Wednesday, January 15, 2025

ఓఎల్‌ఎక్స్‌లో మోసం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఓఎల్‌ఎక్స్ వేదికగా నేరస్థులు రెచ్చిపోతున్నారు, చాలా మంది తమ వస్తువులను విక్రయించాలన్నా, కొనుగోలు చేయాలన్నా దీనిని ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు మోసాలకు తెరతీస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో సైబర్ నేరస్థులు ఇచ్చిన ప్రకటనలను చూసి అమాయకులు మోసపోతున్నారు. తక్కు ధరకు వస్తువులు వస్తాయనుకుని నమ్మి వారికి డబ్బులు పంపిస్తూ మోసపోతున్నారు. కొంత కాలం ఇలాంటి నేరాలు తగ్గినా ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓఎల్‌ఎక్స్ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిల్లో చాలామంది బాధితులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. తక్కువ ధరకు ఫోన్లు, కార్లు విక్రయిస్తామని చెప్పి కార్ల ఫొటోలు పెట్టి ప్రకటనలు ఇవ్వడంతో ఆకర్షితులవుతున్న బాధితులు సైబర్ నేరస్థులు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా వినియోగదారులు మారడంలేదు. సైదాబాద్‌కు చెందిన యువతి తన తన గిటార్‌ను ఓఎల్‌ఎక్స్‌లో విక్రయించేందుకు యాప్‌లో అప్‌లోడ్ చేసింది. వెంటనే స్పందించిన సైబర్ నేరస్థులు బాధితురాలిని సంప్రదించారు. తాము గిటార్ కొనుగోలు చేస్తానని చెప్పాడు. డబ్బులు ముందుగా పంపించాలని యువతి కొరగా నిందితులు నిరాకరించారు. తాము క్యూఆర్ కోడ్ పంపిస్తామని, దానిని స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడంతో యువతి బ్యాంక్ ఖాతా నుంచి రూ.96,600 మాయం అయ్యాయి. వెంటనే మోసం గ్రహించిన యువతి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మోటార్ సైకిళ్లు, కార్లు….
సైబర్ నేరస్థులు ముఖ్యంగా మోటార్ సైకిళ్లు, కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిని లక్షంగా చేసుకుని మోసం చేస్తున్నారు. అమాయకులను నమ్మించేందుకు ఖరీదైన కార్లను తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి కార్ల ఫొటోలతో ప్రకటనలు ఇస్తున్నారు. అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కూడా తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పడంతో నమ్ముతున్నారు. బాధితులను నమ్మించేందుకు తాము ఆర్మీలో పనిచేస్తున్నామని నకిలీ ఐడి కార్డు తదితరాలను కూడా వాటికి జతచేయడంతో బాధితులు సులభంగా నమ్ముతున్నారు. వారి డబ్బులు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా చెప్పగానే చేస్తున్నారు. తర్వాత నిందితులు దశల వారీగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు తప్ప కార్లు, బైక్‌లను పంపించడంలేదు. దీంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. గతంలో సైబర్ నేరస్థులు తమ బ్యాంక్ ఖాతాలకు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయించుకునే వారు, దీంతో సులభంగా పట్టుబడడంతో ఈ వ్యాలెట్లకు డబ్బులను బదిలీ చేయించుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News