Friday, November 15, 2024

సీఎం కేసీఆర్‌తోనే రైతులకు ఉచిత కరెంటు

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : రైతుల సంక్షేమానికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్‌తోనే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యమవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని రైతు వేధిక భవనంలో గురువారం టీపీసీసీ అద్యక్షులు రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని చేసిన వాఖ్యలకు నిరసనగా రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తున్న ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజీతో విద్యుత్ మోటార్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, స్టార్టర్‌లు కాలిపోయి రైతులు ఆర్దికంగా ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారని ఆయన పేర్కొన్నారు.

యాసంగి పంటలో కరెంటు కోసం రైతులు రోడ్లపైకి వచ్చి సబ్ స్టేషన్‌ల వద్ద రాస్తారోకోలు, ధర్నాలు చేసిన పరిస్ధితులను కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. రైతులు వరి నాట్లు వేసే సమయంలో ఎరువుల కోసం షాపుల వద్ద రోజంతా పడిగాపులు కాసేవారని, ఆ నాటి పరిస్ధితులకు భిన్నంగా నేడు సీఎం కేసీఆర్ రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచి రైతుల ఇబ్బందులను తొలగించారన్నారు. రైతులకు మూడు పంటలు కావాలా, మూడు గంటల విద్యుత్ కావాలా నిర్ణయించుకునే సమయం వచ్చిందని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాడన్నారు. రైతులకు రెండు పంటలకు సాగు నీరు అందించి రైతుల సంక్షేమానికి పాటు పడుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు బురదచల్లడం నీచమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు గాను రైతుబంధు, రైతు భీమా పథకాలను దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వందేనని ఆయన అన్నారు. గ్రామాల్లో ఉచిత విద్యుత్‌పై చర్చ జరగాలని కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ది చెప్పాలని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేస్తారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, రైతు బంధు జిల్లా కన్వీనర్ మోటపలుకుల గురువయ్య, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బండారి మల్లేష్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ముత్తె రాజమల్లయ్య, సర్పంచ్‌లు గడికొప్పుల రజిని సురేందర్, శాంతయ్య, నాయకులు కానగంటి మధు, పెట్టం తిరుపతి, తోట రాజయ్య, వల్లెంబట్ల శ్రీనివాస్, తిరుపతి,దమ్మ సునీల్, రాజశేఖర్, రమేష్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News