Thursday, January 23, 2025

కార్పొరేట్లకిస్తున్నది ఉచితం కాదా?

- Advertisement -
- Advertisement -

 

ఎన్నికల తరుణంలో ఓటర్లకు ఉచితాలను అందిస్తామని వాగ్దానాలు చేయకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శక సూత్రాలను జారీ చేయాలని బిజెపి నేత, లాయర్ అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖ లు చేశారు. ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలను అక్రమాలుగా పరిగణించలేమని 2013లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తాజా పిటిషన్, దాన్ని సవాలు చేస్తూ మరికొందరు కక్షిదారులుగా చేరటంతో వాటిని సమీక్షించేందుకు ముగ్గురు జడ్జీలతో సుప్రీంకోర్టు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఉచితాల వలన మన దేశం కూడా శ్రీలంక మాదిరి అవుతుందంటూ అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు.నిజమే, శ్రీలంక మాదిరి ఏ దేశమూ మారకూడదు. వారు చెప్పనిదీ, శ్రీలంక అసలు కారణం ఏమంటే ధనికులు, కార్పొరేట్లకు పన్ను లు తగ్గించటం. దివాలా కారణంగానే ఎరువులను దిగుమతి చేసుకోలేక ఆ బలహీనతను దాచిపెట్టి సేంద్రియ సాగుపేరుతో చేసిన పిచ్చి పనికి ఆ రంగం కూడా దెబ్బతిన్నది.

గతంలో కాంగ్రెస్ పాలకులు అనుసరించిన, వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నేత, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు ఇలాగే కొనసాగితే మన దేశం కూడా శ్రీలంకగా మారేందుకు రోజులు దగ్గరపడుతున్నాయని గ్రహించటం అవసరం. బడ్జెట్ అంటే దేశంలో వచ్చే రాబడి, సంపదలను అందరికీ సమంగా పంచటం, కొత్త రాబడిని సృష్టించేందుకు పెట్టుబడులు పెట్టటం. నిజంగా అలా జరుగుతోందా? జరిగితే జనాలకు ఉచితాలతో పని లేదు,ఎవరూ దేహీ అంటూ చేతులు చాచరు. రైతులు సాగును వదలి సంవత్సరాల తరబడి నిరవధిక ధర్నా చేయనవసరం లేదు. విధానపరంగా కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే, బిజెపి దేశానికి ఇస్తున్న బోనస్ ఏమిటంటే మతోన్మాదాన్ని రేకెత్తించటం. అసలు పేదలకు ఉచితాలను అందిస్తే, నగదు బదిలీ చేస్తే దేశ ఖజానా దివాలా తీస్తుందా, పన్నుచెల్లింపుదార్ల సొమ్ము వృధా అవుతుందా? కాస్త ఆలోచిద్దాం.

పేదలకు నేరుగా ఇచ్చే సొమ్మును వారు మార్కెట్లో ఏదో ఒక వస్తువు లేదా సేవ కొనుగోలుకు వెచ్చిస్తారు సమాజానికి తోడ్పడతారు తప్ప కార్పొరేట్ల మాదిరి పన్ను స్వర్గాల్లో, విదేశాల్లో సంపదలను కూడబెట్టుకోరు. ఉచితాలతో దేశం కుదేలవుతుందని చెబుతున్న అశ్వనీ ఉపాధ్యాయ (47) పుట్టక ముందే దేశంలో మూడు సార్లు 195758, 196566, 197273 ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం వచ్చింది.తరువాత 1991లో వచ్చింది. అప్పుడేమీ ఉచితాలు లేకున్నా ఇలా ఎందుకు జరిగిందో కొంత మంది తెలిసి కూడా చెప్పరు. మరికొందరు తెలివిగలవారు వారికంటే ఘనులు. చరిత్ర చాట భారతం, సిద్ధాంతాలు రాద్ధాంతాలు వినే ఓపిక ఎవరికి ఉంది చెప్పొద్దు అంటారు. మొత్తం మీద గతాన్ని గురించి ప్రస్తావించకూడదు. దీన్ని అంగీకరించాలా? రోజూ చర్చలో ఉన్న ఉచితాలు అనుచితాలు, సంస్కరణలు, నూతన విధానాలు గతంతో నిమిత్తం లేకుండా ఆకాశం నుంచి ఊడిపడితే ఓకే వాటి గతాన్ని చర్చించనవసరం లేదు.

అలా కాదే మరి! దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా? పార్లమెంటులో 2017 జులై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004 05 కస్టవ్‌‌సు, ఎక్సైజ్, కార్పొరేట్, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95 వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన 2014 15లో ఐదు లక్షల 54 వేల కోట్లకు చేరింది. వీటిలో రాష్ట్రాలు ఇచ్చిన భూమి, విద్యుత్, అమ్మకపు పన్ను, ఇతర రాయితీలు లేవు. అవి కూడా వేలు, లక్షల కోట్లలోనే ఉంటాయి. అంటే ఇంతేసి మొత్తాలను ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించింది. లేనట్లైతే ఆ మొత్తం ఖజానాకు చేరి జనాల సంక్షేమానికి లేదా పెట్టుబడుల ద్వారా దేశ సంపదల వృద్ధికి తోడ్పడేది కదా? మరి ఈ ఉచితాలు అనుచితాల గురించి వాటిని తమ జేబులోని సొమ్ము మాదిరి ఇచ్చిన ప్రభుత్వాల గురించి ఎవరూ ప్రశ్నించలేదే!

