Friday, November 15, 2024

నేటి నుంచి బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

- Advertisement -
- Advertisement -

మధ్యాహ్నం అసెంబ్లీలో ‘మహాలక్ష్మి పథకం’ ప్రారంభించనున్న సిఎం రేవంత్
సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు అందుబాటులోకి ఈ పథకం
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు
హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డీనరి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో మహిళలకు అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్:  నేటి మధ్యాహ్నం (శనివారం) నుంచి మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కానుంది. దానికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేయడంతో పాటు దీనికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అందులో భాగంగా ఈ పథకాన్ని సోనియాగాంధీ జన్మదినం రోజున ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.ఈ నేపథ్యంలో పథకాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకొస్తుంది.

బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచితం
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్లో నడిచే సిటీ ఆర్డీనరి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ మహిళలకు ఈ ఉచిత ప్రయాణం కల్పించనుంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఈ ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అర్హులుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని ఆర్టీసి బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత ప్రయాణం ఉండనుంది. మహిళా ప్రయాణికుల ఛార్జీ మొత్తాన్ని ఆర్టీసి ప్రభుత్వమే చెల్లించనుంది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీలను తెలంగాణ ప్రభుత్వం టిఎస్ ఆర్టీసికి ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది. స్థానికత గుర్తింపు కార్డు చూపించి మహిళలు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. జీఓ నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం విధి, విధానాలను ప్రభుత్వం వెల్లడించింది.

ఇది చారిత్రాత్మక నిర్ణయం: ఎండి సజ్జనార్
స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపుకార్డును ప్రయాణ సమయంలో కండక్టర్‌లకు చూపించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయనున్నారు. దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్‌లతో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించాలని ఆర్టీసి నిర్ణయించినట్టు ఎండి సజ్జనార్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను వారికి వివరించామని ఆయన పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News