నైజీరియన్‌ను అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ : మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయం అయిన వ్యక్తి గిఫ్టులు పంపిస్తున్నానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన నైజీరియన్‌ను నగర సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బేగంపేటకు చెందిన యువతి తెలుగు మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. బాధితురాలి ఫ్రొఫైల్‌ను చూసిన నైజీరియన్ ఓషర్ ఎబుక విక్టర్ చూసి తాను అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నానని చెప్పి పరిచయం చేసుకున్నాడు. గత కొంత కాలం నుంచి ఇద్దరు తరచూ ఛాటింగ్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నిందితుడు బాధితురాలికి డాలర్లు గిఫ్టుగా పంపిస్తున్నానని చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులమని ఫోన్ చేశారు. మీకు డాలర్లు గిఫ్టుగా వచ్చాయని, వాటికి ఎలాంటి అనుమతి లేదని, చట్టవిరుద్ధమని చెప్పారు. వివిధ ఛార్జెస్ కింద రూ.10లక్షలు కట్టాలని చెప్పారు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు దశలవారీగా రూ.10లక్షలు పంపించింది. కొద్ది రోజుల తర్వాత కూడా మళ్లీ డబ్బులు కావాలని ఫోన్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.