హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే…కేవలం రెండు సంవత్సరాల్లోనే వెలుగు జిలుగుల భారత్‌గా తయారు చేస్తామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే దళిత వర్గాల కోసం దళిత బంధును అమలు చేసి తీరుతామన్నారు. ఇలాంటి పనులు చేయాలంటే పాలకులకు అంకిత భావం మెండుగా ఉండాలన్నారు. రైతులు, దళితుల సంక్షేమం కోసం పెట్టే నిధులు ప్రభుత్వాలకు భారంగా అనుకోవడం మూర్ఖత్వమన్నారు. దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ ప్రజలకు వాటిని అందించలేని దుస్థితిలో భారతదేశం ఉండడం శోచనీయమని కెసిఆర్ వ్యాఖ్యానించారు. కావాల్సినంత నీరు, కరెంటు ఉన్నప్పటికీ ఇంకా వాటికి నోచుకోని గ్రామాలు, పట్టణాలు, ఉండడం అత్యంత బాధాకరమన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా ప్రజలు నీరు, కరెంటు కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉందా? అని ఆయన అడిగారు. ఇదేనా దేశ ప్రజలు కోరుకుంటున్నదని ప్రశ్నించారు. దీనిపై ఎవరో ఒకరు నిలదీయాల్సిన అవసరముందన్నారు. అందుకు సరైన వేదిక బిఆర్‌ఎస్ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. దాని కోసం బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో గుణాతక్మ మార్పు కోసమే బిఆర్‌ఎస్‌ను తీసుకొచ్చామన్నారు. దేశంలోని ఆలోచనపరులను ఏకం చేస్తుందన్నారు. వ్యక్తులు కాదు వ్యవస్థీకృతంగా పనులు జరగాలన్న లక్షంతో ముందుకు సాగుతామన్నారు.
సోమవారం ఎపి రాష్ట్రానికి చెందినమాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్‌ఎస్ చింతల పార్థసారధి, టిజె ప్రకాశ్, కాపునాడు జాతీయ అధ్యక్షుడు రమేశ్ నాయుడు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడుతో పాటు, రామారావు, ఇతర కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కుండువాలు కప్పి కెసిఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ, దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదన్నారు.
కేవలం రూ 1.45 లక్షల కోట్లతో దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చు అని అన్నారు. అలాగే దళితబంధు పథకాన్ని ఏటా 25 లక్షల మందికి చొప్పున దళితబంధు ఇస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనా సరళిని మార్చి మహోజ్వల భారత దేశ నిర్మాణం కోసమే బిఆర్‌ఎస్ పనిచేస్తుందన్నారు. దేశంలో పాలనను వ్యక్తుల చుట్టూ కాకుండా వ్యవస్థీకృతం చేసేందుకే కృషి చేస్తామన్నారు. జాతి అభివృద్ధి కోసం తపనపడే టీంను దేశవ్యాప్తంగా తయారు చేసేందుకే బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు.
మోడీది ప్రైవేటైజేషన్…బిఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్
కేంద్రంలోని మోడీ సర్కార్ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే…. దానిని మళ్లీ బిఆర్‌ఎస్ తిరిగి తీసుకుంటుందని కెసిఆర్ అన్నారు. తన చేతిలో అధికారం ఉందన్న నెపంతో మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోరికలను, వారి ఆంక్షలను మంటలో కలిపి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మోడీకి ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా….. మీది ప్రైవేటైజేషన్ అయితే మాది (బిఆర్‌ఎస్) నేషనలైజేషన్ అని అన్నారు. విశాఖ ఉక్కును విక్రయించినా…. దానిని తిరిగి స్వాధీనం చేసుకుని పబ్లిక్ సెక్టార్‌లో పెట్టుకుంటామని కెసిఆర్ స్పష్టం చేశారు.
అలాగే లాభాల్లో ఉన్న ఎల్‌ఐసిని కూడా ఉద్దేశపూర్వకంగానే కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు అనేక కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిన మోడీ సర్కార్ నిర్ణయాన్నింటిని బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పున సమీక్ష చేస్తామన్నారు. భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే విషయంలో ఎపి ప్రజలు కూడా భాగస్వామి కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.
ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటా..
