Sunday, January 19, 2025

ఆశించిన ఓట్లు రాల్చని ‘ఉచితాలు’

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఎన్నో హామీలతో ఉచిత పథకాలు గుప్పించిన సంగతి తెలిసిందే. తీరా ఫలితాలు చూస్తే అవేం పెద్దగా దోహదపడలేదని స్పష్టమవుతోంది. నిరుద్యోగం, అధిక ధరలు, దిగజారిన జీవన ప్రమాణాలు ఇవే చాలా రాష్ట్రాల్లో ఓటర్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా బిజెపి ప్రభావం బాగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ మార్పు కనిపించింది. ఉచిత పథకాల వల్ల ఒరిగే ప్రయోజనం తాత్కాలికమే తప్ప నిత్యజీవన సమస్యలు పరిష్కారం కావన్న అభిప్రాయం ఓటర్లలో కనిపించింది.

మేనిఫెస్టోల్లో నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి, జీవన ప్రమాణాల పెరుగుదలకు దోహదం చేసే నిర్ణయాత్మక అంశాలేవీ చోటు చేసుకోకపోవడం పెద్దలోపం.ఒకరిని మించి మరొకరు సాధ్యం కాని హామీలనే తెరపైకి తెచ్చారు. క్షేత్రస్థాయిలో అవి ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేశాయో అని ఏ పార్టీ నిశితంగా పరిశీలించలేదు. మేనిఫెస్టోల్లో ప్రకటించిన సంక్షేమ పథకాలు ఓటర్ల దృష్టిలో సర్వసాధారణమయ్యాయి తప్ప ప్రత్యేకంగా ఆకర్షించినవి కాలేదు. మహిళలకు నగదు పంపిణీ, విద్యుత్ వినియోగంలో రాయితీలు, సబ్సిడీపై లేదా ఉచితంగా ఆహార ధాన్యాలు, తదితర హామీలన్నీ మేనిఫెస్టోల్లో ఎప్పటిలాగే చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఆంధ్ర లోని వైఎస్‌ఆర్‌సిపి ఉదారంగా సంక్షేమ పథకాలను అమలు చేసినా, వాటికి విస్తృత ప్రచారం కల్పించినా, లబ్ధిదారులకు నేరుగా ఫలితాలు అందినా, అసెంబ్లీకి, లోక్‌సభకి సంబంధించి ఓట్లు నీటిబొట్టుల్లా రాలాయి తప్ప గుమ్మరించకపోవడం విచిత్రం.

ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలించుకునే పనిలో పడింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2020 నుంచి ఉచితంగా రేషన్ ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నా అవేం ఓట్లను భారీగా రాబట్టలేకపోయాయి. ఇవన్నీ పరిశీలించి చూడగా సంక్షేమ పథకాల సంగతి ఎలా ఉన్నా, వాటి వల్ల ప్రయోజనాలు ఉంటున్నా, వీటన్నిటికీ మించి ఓటర్లలో అత్యధిక శాతం మంది ఉద్యోగాలు, ఆర్థిక స్థితి మెరుగుపరిచే సహాయ పథకాలనే ఆకాంక్షిస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. భారత దేశ స్థూల ఆర్థిక పరిమితులు చాలా బలమైనవి. ఆర్థిక ప్రమాణాలు చాలా వేగంగా సాగుతున్నాయి. ఏదేమైనా, పెరుగుతున్న జనాభా కు ఇదో గొప్ప అవకాశంగా మార్చగలుగుతారన్న నమ్మకం కల్పిస్తేనే కానీ అధికార పార్టీకి ప్రయోజనం సిద్ధించదన్న సంగతి పరోక్షంగా రుజువవుతోంది.ఎన్నికల ఫలితాల నుంచి వెలువడిన ఆర్థిక సందేశం ఉద్యోగాల కల్పనకు సంబంధించిందే.

1990లో మొదలైన ఆర్థిక సరళీకరణ నుంచి అభివృద్ధిపైనే ఆర్థిక విధానాలు కేంద్రీకరించవలసిన అగత్యం ఏర్పడింది. పేదలను దారిద్య్రరేఖకు ఎగువగా తీసుకెళ్లేందుకు తగిన ఆధారాలు ఉన్నంత వరకు ఆర్థిక అసమానతల గురించి పట్టించుకోవలసిన పని లేదని ప్రభుత్వంతో అంటిపెట్టుకున్న ఆర్థికవేత్తలు నిస్సంకోచంగా వాదించడం పరిపాటిగా వస్తోంది. ఈ ఆలోచనలకు మొదటి గట్టి సవాలుగా 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. ఇదే అభిప్రాయంతో అత్యధిక అభివృద్ధి ఉంటేనే కానీ అట్టడుగు వర్గాల ప్రయోజనాలు నెరవేరడానికి తగిన వనరులు సమకూరవని యుపిఎ 1 ప్రభుత్వం ఆనాడు తన హయాంలో ఆలోచించింది.ఈ లక్షంతోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించింది. ఈ విధానానికి బిజెపి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించి ఉచిత ఆహారం, ఇతర సంక్షేమ పథకాలను అమలు లోకి తెచ్చింది. దీని వల్ల దారిద్య్రరేఖకు దిగువనున్నవారిని పైకి తీసుకురాడానికి వీలయిందని ఆర్థికవేత్తలు నిర్వచించారు. అయితే దారిద్య్రరేఖ గురించి రానురాను పేదల అభిప్రాయాల్లో మార్పు రావడం ప్రారంభమైంది.

దేశం అత్యంత అధిక స్థాయిలో వినియోగ విధానాన్ని పాటిస్తుండడంతో అట్టడుగు వర్గాల్లోనూ ఆ మేరకు ఆకాంక్షలు పెరిగాయి. రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి తన విజయవంతమైన రాజకీయ గమనంలో దారిద్య్రరేఖకు దిగువనున్నవారిని పైకి తీసుకురావడమన్నది కేవలం మిథ్యగానే మిగులుతోందన్న వాస్తవాన్ని గ్రహించారు. అయితే కాంగ్రెస్ హామీలు పేదరికాన్ని అధిగమించే స్థాయికి మించిపోయాయి. అత్యధికంగా నగదు పంపిణీయే కాకుండా, కర్ణాటక, తెలంగాణ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నాటకీయంగా మార్పులు తీసుకొచ్చింది. దీంతో పేదరికం లేదా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలు తీరిపోవు. ‘ఇండియా’ కూటమి హామీ ఇచ్చిన విధంగా నగదు పంపిణీకి కట్టుబడకపోయినా, కనీసం ఆర్థిక అసమానతలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ ఆర్థిక విధానంలో కొంతయినా మార్పులు తీసుకురావలసిన అగత్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ఆధారంగా నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో పరిశీలించవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News