ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా నమూనా పరీక్ష నిర్వహణ
సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసి చైర్మన్, వైస్ చైర్మన్‌ల విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటికే వినూత్న రాయితీలతో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలతో ప్రజలకు దగ్గరవుతున్న టిఎస్ ఆర్టీసి మరో ముందడుగు వేసింది. అందులో భాగంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఆర్టీసి ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్‌లైన్ నమూనా పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసి ఎండి సజ్జనార్‌లు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు పరీక్ష విధానంలో పూర్తి అవగాహన కల్పించేందుకు ఆర్టీసి సన్నద్ధం అవుతోంది. ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా నమూనా పరీక్షను నిర్వహించి అభ్యర్థుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు సంస్థ కార్యాచరణను రూపొందించింది. శ్రీధర్, సిసిఈ సమన్వయంలో టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మాక్ టెస్టు నిర్వహించనుంది. మరింత సమాచారం కోసం www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆ సంస్థ తెలిపింది.