చెప్పిన గడువు తొమ్మిదవ తేదీకి రైతు బంధు నిధుల విడుదల చేయకపోవటంతో ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. దీంతో సోమవారం నుంచి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం ఆదేశించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఖజానాలో ఉన్న మేరకు చెల్లించాలని, తరువాత విడత నాటికి నూతన విధివిధానాలను ఖరారు చేయాలని సోమవారం నాడు సిఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. టివి చర్చలలో బిఆర్ఎస్, బిజెపి పార్టీల ప్రతినిధులు ఎప్పుడు చెల్లిస్తారో తెలుసుకోగోరుతున్నాం అనే పేరుతో చేసిన వాదనలు కాంగ్రెస్ ప్రతినిధులను ఇరకాటంలోకి నెట్టాయి. ఇంకా ఆలస్యం చేస్తే అనుమానాలు, మరింత వత్తిడి పెరుగుతుందని భావించినట్లుగా స్పష్టం అవుతున్నది. తెలంగాణ మూడవ శాసనసభ డిసెంబరు తొమ్మిదవ తేదీన ప్రారంభమైంది. మంత్రులకూ శాఖలు కేటాయించారు. వారింకా కొలువు తీరలేదు. శాసనసభ్యులు ప్రమాణ స్వీకారాలు చేసిన తరువాత పద్నాలుగవ తేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. మూడు రోజుల పాటు సభ జరుగుతుందని, ఆ సందర్భంగా కొన్ని శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నట్లు చెబుతున్నారు. కాలిగోళ్లపుడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్లు బిజెపి తనదైన మత రాజకీయాలను ప్రోటెం స్పీకర్ నియామకంతోనే ముందుకు తెచ్చింది.
మజ్లిస్ కాంగ్రెస్ బంధానికి తెర లేచినట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. భక్తులు తమదైవం రాముడి కంటే రావణుడినే ఎక్కువగా తలచుకుంటారన్నట్లుగా బిజెపినేతలకు మజ్లిస్ పేరు పలకకుండా నోట మాట రావటం లేదు. పాతబస్తీలో మజ్లిస్ పోటీ పెట్టని గోషామహల్ నియోజకవర్గం ఒక్క దానిలోనే బిజెపి గెలిచింది. వారి మధ్య ఉన్న తెరచాటు బాగోతాలకు ఇది నిదర్శనమని ఎన్నికలకు ముందే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మజ్లిస్ పార్టీ ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్‌గా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేసేది లేదని పార్టీ నేతలతో చర్చించకుండా అక్కడ గెలిచిన రాజాసింగ్ ప్రకటించడంతో అంతేకదా అన్నట్లుగా బిజెపి ఆమోదించింది. ప్రోటెం స్పీకర్‌గా సీనియర్‌గా ఉన్న కెసిఆర్ సభకు రాలేని స్థితిలో అర్హత ఉన్నవారిలో ఎవరినైనా ఎంచుకొనే స్వేచ్ఛ ఉందని కాంగ్రెస్ సమర్ధించుకుంది. ఏ ప్రయోజనమూ లేకుండా ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావించలేము. ఎవరు అధికారంలో ఉంటే వారికి దగ్గరగా మజ్లిస్ ఉంటుందన్న అభిప్రాయాల పూర్వరంగంలో ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బిఆర్ఎస్ నేత, మాజీ సిఎం కె చంద్రశేఖరరావు తన వ్యవసాయ క్షేత్రంలోని స్నానాల గదిలో జారిపడి ఆసుపత్రిపాలయ్యారు. దీనికి కెసిఆర్ వయస్సు, బాత్ రూం స్థితి కంటే అసలు కారకులు జ్యోతిష్కులంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు.
ఎందుకంటే వారిలో ఏ ఒక్కరూ ఎన్నికల తరువాత బాత్ రూం గండం ఉంటుందని చెప్పకపోవటమే కారణమని, చెప్పి ఉంటే కెసిఆర్ అసలు వెళ్లి ఉండేవారు కాదని అంటున్నారు. మూడోసారి సిఎం కావటం ఖాయమంటూ చెప్పిన వారి జోస్యాలు తలకిందులు కావటంతో బాత్రూంలో పడకముందే బహిరంగంగా కెసిఆర్ నోట మాట రాలేదు.
