లక్నో: అరవై ఏళ్లు దాటిన మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం త్వరలో కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (యుపిఎస్‌ఆర్‌టిసి) కు చెందిన 150 కొత్త డీజిల్ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రక్షాబంధన్ దృష్టా పదోతేదీ అర్ధరాత్రి నుంచి 12 వ తేదీ అర్థరాత్రి వరకు 48 గంటల పాటు మహిళలకు యుపిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం ప్రకటించారు.
2019 కుంభమేళా తరువాత ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం భారీ ఎక్సర్‌సైజుగా ప్రకటించారు. ప్రపంచ స్థాయి నాణ్యత గల విమానాశ్రయాలను నిర్మిస్తున్నప్పుడు అదే స్థాయిలో బస్సు స్టేషన్లను ఎందుకు నిర్మించకూడదని ప్రశ్నిస్తూ డార్మిటరీలు, రెస్టారెంట్లు , క్లీన్ టాయిలెట్లు వంటి సౌకర్యాలతో బస్ స్టేషన్లు నిర్మాణం కావాలని పిలుపునిచ్చారు. రవాణా విభాగం లోని సర్వీసులు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, పాతబస్సులకు బదులు కొత్త బస్సులను ప్రవేశ పెట్టడం తప్పనిసరి అని ప్రస్తావించారు. రవాణా విభాగానికి డ్రైవర్ల తాలూకు వార్షిక ఆరోగ్య నివేదిక అవసరమని అభిప్రాయ పడ్డారు. ఐటిఐలతో రాష్ట్ర రవాణా కార్పొరేషన్ వర్కుషాపులను అనుసంధానం చేయాలని రవాణా మంత్రికి సూచించారు. దీనివల్ల యువతకు శిక్షణ వల్ల నైపుణ్యం లభిస్తుందని సూచించారు.