Thursday, January 23, 2025

వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులివ్వాలి

- Advertisement -
- Advertisement -

Free electricity and ration card should be given to disabled people

మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులివ్వాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఎస్‌వికెలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వికలాంగుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. వికలాంగుల సమస్యల పరిష్కారానికి దశల వారి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ఎన్‌పిఆర్‌డి అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, ఎం.అడివయ్యలు అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారని వారిలో కేవలం 4.83 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. 2018 తర్వాత కొత్తవారికి పెన్షన్లు మంజూరు కాలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 3.51 లక్షల ఆసరా పింఛన్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని ప్రతి వికలాంగుడికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. వికలాంగుల్లో 9 శాతం మంది మాత్రమే మాద్యమిక విద్యా పూర్తి చేస్తున్నారని, 40 శాతం లోపు స్కూళ్ళలో మాత్రమే ర్యాంపులు ఉన్నాయని, 17 శాతం పాఠశాలల్లో వికలాంగులు వినియోగించుకునే విధంగా టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

వికలాంగుల పిల్లలకు విద్యా ప్రత్యామ్నయాలపై పాలకుల్లో చిత్తశుద్ది లేదన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసి వికలాంగులను విద్యకు దూరం చేసే విధంగా ఉందని అన్నారు. వినికిడి లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ప్రభుత్వాసుపత్రిలో వినికిడి పరీక్షలు నిర్వహించాలని, కక్లియార్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్స్ ఉచితంగా చేయాలని, కోరారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 21 రకాల వైకల్యాల వారికి వైకల్య ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయడం వల్ల వికలాంగులకు రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. షరతులు లేకుండా ఉచిత బస్సుపాలు ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో రైల్వే ఆన్‌లైన్ పాసుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, ఉపాధ్యక్షులు జర్కొని రాజు, టి. మధుబాబు, ఆరిఫా, సహాయ కార్యదర్శులు వి. ఉపేందర్, జె.దశరథ్, కవిత, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News