రూ.15.37లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితులు
యూపికి చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: ఇన్సూరెన్స్ చేస్తే రివర్‌సల్ బోనస్ పాయింట్లు, లాయల్టీ బోనస్ వస్తుందని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను నగర సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పది మొబైల్ ఫోన్లు, ఐదు డెబిట్ కార్డులు, మూడు బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌కు చెందిన దేవాన్ష్ రస్తోగి, ఇమ్రాన్ ఖాన్ నోయిడాలోని కాల్ సెంటర్‌లో పనిచేశారు. కరోనా వల్ల పనిచేస్తున్న సంస్థ జీతాలు ఇవ్వకపోవడంతో అక్టోబర్, 2020లో ఉద్యోగం మానివేశారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇద్దరు కలిసి చిన్ననాటి స్నేహితుడు, ఇన్సూరెన్స్ ఫీల్డ్‌లో పనిచేస్తున్న మన్‌జీత్ చౌదరిని కలిశారు. అతడి నుంచి ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నారు.
సులభంగా డబ్బులు సంపాదించేందుకు అమాయకులకు ఫోన్ చేసి ఇన్సూరెన్స్ చేస్తే బోనస్‌పాయింట్లు, లాయల్టీ బోనస్ వస్తుందని చెప్పి మోసం చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే బేగంపేటకు చెందిన వృద్ధురాలు (80) ఫోన్ చేశారు. ఇన్సూరెన్స్ కడితే బోనస్, లాయల్టీ వస్తుందని చెప్పారు, దీంతో బా ధితురాలు వారిని నమ్మి డబ్బులు కట్టింది. ఆర్‌బిఐ ఛార్జీలు, సెబి ఛార్జెస్, జిఎస్‌టి ఛార్జీలు తదితర వాటి చెప్పి రూ.15.37లక్షలు వసూలు చేశారు. నిందితులు చెప్పినట్లు లాయల్టీ బోనస్, బోనస్ పాయింట్లు రాకపోవడమే కాకుండా నిందితులు మళ్లీ డబ్బులు కావాలని అడగడంతో మోసపోయాననని గ్రహించి నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్సై మధుసూదన్ రావు కేసు దర్యాప్తు చేశారు.