బెంగళూరు: గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు అద్దెదారులతోసహా గృహ వినియోగదారులందరూ అర్హులేనని, ఈ పథకం జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రకటించారు.
గృహజ్యోతి పథకంపై 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. అద్దెకు నివసించేవారు సైతం ఈ పథకానికి అర్హులేనని ముఖ్యమంత్రి నేడు ప్రకటించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకునే పేదలు బిఉ్లలు చెల్లించవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈ పథకం అద్దెదారులకు కూడా వర్తిస్తుందని మంగళవారం నాడిక్కడ విలేకరులకు ముఖ్యమంత్రి తెలిపారు. వాణిజ్య వినియోగదారులకు ఈ పథకం వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్‌తో సహా ఐదు వరాలను కాంగ్రెస్ ప్రకటిచింది. గతంలో యడియూరప్ప ప్రభుత్వం తీసుకువచ్చిన గోవధ నిషేధ చట్టాన్ని పునఃపరిశీలించాలని తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిద్దరామయ్య గట్టిగా సమర్థించారు. దీనిపై నిరసన తెలియచేసే నైతిక హక్కు బిజెపికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.అధికారంలో ఉన్నపుడు బిజెపి రాష్ట్రాన్ని దోచుకుని రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏం చేయాలో తెలియకే బిజెపి నాయకులు నిరసనలు తెలుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
రైతులకు రోజుకు 10 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణాల మాఫీ, నీటిపారుదల రంగానికి రూ. 1.5 కోట్ల కేటాయింపు వంటి ఏ ఎన్నికల హామీని బిజెపి నెరవేర్చలేకపోయిందని ఆయన అన్నారు ప్రజాఅనుకూల చర్యలలో తప్పులు వెదకడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నపుడు ఈ బిజెపి నాయకులు ప్రజావ్యతిరేక చర్యలతో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్రతిష్టపాల్జేసిన వీళ్లు ఇప్పుడు తమకు నీతులు చెప్పడానికి బయల్దేరారని ఆయన ఎద్దేవా చేశారు.