Friday, December 20, 2024

ఉద్యోగాల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్టు
పోలీసుల అదుపులో 32మంది టెలీకాలర్లు
వివరాలు వెల్లడించిన సైబర్ క్రైం డిసిపి స్నేహామెహ్రా

హైదరాబాద్: డేటా ఎంట్రి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు 32మంది టెలీ కాలర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14ల్యాప్‌టాప్‌లు, 148 మొబైల్ ఫోన్లు, రూ.1,03,500 నగదు, ఫార్చూనర్, బిఎండబ్లూ, మహీంద్రా కారును స్వాధీనం చేసుకున్నారు.

సైబర్ క్రైం డిసిపి స్నేహామెహ్రా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన గడగోని చక్రదర్‌గౌడ్ డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ఎల్‌ఐసి ఏజెంట్‌గా కొద్ది రోజులు పనిచేసిన తర్వాత కోటక్ మహీంద్ర బ్యాంక్, జిఈ మణీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశాడు. తర్వాత తన స్నేహితులు గణేష్, శ్రావన్‌తో కలిసి పంజాగుట్టలో బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని ఆఫీస్ తెరిచాడు. ఇందులో 32మందిని టెలీ కాలర్లుగా నియమించుకున్నాడు. ఎపి, కర్నాటక, కేరళ, తమిళనాడుకు చెందిన వారికి ఫోన్లు చేసి డేటా ఎంట్రి ఉద్యోగాలు ఇప్పిస్తామని నెలకు జీతం రూ.20 నుంచి రూ.25,000 ఇస్తామని చెబుతున్నారు.

దీనిని నమ్మిన వారి నుంచి వివిధ ఛార్జీల కింద రూ.2,500 వసూలు చేస్తున్నారు. డబ్బులు అందిన తర్వాత నిందితులు సిమ్ తీసివేసి బాధితులకు దొరక్కుండ తప్పించుకుంటున్నారు. దీనికి ప్రధాన నిందితుడు చక్రధర్‌గౌడ్ అనంతపురానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వద్ద ఎయిర్‌టెల్ బ్యాంక్‌కు లింక్ ఉన్న సిమ్ కార్డును వెయ్యి రూపాయలకు ఒకటి చొప్పున కొనుగోలు చేస్తున్నాడు. మొబైల్ ఫోన్లను నగరంలోని జగదీష్ మార్కెట్ నుంచి కొనుగోలు చేశాడు.

వాటిని ఉపయోగించి డేటా ఎంట్రీలో జెపిజి ఫార్మాట్‌ను పిడిఎఫ్‌కు మార్చితే డబ్బులు ఇస్తామని చెప్పడంతో చాలామంది బాధితులు ఇంటి వద్దే ఉండి చేసే ఉద్యోగం కావడం, తక్కువ మొత్తంలో డబ్బులు అడగడంతో చెల్లిస్తున్నారు. ఇలా చాలామంది నిరుద్యోగులను మోసం చేస్తూ నెలకు నిందితులు సుమారు రూ.50లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్లు రఘునాథ్, శ్రీనాథ్, ఖలీల్‌పాషా, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News