‌కు తిరిగిరాకుండా అదనపు చర్యలు తీసుకున్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి మంగళవారం ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో నివసించిన ఒమర్ బిన్ లాడెన్ ఫ్రెంచ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023 అక్టోబర్‌లో దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మరో రెండేళ్ల పాటు దేశంలోకి రావడానికి వీల్లేదని కూడా ఆ సందర్భంగా ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. గతంలో తాము జారీచేసిన ఆదేశాలను మరింత కఠినతరం చేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఏ కారణంపైన కూడా ఓమర్ తమ దేశంలోకి రావడానికి వీల్లేదని మంగళవారం స్పష్టం చేసింది.

ఈ మేరకు ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బ్రూనో రిటాలియో ఎక్స్ వేదికగా ఒక ప్రకటన జారీచేశారు. కాగా..ఓమర్ ప్రస్తుతం ఖతార్‌లో నివసిస్తున్నట్లు లే పారిసీన్ పత్రిక వెల్లడించింది. 2016 నుంచి తన బ్రిటిష్ భార్యతో కలసి నార్మండిలోని ఆర్నే ప్రాంతంలో నివసిస్తున్న ఓమర్ బిన్ లాడెన్ ఆర్టిస్టని పత్రిక తెలిపింది. ఫ్రాన్స్‌కు తిరిగిరాకుండా ప్రభుత్వం తనపై విధించిన నిషేధంపై చేసిన న్యాయపోరాటంలో ఓమర్ గతవారం ఓడిపోయినట్లు పత్రిక తెలిపింది. తీవ్రవాదం పట్ల సానుభూతి చూపే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టిన ఓమర్ బిన్ లాడెన్‌ను దేశం విడిచి వెళ్లాలంటూ ఫ్రాన్స్ అధికారులు గతంలో ఆదేశించినట్లు పత్రిక వివరించింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడులకు ప్రధాన సూత్రధారైన ఓమర్ తండ్రి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా నౌకాదళానికి చెందిన కమాండోలు 2011లో పాకిస్తాన్‌లో హతమార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News