Friday, December 20, 2024

అవి ‘సముచిత’ పథకాలు

- Advertisement -
- Advertisement -

బిఆర్ అంబేడ్కర్, అమర్త్యసేన్ తదితరులు పెరిగే సంపద నుంచి పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అవి అమలవుతున్నాయి. ప్రజలకు ఉచితాలు అని ప్రచారంలో కి వచ్చిన పథకాలు ప్రజలకు వారి కష్టానికి సరైన కూలి, జీతం, సరైన ప్రతిఫలం ఇవ్వకపోవడం వల్ల, అందక పోవడం వల్ల ఏర్పాటు చేసుకున్న మధ్యేమార్గం. ఇంతకు ఎన్నో రెట్లు మధ్యతరగతి, పారిశ్రామికవేత్తలు అనేక సౌకర్యాలు, సబ్సిడీలు, పన్ను మినహాయింపులు పొందుతున్నారు. లక్షల కోట్లు ప్రభుత్వాల నుండి పొందడం, బ్యాంకులకు ఎగవేయడం కొనసాగుతున్నది.

ఒక యువకుడు ఒక సమస్య లేవనెత్తాడు. మనం పని చేస్తే ఇతరులు లాభపడుతున్నారు. యజమానులు సంపన్నులైపోతున్నారు. మనం జీతంకోసం ఎదురు చూసేవాళ్ళుగా మిగిలిపోతున్నాము. మనం పని చేస్తే పన్నువేసి ప్రభుత్వాలు లాభపడుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు, డాక్టర్లు, మెడికల్ కంపెనీలు, బ్యాంకులు, రియల్టర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు కోట్లకు పడగలెత్తుతున్నారు. నేను నిరంతరం కిస్తులు వాయిదాలు కట్టుకుంటూ వాళ్ళ కోసమే పనిచేస్తూ బతకాల్సివస్త్తోంది. నా బతుకంతా వారికోసమే ధారపోసినా నేను ఇలాగే సామాన్యుడిలా మిగిలిపోతున్నాను. నేనెందుకు వారిలా ఎదగడం లేదు? అలాంటప్పుడు నేనెందుకు పని చేయాలి ఇది ఆ యువకుడు వేసిన ప్రశ్న! ఈ అంశం మీద 110 ఏళ్ల కింద మహా రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ కఫన్ అనే కథ రాశాడు. దీనిని 1980లలో గౌతం ఘోష్ సుప్రసిద్ధ దర్శకుడు తెలుగులో ‘ఒక ఊరి కథ’ అనే పేరుతో సినిమా తీశాడు.

ఆ కథలో తండ్రీకొడుకులు వ్యవసాయ కూలీ పనులు చేస్తే తమకేమీ లాభం లేదని, యజమాని సంపన్నుడవుతున్నాడని అట్లాంటపుడు మేమెందుకు పని చేయాలి అని తర్కించి పని చేయడం మానేసి అడుక్కు తినడం, ఇతరుల పెరట్లోపడి తినడం చేస్తుంటారు. చివరకు తిండి లేక రోగిష్టి తల్లి చనిపోతే అంత్యక్రియలు చేయకుండా శవాన్ని చూపి అడుక్కోవడం జరుగుతుంది. మనిషికి పనిచేస్తే దాని ప్రయోజనం తనకు చెందాలని వుంటుంది. అది సహజం. మనం పనిచేస్తే సంపన్నులు అయ్యే వాళ్ళు, సుఖపడేవాళ్ళు కర్మచేయడం నీ కర్తవ్యం. ఫలితాన్ని ఆశించకు అని బోధిస్తారు. భగవద్గీత ఇదే చెబుతుంది. చాలా తత్వాలు ఇలానే చెపుతాయి.

