మన తెలంగాణ/హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం రానున్న భక్తులను శుక్రవారం నుండి యాదగిరి గుట్ట కొండపైకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్ళనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించి ఆర్టీసీకి అయ్యే ప్రయాణ వ్యయాన్ని దేవస్థానమే భరించనుందని ఆమె తెలిపారు. కొండ కింది నుండి పైకి, తిరిగి పైనుండి కిందికి భక్తులకు రెండు వైపులా ఉచితంగా ప్రయాణం చేసేలా సౌలభ్యం కల్పించారు. అందుకు గల కారణం యాదాద్రి పైకి టూవీలర్ తో సహా అన్ని ప్రైవేటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేదించడమేనని స్పష్టం చేశారు.
కొన్ని భద్రత చర్యల దృష్ట్యా అధికారికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే స్వామివారి నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, శాస్వత కళ్యాణం, శాస్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కుజోడు సేవలూ ప్రారంభమవుతాయని ఈవో వెల్లడించారు. కైంకర్య వేళల్లో భాగంగా ప్రతిరోజు తెల్లవారుఝామున 4 గంటలకు సుప్రభాతం, 4:30కు బిందె తీర్థం, దీపారాధన, 5 గంటలకు బాల భోగం, 5:30కు పుష్పాలంకరణ సేవ, 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం, 7:30కు అభిషేకాలు, 8:30కు విష్ణు సహస్రనామార్చన పూజ, 9 గంటలకు విశ్రాంతి అనంతరం 10 గంటలనుండి భక్తజనానికి సర్వదర్శనం కల్పించనున్నట్లు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు.