Monday, January 20, 2025

లోన్ల పేరుతో మోసాలు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కరోనా ముగియడంతో సాధారణ జీవనం నెలకొంది. దీంతో ప్రజలకు అవసరాలు పెరగడంతో డబ్బుల కోసం వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు తెలిసిన వారి వద్ద అప్పుగా తీసుకుంటుండగా, మిగతా వారు లోన్ల కోసం పలువురిని ఆశ్రయిస్తున్నారు. కొందరు ఇంటర్‌నెట్‌లో లోన్ల కోసం వెతుకుతూ సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతున్నారు. లోన్లు రావడం దేవుడెరుగు కానీ అప్పులు చేసి సైబర్ నేరస్థులకు డబ్బులు పంపించడంతో నెత్తిపై మరింత భారంపడి బాధితులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మోసగాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు ముడు పోలీస్ కమిషనరేట్లలో రోజు రోజుకు పెరుగుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలో లోన్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారు, నిందితులు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పలువురు బాధితులకు ఫోన్లు చేస్తున్నారు.

బజాజ్ ఫైనాన్స్‌లో తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని చెబుతున్నారు. వీరి మాటలు నమ్మిన వారి వద్ద నుంచి గుర్తింపు కార్డులు తీసుకుని లోన్ ఇప్పిస్తున్నట్లు నటిస్తున్నారు. తర్వాత వారి ప్లాన్‌ను అమలు చేస్తున్నారు, రుణం రావడానికి ఖర్చు అవుతుందని చెప్పడంతో బాధితులు ఒప్పుకుని వారి బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నారు. అప్పటి నుంచి నిందితులు బాధితుల ఫోన్లను స్పందించడం మానివేస్తున్నారు. ఇలా చాలామందికి ఫోన్లు చేసి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. సైబరాబాద్‌కు చెందిన ఓ బాధితుడికి ఫోన్ చేసిన నిందితులు లక్ష రూపాయల రుణం ఇప్పిస్తామని చెప్పారు. కానీ ఇన్సూరెన్స్, లోన్ ఫీజు తదితర వాటికి ఖర్చు అవుతాయని చెప్పడంతో రూ.4,37,256 పంపించాడు. వాటిని తీసుకున్న నిందితులు మళ్లీ వివిధ కారణాలు చెప్పి డబ్బులు అడుగుతున్నారు. దీంతో బాధితుడికి అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బీహార్‌కు చెంది ఈ ముఠా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాగే తొమ్మిది మందిని మోసం చేసినట్లు విచారణలో తెలిసింది.
రాచకొండలో…
ఎపిలోని చిత్తూరు జిల్లాకు చెందిన పేరసోముల వీరనారాయణ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరనారాయణ గతంలో సినీమా నిర్మించి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏదోఒకటి ప్లాన్ చేశాడు. రుణాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేయాలని ప్లాన్ వేశాడు. కొందరికి ఫోన్లు చేసి రుణం ఇప్పిస్తామని చెప్పాడు. ఈ క్రమంలోనే యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన మండల మల్లేష్‌కు ఫోన్ చేశాడు. తాను అవసరం ఉన్న వారికి లోన్లు ఇప్పిస్తుంటానని చెప్పాడు.జీరో వడ్డీతో రుణం ఇప్పిస్తానని బాధితుడికి చెప్పాడు, ఇది నిజమని నమ్మిన బాధితుడు తన ఆధార్ కార్డు, పాన్ నంబర్‌ను ఇచ్చాడు.

బాధితుడికి వివరాలు ఓ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసి అతడి పేరుపై ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేశాడు. వాటిని తనకు తెలిసిన వారికి తక్కువ ధరకు విక్రయించి డబ్బులు తీసుకుని అవసరాలు తీర్చుకుంటున్నాడు. బాధితుడి పేరుపై తీసుకున్న ఈఎంఐ డబ్బులు కట్టకపోవడంతో మల్లేష్‌కు సదరు సంస్థ నటీసులు పంపించింది. వాటిని చూసిన బాధితుడు తాను ఎలాంటి రుణం తీసుకోలేదని, వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News