హైదరాబాద్: ఆర్‌బిఐలో అటెండర్లు, క్లర్కుల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 7 నకిలీ జాబ్ లెటర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మొరచిక్కం సంజీవయ్య అలియాస్ జీవయ్య, ఫిరోజ్ సులేమాన్, కిరణ్ కలిసి ఆర్‌బిఐలో క్లర్క్, అటెండఱ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు మహిళలు భార్గవి, శశిరేఖ నుంచి రూ8లక్షలు వసూలు చేశారు.
తర్వాత బాధితులకు జాబ్ వచ్చినట్లు నకిలీ లేఖలు తయారు చేసి బాధిత మహిళలకు అందజేశారు. దాదాపుగా ఏడుగురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేశారు. వాటిని తీసుకుని వెళ్లిన బాధితులు నకిలీవని తెలియడంతో బాధిత మహిళలు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడు కిరణ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.