వీటిని దోపిడీదారుల తత్వాలు అంటారు. 1959లో నేను 5వ తరగతిలో స్కూల్లో క్యాబేజీ కాలిఫ్లవర్ కోసం తోట పని క్లాసుతో పని చేశాను. వాటిని మాకు ఇవ్వలేదు. చాలా బాధ కలిగింది. మేం కష్టపడింది మాకు అందలేదు.నిరాశ కలిగింది. జీవిత చరిత్రలో ఈ సంఘటన రాశాను. ఇలా మనం చేసిన పని ప్రయోజనం మనకు కాకుండా మంది పాలైనపుడు దాన్ని పరాయీకరణ/ అలైనేషన్ అంటారు. ఇట్లా మన కష్టంతో లబ్ధి పొంది సుఖపడి, సంపన్నులై తిరిగి మనమీదే పెత్తనం చేస్తారు. దీన్ని పరాయీకరణతో రాజ్యంగా ఎదిగారు అంటారు. ఈ దోపిడీ ఆధిపత్యం పోవాలని అనేక సిద్ధాంతాలు, ఉద్యమాలు వచ్చాయి. సోషలిజం, మార్క్సిజం, అంబేడ్కరిజం, బౌద్ధం సమానత్వం వంటి సిద్ధాంతాలు వచ్చాయి. అనేక ఉద్యమాల ఫలితంగా ఒప్పందాలు కుదిరాయి. కూలీలు జీతాలు, సెలవులు, పని గంటల పరిమితి, గృహ వసతి, ప్రసూతి సెలవులు, మెడికల్ సాయం, బోనస్, పెన్షన్ మొదలైనవి సాధించుకున్నారు.

ఇన్ని చేసినా, ఎంత సాధించుకున్నా యజమానులు తమ ప్రయోజనం పొందుతూనే వున్నారు. మన మీద పెత్తనం చేస్తున్నారు.మన పన్నులతో బతుకుతూ ప్రభుత్వాలు మన మీదే పెత్తనం చేస్తున్నాయి. ఇది జరుగుతున్న కథ. వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ, భగవద్గీత కర్మ సిద్ధాంతంతో వాటికి మద్దతు ఇచ్చి యజమానుల వైపు నిలబడుతాయి. దీనిని మనుధర్మం, బ్రాహ్మణవాదం అంటారు. ఈ సిస్టంలో తన బతుకు కోసం పాలేరుగా, కూలీగా, జీతగాడుగా, ఉద్యోగి గా, ఉపాధ్యాయులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా, ఉద్యోగులుగా పని చేస్తున్నారు. గల్ఫ్ దేశాలకు పొట్టచేత పట్టుకొని వెలుతున్నారు. యజమాని, ప్రభుత్వం మన కష్టం వల్ల బతుకుతున్నారనేది సత్యం. అది వద్దనుకుంటే ప్రకృతితో సహజీవనం చేస్తూ వ్యవసాయం చేయడం చేస్తున్నారు.

ఇతరులను జీతం పెట్టుకుంటే వాళ్ళ కష్టం దోచినట్టే గదా! అందుకని ఈ నగర జీవితం వద్దు అని 18 వ శతాబ్దంలో వర్డ్ వర్త్ అనే కవి చేపలు పట్టుకొని బతకడం మంచిది అని కవిత రాసాడు. అది మాకు 1965లో ఇంగ్లీషులో పాఠం. దీనికి బదులుగా అనగా యజమాని లాభపడి పెత్తనం చేసే సిస్టంకు బదులుగా పరస్పర సహకారంతో బతకడం అంతిమ గమ్యం. అదే సోషలిస్టు జీవనం. అలాంటి వాటిని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. వారిని ఏమీ చేయలేని అసమర్థులు, అందులో భాగమైన వర్గాలు పేద ప్రజలు ఎదగడం గిట్టనివారు ఉచిత పథకాల మీద పడి మాత్రం ఏడుస్తుంటారు. ఎవరి కష్టఫలితం వారికి అందితే ఈ పేదరికం వుండదు.

పేదరికానికి కారణం ఆధునిక సైన్సు టెక్నాలజీ, ఆధునిక విద్య, వైపుణ్యాలు, పెట్టుబడులు లేకపోవడమే! వాటిని సమకూర్చడం ప్రభుత్వం కర్తవ్యం. తద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రభుత్వం విద్య, వైద్యం, గృహవసతి సమకూర్చితే ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో సమకూరుతాయి. మధ్యలో కాంట్రాక్టర్ల, పారిశామికవేత్తల దోపిడీ లేకుండా సహకార రంగం ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా సమకూర్చినపుడు ఆ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అదే దోపిడీకి పరిష్కారం! శ్రమ ఫలితం పరాయీకరణ తగ్గుతుంది.

బిఎస్ రాములు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News