దేశ ప్రజల మేలు కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటానని కెసిఆర్ అన్నారు. దీని కోసం ఎన్ని అవమానాలను ఎదుర్కొనడానికైనా తాను సిద్దమేనని అన్నారు. తాను అనుకున్న లక్ష సాధనం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్దంగా ఉన్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో గోల్‌మాల్ వ్యవహరాలు కొనసాగుతున్నాయన్నారు. దాని నుంచి ప్రజలను బయటపడేయాలన్నదే బిఆర్‌ఎస్ లక్షమని కెసిఆర్ అన్నారు. దాని కోసం బిఆర్‌ఎస్ పుట్టిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఈ రాష్ట్ర పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు.
సంక్రాంతి తరువాత కమిటీల ప్రకటన
సంక్రాంతి పండుగ తరువాత బిఆర్‌ఎస్ కమిటీల ప్రక్రియ మొదలవుతుందని కెసిఆర్ తెలిపారు. ఇప్పటికే ఆరేడు రాష్ట్రాల్లో కమిటీల కసరత్తు కూడా దాదాపుగా పూర్తి చేశామన్నారు. దేశంలో ఉన్న 6 లక్షల 64 వేల గ్రామాల్లో బిఆర్‌ఎస్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే కార్యక్రమాల కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. అలాగే దేశంలో ఉన్న 4,123 అసెంబ్లీ నియోజవకర్గాల్లో కార్యక్రమాలను పరుగులు తీయిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఆలోచనా సరళి అన్ని రాష్ట్రాల్లో రగులుకోవాలన్నారు. ఇందుకు కష్టం తప్పదన్నారు. ఏం చేస్తే మంచి సాధిస్తామో దానిపై అధ్యయనం చేయాలన్నారు. ఏదో తమషా కోసమో… చక్కిలిగింతల కోసమో? బిఆర్‌ఎస్ పుట్టుకురాలేదని కెసిఆర్ అన్నారు. దేశంలో ఒక మూల, గ్రామం, రాష్ట్రం కోసం కూడా కాదన్నారు. దేశ హితం కోసం బిఆర్‌ఎస్ పుట్టికొచ్చిందన్నారు.
లక్ష కిమీ ప్రయాణమైన ముందు తొలి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. అలాగే లక్ష్య శుద్ధి సంకల్ప శుద్ధి ఉంటే…. సాధించలేనిదంటూ ఏమీ ఉండదన్నారు. ప్రపంచంలో మానవజీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయని ఈ సందర్భంగా కెసిఆర్ స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి ఒక భాషకో ప్రాంతానికో వ్యక్తికో కాదన్నారు. ఇది ఒక యజ్ఞమన్నారు. కష్టాలు, నష్టాలు రావొచ్చు అని పేర్కొన్నారు, ఏ గొప్ప పని ప్రారంభించినా అవహేళనలు ఎదురవుతా.యన్నారు. మనం ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత కొంచెం హేళన చేయడం ప్రారంభిస్తారన్నారు. ఆ తర్వాత మన మీద దాడి చేస్తారన్నారు. చివరకు మనకు విజయం చేకూరుతుందన్నారు. ఈ ఘటనలను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులకు భవిష్యత్‌లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే
మన దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్లు అని కెసిఆర్ తెలిపారు. కానీ దేశం ఏనాడూ కూడా రెండు లక్షల 10 వేల మెగావాట్లకు మించి వాడలేదన్నారు. నీళ్లుంటాయి కానీ పొలాలకు రావన్నారు. కరెంట్ ఉంటది కానీ ప్రజలకు రాదన్నారు. వనరులు, వసతులు ఉండి ఈ దేశం ప్రజలు శిక్షించబడాలి? వంచించబడాలి? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగాలా? ఇందులో ఏదైనా మార్పు రావాలన్నదే ప్రస్తుతం బిఆర్‌ఎస్ ప్రశ్నిస్తోందన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, వెస్ట్రన్‌గాట్స్ నుంచి ఈస్ట్రన్ గాట్స్ వరకు ఈ భావజాలాన్ని దేశంలోని ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గానికి విస్తరింప చేసి….‘ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
ఒకప్పుడు రాజకీయాలంటే త్యాగాలు
స్వాతంత్య్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగమని కెసిఆర్ అన్నారు. జీవితాలను, ఆస్తులను, కుటుంబాలను అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవన్నారు. దేశ అభ్యున్నతి కోసం పంచవర్ష, వార్షిక ప్రణాళికలను రూపొందించుకున్నామన్నారు. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు ఒక విజన్ డైరెక్షన్ ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. ఇందుకోసం కొన్ని బాటలు వేయబడ్డాయన్నారు. ఆ తర్వాత రాజకీయాలు, ప్రజాజీవితంలో అనేక మార్పులు సంభవించాయని కెసిఆర్ అన్నారు.