ఎనుముల రేవంత్ రెడ్డి సింఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే తీసుకున్న చర్యలను చూసి కొందరు ఎంత దూకుడుగా ఉన్నారో చూడండని వ్యాఖ్యలు చేశారు. మహలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని సాకారం చేశారు. ఆరోగ్యశ్రీ పథక మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచారు. ఆర్టిసి ప్రభుత్వానిదే కనుక వెంటనే అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పెద్ద మొత్తంలో బకాయి పడినందున ప్రైవేటు ఆసుపత్రులు అమలు జరిపేందుకు మొరాయించిన సంగతి తెలిసిందే. బకాయిలు ఎంత ఉన్నదీ వెల్లడి కావాల్సి ఉంది. ఎక్కడన్నా బావే కానీ వంగతోటదగ్గర కాదన్నట్లుగా కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఏదైనా ఒకటే. బకాయిలను వెంటనే చెల్లిస్తుందా లేదా అన్నదే గీటురాయి.
చెల్లిస్తేనే పథకం అమలు జరుగుతుంది. ఈ రెండింటికీ వెంటనే నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉండదు. అందుకే వెంటనే ప్రకటించారన్నది స్పష్టం. ఫలితాలు వెలువడినప్పటి నుంచి టివిలలో చర్చలు మొదలయ్యాయి. రైతుబంధు నిధులు విడుదల నిలిచిపోవడానికి కాంగ్రెసే కారణమంటే కాదు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఎన్నికల ప్రచార నియమావళి ఉల్లంఘనే కారణమని ఎన్నికలకు ముందు ఆయా పార్టీల వారు వాదించారు. ఎన్నికల కమిషన్ కూడా ఉల్లంఘన కారణాన్ని చూపే నిలిపివేయించింది.
ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఏడాది మొత్తానికి చేయాల్సిన అప్పులలో ముందుగానే సింహభాగం తీసుకొని గత ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ప్రకటించే శ్వేత పత్రంలో వెల్లడవుతాయని ఆశిద్దాం. రెండు వాగ్దానాలను వెంటనే అమలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయకపోవటానికి ఖజానా ఖాళీగా ఉండటం తప్ప మరొక కారణం కనిపించ లేదు. తాము దిగిపోయే నాటికి నగదు నిల్వ ఎంత ఉందో మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడిస్తే అసలు రంగు బయటపడుతుంది. శ్వేత పత్రంతో నిమిత్తం లేకుండా ఈ పథకానికి నిధులు ఉన్నదీ లేనిదీ ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఉంటే జనంలో అనుమానాలు తలెత్తి ఉండేవి కాదు. ప్రతిపక్షాలకు అడిగే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఆరు హామీల అమలు అంత తేలిక కాదు. వర్తమాన బడ్జెట్ కేటాయింపులు వచ్చే ఏడాది మార్చి వరకు నూతన ప్రభుత్వానికి కాళ్లు చేతులను కట్టిపడవేశాయి. భూముల అమ్మకం, ఔటర్ రింగ్‌రోడ్ టోల్ కాంటాక్టు సొమ్ము వంటి వాటిని ఖర్చుచేశారు.
