రూ.5,216 కోట్లను
కొవిడ్ సంక్షోభంలో
ఆహార భద్రతకు ఖర్చు
పెట్టాం 40 కోట్ల 63
లక్షల టన్నుల ధాన్యంలో
ఎఫ్‌సిఐ సాకులు చిన్న
చిన్న కారణాలతో
రాష్ట్రంపైన కుటిల
యత్నాలు : మంత్రి
గంగుల కమలాకర్
ఈ నెల నుంచి డిసెంబర్ వరకూ ఉచిత బియ్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉన్నారని, అది చూసి ఓర్వలేనితనంతో కుళ్లుతో బిజెపి నేతలు తమ చేతుల్లో ఉన్న అధికార సంస్థల ద్వారా రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర పౌర శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బుధవారం తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కేంద్రం పెడుతున్న ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రజానీకం, రై తాంగం గమనిస్తున్నారని, ఎఫ్‌సిఐ ఏర్పడ్డ 60 ఏళ్లలో ఏనాడూ రాని ఇబ్బందుల్ని కొ త్తగా కావాలని సృష్టిస్తున్న విషయం ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. అందులో భాగంగానే రెండు చిన్న కారణాలను బూచీ గా చూపి ధాన్యం సేకరించమని అంటున్నారన్నారు. ప్రధానంగా ధాన్యం ఫిజికల్ వెరిఫికేషన్‌కు అనుకూలంగా ఉంచడం లేదని, ఉచి త బియ్యం ఇవ్వలేదని చేసిన ఆరోపణలపై విషయాలపై సమగ్రమైన వివరణ ఇచ్చారు.
ఉచిత బియ్యం కేంద్రం కన్నా ముందే రాష్ట్రం ప్రారంభించిందన్నారు. కేంద్రం ప్రారంభించక ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా సంక్షోభం మొదలైన 2020 మార్చిలో ఉచితంగా బియ్యంతో పాటు నెలకు రూ.1500 చొప్పున రెండు నెళ్లు అందిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసారు. రాష్ట్రంలోని 90.46 లక్షల కార్డులకు 2 కోట్ల 87 లక్షల యూనిట్లకు కేంద్రం కేవలం 53 లక్షల కార్డులకు మాత్రమే రేషన్ పంపిణీ చేస్తుందని, మిగతా అర్హులకు సైతం కడుపునిండా తిండిపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత భారాన్నైనా భరించి అందరికీ రేషన్ అందిస్తున్నారన్నారు. 2020 ఎప్రిల్ నుండి నవంబర్ వరకూ 8నెలలకు కేంద్రం అందించిన 5 కిలోల ఉచిత బియ్యానికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి మూడు నెలలు 7కిలోలు, తర్వాత మూడు నెలలు మరో 5 కిలోలు కలిపి పది కిలోలు ఉచితంగా అందించిందన్నారు. ఇందుకోసం రూ. 980 కోట్ల అదనంగా కేటాయించిదన్నారు. అలాగే రెండోవిడతలోనూ 2021 జూన్ నుండి ఎప్రిల్ 2022 వరకూ అదే విదంగా రూ.1134 కోట్లు అదనంగా కేటాయించామన్నారు.
కేంద్రం తాజాగా మార్చి 28న ఉచిత ఆహార పథకాన్ని పొడిగిస్తున్నామని లేఖ ఇచ్చిందని, ఆ పాటికే మన దగ్గర పంపిణికి ఏర్పాట్లు చేయడంతో పాటు బియ్యం సేకరణకు సమయం పడుతుందని, అలాగే అదే సమయంలో ధాన్యం సేకరణ సైతం ఉండడంతో కేవలం మే మాసంలో మాత్రమే ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ ఉచితంగా అందించడానికి ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారన్నారు . ఈనెల నుండి అదనంగా ఐదు కిలోల్ని ఉచితంగా అందిస్తామని ,ఈ నెల 18 నుండి 26 వరకూ ఈ బియ్యాన్ని అందజేస్తామన్నారు. ఈ నెల నుండి డిసెంబర్ వరకూ ఉచిత పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇందుకోసం రూ.436 కోట్ల అదనపు భారాన్ని సైతం భరించడానికి సిద్దమయ్యారన్నారు. ఈ విధంగా ఇప్పటివరకూ ఖర్చు చేసిన రూ.4780 కోట్లకు వీటిని కలిపితే రూ. 5216 కోట్లను ఉచిత బియ్యానికి కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
ఒక్క గింజనూ వదులుకోం.. అనవసర బదనాం చేయొద్దు:
ఎఫ్‌సిఐ చేసిన ఆరోపణల్లో ఫిజికల్ వెరిఫికేషన్ పై కూలంకషంగా వివరించారు,.రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లో ధాన్యం సేకరిస్తున్నామని, స్వయంగా ముఖ్యమంత్రి పోరాటంతో కేవలం రా రైస్ మాత్రమే తీసుకుంటామని ఎప్.సి.ఐ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. రూ. 3500 కోట్ల నష్టాన్ని భరించి ధాన్యం సేకరణ చేస్తున్న సమయంలో, అనువుగాని వేలల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తుందన్నారు. అసలు వడ్లకు కేంద్రం డబ్బులిచ్చిందా అని ప్రశ్నించారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డబ్బులు పెట్టి కొంటుందని, అవి రాష్ట్రం ధాన్యమని, కేవలం బియ్యం ఇస్తున్నప్పుడే కేంద్రం డబ్బులిస్తుందని అటువంటప్పుడు కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు.