గత 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాలో ఆ దశకు చేరుకోలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు సిద్ధించలేదన్నారు. దీని కారణంగానే దేశంలో అనేక వైశమ్యాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ధనవంతుడు మరింత ధనవంతుడుగా మారుకుంటే పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. ఈ వ్యవస్థ మారాలన్నదే తన అభిమతమని కెసిఆర్ పేర్కొన్నారు.
ఇండియా బెస్ట్ పుడ్ చైన్ గల దేశంగా ఎదగాలి
అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయని….అక్కడ 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి చైనాలో ఉందన్నారు. కానీ మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉందన్నారు. 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో రమారమి 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు, అతిశీతలంగా ఉండే హిమాలయాలు కూడా ఉన్నాయి. ఆగ్రో క్లైమాటిక్ కండిషన్లో యాపిల్, మామిడి పండుతాయన్నారు. అలాగే దేశంలో ప్రతి ఏడాది ఒక లక్షా 40 వేల టిఎంసిల వర్షం కురుస్తోందన్నారు. ఇవి తన లెక్కలు కావని… కేంద్రం చెబుతున్నవని అన్నారు.
తగిన పద్ధతిలో ముందుకు పోతే ప్రపంచంలోనే ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్ కలిగిన దేశంగా భారత్ ఉండాలన్నారు. కానీ రైతులు 13 నెలల పాటు దేశ రాజధానిలో ధర్నాలు చేసి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడమే మన దేశం లక్షంగా మారినట్లుగా కనిపిస్తోందని కెసిఆర్ అన్నారు. దీని కోసం లక్షల అబద్ధాలు, కోట్ల డబ్బులు గుమ్మరిస్తున్నారన్నారు. కులాల కుంపట్లు, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలు చేయడమే కొన్ని రాజకీయ పార్టీల లక్ష్యమైందని విమర్శించారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు.. ఇదేనా మనకు కావాల్సింది? రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా? అని కెసిఆర్ ప్రశ్నించారు.
ఈ దేశంలో ఎవరు సంతోషంగా లేరన్నారు. దళిత, గిరిజన సమాజం, నిరుపేదలు రోదిస్తున్నారన్నారు. ఎందుకీ వేదన? చాలా మందిలో ఒక రకమైన అసంతృప్తి? ఎస్‌సిలో కలపాలని రజకులు అంటున్నారని… ఉన్నోళ్లందరినీ అందులో కలిపితే మరి వారు ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. ఎందుకు ఈ పరంపర? అని అడిగారు. కేవలం రెండు ఉద్యోగాలు వస్తాయనే బాధ, దాని నుంచి వస్తున్నటువంటి ఆక్రందనలని అన్నారు. ప్రజలను తప్పుబట్టే హక్కు మనకు లేదు అని ఈ సందర్భందగా ఆయన వ్యాఖ్యానించారు.
ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తోట నియామకం
ఎపి రాష్ట్ర బిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తూ కెసిఆర్ ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని అన్నారు. పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటామన్నారు. బిఆర్‌ఎస్‌కు మంచి వజ్రాలు దొరికాయని భావిస్తున్నానని అన్నారు. పైగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి పనిని మొదలుపెట్టామన్నారు. ఆ రాష్ట్రంలో సిట్టింగ్ శాసనసభ్యులు కూడా బిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆశ్చర్యపరిచే చేరికలు త్వరలోనే ఉంటాయని కెసిఆర్ తెలిపారు. తోట చంద్రశేఖర్ కర్తవ్య నిర్వహణలో విజయం సాధించాలని ఈ సందర్భంగా తాను కోరుకుంటున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. ఆయనపై తనకు సంపూర్ణమైన విశ్వాసముందన్నారు. తప్పకుంజా వారు విజయం సాధిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.