ఒకటో తేదీకి వేతనాలు, పెన్షన్లే చెల్లించలేని స్థితిలో కొత్త వాగ్దానాల అమలు అంత తేలికకాదు. ప్రగతి భవన్ గేట్లు బద్దలు చేయించినంత వేగం, సులభమూ ఆర్థిక అంశాల్లో సాధ్యం కాదు. కాగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 24 సంవత్సరానికి ప్రభుత్వ రుణ సేకరణ లక్ష్యం రూ. 38,234 కోట్లలో అక్టోబరు నాటికే 87.3 శాతం అంటే రూ. 33,378 కోట్లు తీసుకొని ఖర్చు కూడా చేశారు. మరో ఐదు నెలల కాలానికి తీసుకోగలిగింది రూ. 4,856 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు కూడా వెంటనే రావన్నది తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని రోజులు ఆలస్యం చేసినా ఇబ్బందే. అధికారం వస్తుందనుకొని ఆశాభంగం చెందిన బిజెపి వచ్చే లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తుందని తెలిసిందే. చెప్పినట్లుగా వాగ్దానం అమలు చేయలేదంటూ ఆ పార్టీ ప్రతినిధులు ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ రుణాలు రాష్ర్ట జి(ఎస్)డిపిలో 25 శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే అంతకు మించి అప్పులు ఉన్నాయి. రాష్ర్ట ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు 23.8 శాతం ఉంటాయని అంచనా కాగా కాగా వివిధ సంస్థలకు హామీగా ఇప్పించిన అప్పులు 2022 23 నాటికే రూ. 1,29,244 కోట్లు (11.3శాతం) కలుపు కుంటే 35.1 శాతానికి చేరుకుంటాయి.
బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2023 నాటికి రాష్ర్ట ప్రభుత్వం 19 సంస్థలకు ఇచ్చిన రుణాల హామీల మొత్తం రూ. 1,35,282 కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్న విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతులకు మీటర్లు పెట్టటం వంటి వాటిని అమలు చేస్తే రుణ అర్హతను కేంద్రం పెంచుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆపని చేస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. గత ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే అదే చేస్తే అభాసుపాలవుతుంది. మద్యం బెల్ట్ షాపుల కారణంగా పెద్ద ఎత్తున ఖజానాకు రాబడి వస్తున్నది. వాటిని అనుమతించబోమని చెప్పినట్లుగా వెంటనే అమలు చేస్తే దాని రాబడి కూడా తగ్గి నిధుల కటకట ఏర్పడుతుంది.
గడువు ప్రకారం నిర్వహిస్తే లోక్‌సభ ఎన్నికలకు ముందే పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉంది. మరోవైపు నరేంద్ర మోడీ, బిజెపి కోయిల కూతలను వింటే లోక్‌సభ ఎన్నికలు కూడా రెండు నెలల ముందుగానే జరగవచ్చు అంటున్నారు. ఒకవేళ అవి గడువు ప్రకారమే జరిగినా కొత్త ప్రభుత్వానికి ఓట్ ఆన్ ఎకౌంట్‌కు అనుమతి తీసుకొని ఎన్నికల తరువాత పూర్తి బడ్జెట్‌ను పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. ఆర్థిక పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటించే వరకు రైతు బంధు నిధుల విడుదల ఆపితే ప్రభుత్వం మీద వత్తిడి, రాజకీయ దాడి పెరుగుతుంది.
ఉచిత బియ్యం పథకానికి కేంద్రం ఆమోదించిన కార్డుల కంటే అదనంగా ఉన్నవాటికి రాష్ర్ట ప్రభుత్వమే ఖర్చు భరిస్తున్నది. అదనపు కార్డులు ఇస్తే అది పెరుగుతుంది. కనుకనే ఏదో ఒక సాకుతో కొత్త కార్డులు ఇవ్వటం లేదు. ప్రకటించిన వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని కూడా వెంటనే ప్రకటించటం అవసరం. అవన్నీ లోక్‌సభ ఎన్నికల ముందునాటికి పూర్తి చేయకపోతే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తాయి. ఇలా అనేక సమస్యలున్నందున ఏ విధంగా చూసినప్పటికీ కత్తిమీద సాములా పరిస్థితి ఉంది. జనం కూడా ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇవ్వరు. ఎందుకంటే అధికారానికి రావడమే తరువాయి వెంటనే అమలు అన్నట్లుగా కాంగ్రెస్ నేతల ప్రకటనలు వున్నాయి. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా చేసిన వాగ్దానాలు అమలు జరిపారా లేదా అన్నదానినే జనం, మీడియా వారూ చూస్తారు.