శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు తరువాత వచ్చిన పెద్ద మార్పు జనం తమ అభిమతం ప్రకారం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం పేర్కొన్నారు. ఆర్టికల్ రద్దు చేసి శనివారం నాటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చిన మార్పులు వివరించారు. ఆర్టికల్ రద్దు కాకమునుపు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల , వేర్పాటు వాదుల బెదిరింపులు, దాంతో స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు, సంవత్సరానికి 150 రోజుల పాటు మూతపడడం వంటివి సాధారణంగా జరిగేవని, అవన్నీ ముగిసిపోయాయని సిన్హా విలేఖరులకు చెప్పారు.
కశ్మీర్ యువత కలలకు ఇప్పుడు రెక్కలు వచ్చాయని, రానున్న రోజుల్లో జాతిపునర్నిర్మాణంలో వారి సేవలు ఎవరికీ తీసిపోవని జోస్యం చెప్పారు. జమ్ముకశ్మీర్ త్వరలో తన వైభవాన్ని పొందగలుగుతుందన్నారు. అంతకు ముందు ఆయన దాల్ లేక్ ఒడ్డున కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గత నాలుగేళ్లలో జమ్ముకశ్మీర్‌లో యువశక్తి, మహిళా శక్తి, రైతుల వల్ల అనేక మార్పులు వచ్చాయన్నారు.