Saturday, November 23, 2024

ఆ జైలు ఖైదీలు సరస్వతీ పుత్రులు!

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: నేరాలు చేసి జైలు జీవితాన్ని గడుపుతున్నప్పటికీ చదువుపై తమ ఆసక్తిని చంపుకోలేదు ఆ ఖైదీలు. జైల్లో ఖైదీలుగా గడుపుతూనే పట్టుదలతో చదవి పట్టభద్రులయ్యారు. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లో ఉన్న భోండ్సీ జిల్లా జైలుకు చెందిన ఖైదీలు డిగ్రీలతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. గడచిన ఐదేళ్లలో 850 మందికి పైగా ఖైదీలు 10, 12, డిగ్రీ, పిజి డిగ్రీలు జైల్లో ఉండే సాధించారు. ఖైదీలలో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించడానికి జైలు యంత్రాంగం వారి కోసం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన పాఠ్యపుస్తకాలను కూడా సమకూరుస్తోంది.

కొందరు ఖైదీలు వృత్తివిద్యా కోర్సులను పూర్తి చేయగా మరికొందరు అక్షరాస్యతా మిషన్ కింద విద్యార్జన చేశారని భోండ్సీ జైలుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తాము చదువుకున్న చదువులతో జైలు శిక్ష పూర్తయి బయటకు వెళ్లిన తర్వాత నేర కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని ఖైదీలు ఆశిస్తున్నారని ఆయన చెప్పారు.
ఖైదీలకు చదువు విలువను తెలియచేయడంతోపాటు చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలను వారికి సమకూరుస్తున్నామని జైలు డిప్యుటీ సూపరింటెండెంట్ చరణ్ సింగ్ తెలిపారు.

2017 నుంచి 2021 మధ్య 307 మంది ఖైదీలు డిగ్రీలు, పిజిలు పూర్తి చేశారని ఆయన చెప్పారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిఈ నుంచి ఖైదీలకు డిగ్రీలు అందచేసినట్లు ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో 1149 మంది డిగ్రీకి, పిజికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. వీరిలో 677 మంది పరీక్షకు హాజరుకాగా 307 మంది డిగ్రీలు సాధించారని ఆయన తెలిపారు. వీరుగాక 91 మంది ఖైదీలు గత ఐదేళ్లలో 10, 12 తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని ఆయన చెప్పారు. 87 ఎకరాల వస్తీర్ణంలో ఉన్న భోండ్సీ జైలులో 2412 మంది ఖైదీలను ఉంచుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News