కేంద్రానికి అన్ని విధాల సహకరిస్తున్నామని, మార్చిలో 3007 మిల్లుల్లో తనిఖీలు నిర్వహించిన ఎప్.సి.ఐ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన 162.54 లక్షల మెట్రిక్ టన్నులు, బ్యాగుల్లో 40.63 కోట్ల ధాన్యంలో కేవలం 0.7 శాతంగా, 4,53,896 బ్యాగులు 40 మిల్లులలో తేడాలు ఉన్నాయని నివేదించిందన్నారు., దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖతో కలిసి ఎప్.సి.ఐ పునర్ తనిఖీలు నిర్వహించగా అందులో 30 మిల్లులు సరిగానే ఉన్నాయని అదే సంస్థ సర్టిఫై చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. పది మిల్లులో ఐదింట్లో రికవరీ ప్రాసెస్ కొనసాగుతుందని, 3 మిల్లులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నామన్న మంత్రి మిగతా రెండు మిల్లుల నుండి 125 శాతం ధాన్యాన్ని రికవరీ చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రతీగింజను కాపాడుకుంటామన్న మంత్రి అక్రమాలకు పాల్పడ్డ ఎవరినీ ఉపేక్షించమని, ఒక్క గింజనీ వదులుకోబోమన్నారు.
ఎప్.సి.ఐ లేఖలో పేర్కొన్న మరో అంశం 63 మిల్లులపై షార్టేజీ ఉందన్న అంశంపై మంత్రి వివరణ ఇచ్చారు . వీటిపై ఇప్పటికే కలెక్టర్లకు తనిఖీల కోసం ఆదేశాలిచ్చామని, క్షున్నంగా తనిఖీల తర్వాత దోషులని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, క్రిమినల్ కేసులు,పెడతామని, ఆర్ ఆర్ యాక్ట్ ప్రకారం ఒక్క గింజను వదలకుండా రికవరీ చేస్తామన్నారు. ఈ అంశాలపై ఎఫ్.సి.ఐకి రాతపూర్వకంగా వివరాలు తెలిపి ధాన్యం సేకరించాలని కోరతామన్నారు. రారైస్ ఎంతైనా కొంటామని ప్రగల్బాలు పలికిన బీజేపీ నేతలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎఫ్.సి.ఐ తో తాడో పేడో తేల్చుకుంటారా లేదా అని అడిగారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయమని పోరాడుతుంటే కేంద్రానికి వత్తాసు పలుకుతున్న బీజేపీ నేతల బండారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ధాన్యం సేకరణపై విరణ ఇస్తూ రాష్ట్రంలో 6584 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని , ఇందులో 4574 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి వీటిని మూసేసామన్నారు. 8 లక్షల 34వేల మంది రైతుల నుండిరూ. 9138 కోట్ల విలువ గల 47 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఇప్పటివరకూ సేకరించామన్నారు. ఇందులో 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు.
పెట్రోల్, డీజిల్ కొరత రానీయం:
అనంతరం మంత్రి గంగుల రాష్ట్రంలోని ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఐవోసీఎల్, హెచ్‌పిసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో పెట్రోల్ కొరత అంశంపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 3520 పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా కొరత లేకుండా చూడడంతో పాటు పెట్రోల్ బంకులకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని ఆదేశించారు. పెట్రోల్ సమీక్షలో ఆయిల్ కంపెనీల రాష్ట్ర కోఆర్డినేటర్ వైపీ సింగ్, ఐఓసీఎల్ జీఎం ఎంబి మనోహర్ రాయ్, బీపీసీఎల్ డీజీఎం కేఎస్వీ బాస్కర్ రావు, హెచ్పీసీఎల్ చీఫ్ మేనేజర్ పి మంగీలాల్, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం అమరేందర్ రెడ్డి, ప్రతినిదులు వి.వినోద్. ఎల్వీ కుమార్, వై.శ్రీనివాస్, బ్రిజ్లాల్ తదితరులు పాల్గొన్నారు.