Monday, December 23, 2024

లక్షా 25వేల మందికి ఉచిత కోచింగ్

- Advertisement -
- Advertisement -

Free coaching for 1 lakh 25 thousand people

కోచింగ్ కోసం బిసి స్టడీ సర్కిల్‌లో 16న ఆన్, ఆఫ్‌లైన్ పరీక్ష, 119 నియోజకవర్గాల్లోని వారందరికీ కోచింగ్ గ్రూప్-1, గ్రూప్-2 రాసే 10వేల మందికి స్టైఫెండ్, సంక్షేమ భవన్‌లో ఉచిత కోచింగ్ వివరాలు వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్

మన : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బిసి వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించనున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బిసి స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికిపైగా ఉచిత కోచింగ్ నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం సంక్షేమ భవన్‌లో బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రావెంకటేశంతో కలిసి మంత్రి ఉచిత కోచింగ్ వివరాలు వెల్లడించారు.టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే గ్రూప్ 1,2,3,4తో పాటు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, వివిద రకాల ఇతర ఉద్యోగాలకు పోస్టుల వారీగా కోచింగ్ సదుపాయాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. టేడూగూప్ 1, గ్రూప్ 2 రాసే 10 వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు ఆరు నెలల పాటు నెలకు రూ.5 వేలు, గ్రూప్ 2 అభ్యర్థులకు మూడు నెలల పాటు నెలకు రూ.2 వేలు, ఎస్‌ఐ అభ్యర్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.

బిసి సంక్షేమ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 11 స్టడీ సర్కిళ్లతో పాటు సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట్, జగిత్యాలలో మరో ఐదు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కోచింగ్ అందజేస్తామని అన్నారు. అదే విదంగా స్టడీ సర్కిళ్లు లేని ప్రతీ నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్‌లైన్ క్లాస్‌రూమ్, ప్యాకల్టీతో కూడిన డౌట్ క్లియరెన్స్ రూం… ఇలా మూడు రూములతో కూడిన 103 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎన్‌జిఒలు ఉచితంగా మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఏర్పాటు చేస్తే అక్కడ సైతం బిసి స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వీటి ద్వారా కోచింగ్‌తో పాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను అభ్యర్థులకు అందజేస్తామని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో 16 బిసి స్టడీ సర్కిళ్ల ద్వారా 25 వేల మందికి నేరుగా, మరో 50 వేల మందికి హైబ్రిడ్ మోడల్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో శిక్షణ ఇస్తామని, అలాగే 103 బిసి స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో సెంటర్‌లో 500 మందికి తగ్గకుండా మరో 50 వేల మందికి మొత్తంగా 1,25,000 మందికి నాణ్యమైన శిక్షణ అందిస్తామని చెప్పారు. బిసి సంక్షేమ శాఖ అందించే కోచింగ్‌లో బిసిలకు 75 శాతం, ఎస్‌సిలకు 10 శాతం,ఎస్‌టిలకు 5 శాతం, ఇబిసిలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు రిజర్వేషన్లు కేటాయిస్తామన్నారు. బిసి సంక్షేమ శాఖ అందించే ఉద్యోగార్థుల శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తక్షణమే ప్రారంభించామని తెలిపారు. ఆన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌కు బుధవారం నుండి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుందని, 10 గంటల వరకు కూడా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కోచింగ్‌కు అర్హులైన వారి కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News