Friday, January 24, 2025

సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ డ్రైవింగ్ శిక్షణ

- Advertisement -
- Advertisement -

Free residential driving training under Singareni

టైడ్స్‌తో సింగరేణి ఒప్పందం
ఆసక్తిగల నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి

మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు నెల రోజుల పాటు ఉచిత డ్రైవింగ్ శిక్షణ (ఎల్‌ఎంవి, హెచ్‌ఎంవి) ఇప్పించేందుకు సింగరేణి యాజమాన్యం సంకల్పించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్, స్కిల్స్ (టైడ్స్) అనే సంస్థతో సింగరేణి కాలరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జనరల్ మేనేజర్ కె. సూర్యనారాయణ, టైడ్స్ కార్యదర్శి, ప్రిన్సిపాల్ నుంజుమ్ రియాజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అశోక్ లేలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లో సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో నెల రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ నిచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 100 మంది నిరుద్యోగ యువతకు డ్రైవింగ్ శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేలా టైడ్స్ సంస్థను కోరినట్లు తెలిపారు. ఇందుకోసం సింగరేణి సామాజిక బాధ్యత నిధుల కింద రూ.25 లక్షలను వెచ్చిస్తోందన్నారు. నవంబర్ లో మొదటి బ్యాచ్‌లో 25 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సింగరేణి ప్రాంతంలోని పిఎఎఫ్, పిడి ఎఫ్, ఉద్యోగుల పిల్లలు, విశ్రాంత ఉద్యోగుల పిల్లలు (నిరుద్యోగ యువత) సద్వినియోగం చేసుకోవాలని, డ్రైవింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికిది సువర్ణవకాశమన్నారు. అత్యాధునిక పద్దతిలో ఇక్కడ శిక్షణ నిస్తున్నారని, నాణ్యమైన భోజన వసతులు కల్పిస్తున్నారని ఒక్క పైసా ఖర్చు లేకుండా డ్రైవింగ్ శిక్షణ పొందడంతో పాటు ఉపాధి అవకాశాలను పొందే అవకాశం కల్పిస్తున్నారన్నారు.

ఈ సంస్థలో శిక్షణ పొందిన అనేక మంది హైదరాబాద్, తిదితర ప్రాంతాల్లో డ్రైవర్లుగా ఉపాధి అవకాశాలు పొందారని వివరించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేర్లను ఏరియాలోని సింగరేణి సేవాసమితి కో ఆర్డినేటర్ లేదా కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌కు తెలపాలని సూచించారు. టైడ్స్ కార్యదర్శి, ప్రిన్సిపాల్ నుంజుమ్ రియాజ్ మాట్లాడుతూ సింగరేణితో ఒప్పందం చేసుకోవడం తమకు ఎంతో సంతోషకరమని, సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువత ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎజిఎం (ఫైనాన్స్) రాజేశ్వరరావు, డిజిఎం (పర్చేజ్) విజేందర్ రెడ్డి, ఎస్‌ఒఎం కృష్ణమాచారి, సీనియర్ పిఒ ఎస్. శ్రీకాంత్, సింగరేణి సేవా సమితి కో ఆర్డినేటర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News