ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయమని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం వల్ల ప్రజారవాణా పుంజుకుంటుందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళల స్వయం శక్తి మెరుగవుతుందన్నారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి నిబంధనలు జారీ చేశామన్నారు.
వయసుతో సంబంధం లేకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. సిటీ ఆర్డీనరీ, సిటీ మెట్రో బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సజ్జనార్ తెలిపారు. రాష్ట్రం, కేంద్రం జారీ చేసే ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలని ఆయన పేర్కొన్నారు. మహిళలు బస్సు ఎక్కడైనా ఎక్కవచ్చు.. ఎక్కడైనా దిగవచ్చన్నారు. ఉచిత ప్రయాణాలకు ఎలాంటి పరిమితులు, షరతులు లేవన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రోజుకు ఎన్నిసార్లుయినా వెళ్లవచ్చని తెలిపారు. మహిళల టికెట్ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోందని ఆయన స్పష్టం చేశారు.