మనతెలంగాణ, సిటిబ్యూరోః తాను చెప్పిన కంపెనీలో పెట్టుబడిపెడితే అధికంగా లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…గాజులరామారానికి చెందిన క్షితిజ్ కుమార్ టాటా క్యాపిటల్ ఫైనాన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ విరమణ చేసిన పలువురు సీనియర్ సిటిజన్లకు తాను చెప్పిన కంపెనీలో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించాడు.
దీనిని నమ్మిన ఎఎం కన్నన్ ని ప్రో డిజైన్ అడ్వర్‌టైజింగ్, అర్బన్ వన్, బిజినెస్ వన్ కార్పొరేషన్, మ్యాగ్నస్ కార్పొరేషన్, గ్రోమేనేజ్‌మెంట్, వ్యాలిడస్ ప్రాజెక్ట్‌లో రూ.3,56,74,000 పెట్టుబడి పెట్టాడు. ఏడాదికి రూ.12శాతం లాభాలు వస్తాయని చెప్పడంతో టాటా క్యాపిటల్‌లో పెట్టుబడి పెట్టేవాడు, నిందితుడు చెప్పిన కంపెనీలో పెట్టుబడిపెట్టాడు. ఇలా పెట్టడంతో నిందితుడికి కమీషన్ రూపంలో రూ.47,48,000 వచ్చింది. బాధితుడికి 2021 వరకు పెట్టినపెట్టుబడిలో కేవలం రూ.36,94,989 మాత్రమే వచ్చింది. లాభం కాకుండా ఉన్న డబ్బులు పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.