తమ ప్రభుత్వం వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఇస్తున్న ప్రోత్సాహం అని గొప్పలు చెప్పుకొనేందుకు, ఇంతేసి మొత్తాలను ఇస్తున్నాం రండె అని విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో వీటి గురించి కోల్పోయిన రాబడి శీర్షికతో పేజీలకు పేజీలు కేటాయించింది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత సరికొత్త పద్ధతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు. 2014 15లో కస్టవ్‌‌సు, ఎక్సైజ్ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రూ. 4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రూ. 1,48,442 కోట్లుగా పేర్కొన్నారు.

దీని అర్ధం ఖజానాకు మోడీ రూ. 2,87,314 కోట్లు మిగిల్చినట్లా? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 201415లో ఎక్సైజ్ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రూ. 99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రూ. 1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020 21నాటికి రూ. 3,72,970 కోట్లకు చేర్చారు. మరుసటి ఏడాది కొంత మేరకు తగ్గించటంతో రూ. 3,63,365కు తగ్గింది. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు. అశ్వనీ ఉపాధ్యాయ వంటి వారు వీటిని గురించి ఎందుకు పట్టించుకోలేదు? అసలు జరిగిందేమిటి?

ఉచితాలు, సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తున్నవారు గానీ, సమర్ధిస్తున్నవారు గానీ ఇవెందుకు ఉనికిలోకి వచ్చిందీ తెలుసుకోవాలి. దేశంలో 1991లో ఎగువున ఉన్న పది శాతం మంది జనాభాకు దేశ రాబడిలో 35 శాతం ఉండగా, అది 2014 నాటికి 57 శాతానికి పెరిగింది. సంస్కరణల పేరుతో కాంగ్రెస్ ఏలినా, ఆరేండ్లు బిజెపి వాజ్‌పేయి అధికారంలో ఉన్నా జరిగింది ఇది. కొందరికి సంపద పెరిగితే ఏడుపు ఎందుకు, సంపాదించటం చేతకాక అంటారు కొందరు? నిజమే ఏడవాల్సిన పనిలేదు. దేశ జనాభాలో 50 శాతం మందికి ఇదే కాలంలో వస్తున్న రాబడి 20.1 నుంచి 13.1 శాతానికి దిగజారింది. మరి దీనికి వారి ఖర్మ అనుకోవాలా ? చేతకాని అసమర్ధులని భావించాలా?

2022 ప్రపంచ అసమానతల సూచిక ప్రకారం మన దేశంలోని ఎగువ ఒక శాతం చేతిలో 22 శాతం సంపద చేరింది. దేశంలో మైనారిటీ తీరిన వారి సగటు సంపాదన ఏడాదికి రూ. 2,04,200 కాగా, దిగువ 50 శాతం మంది సగటు రాబడి రూ. 53,610, ఇక ఎగువ పది శాతం మందికి రూ. 11,66,520 ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొన్నది. తొలిసారిగా మన దేశంలో అసమానత నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) 201920 ప్రకారం ఎగువన ఉన్న పది శాతం మంది కార్మికుల్లో నెలకు ఇరవై ఐదువేలు సంపాదించేవారు ఉన్నారు. వారిలో కూడా ఎగువన ఉన్న ఒక శాతం రాబడి మొత్తంలో 67 శాతం కాగా, పది శాతం మంది మూడోవంతు పొందుతున్నారు. మరి దేశంలో కష్టపడనిది ఎవరు?

అందరికీ ఎందుకు పెరగలేదు? పేదల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది కనుక వారిలో అసంతృప్తి ప్రబలితే తమకు మొదటికే మోసం వస్తుందేమోనని ఉపశమన పరిచేందుకు తెచ్చినవే ఉచితాలు, సంక్షేమ పథకాలు. అధికారం కోసం ఒక పార్టీ కంటే మరొక పార్టీ ఎక్కువ ఇస్తానని చెప్పి ఓట్లను కొల్లగొట్టవచ్చు తప్ప సంక్షేమ పథకాలను ఎత్తివేసే పరిస్థితి లేదు. ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అమెరికా. అక్కడ కూడా దారిద్య్రంలో లేదా అల్పాదాయం ఉన్న కుటుంబాలు ఫుడ్ స్టాంప్స్ పేరుతో ప్రతి నెలా అర్హతలను బట్టి ప్రతినెలా 250 నుంచి 1,316 వరకు డాలర్ల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తున్నది. దీన్నే రూపాయల్లో చెప్పాలంటే ఇరవై వేల నుంచి లక్షా ఐదు వేల వరకు ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఈ కార్యక్రమం 1939లో మొదలు పెట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

జనంలో అసంతృప్తి తలెత్తుతున్నపుడు అధికారం కోసం అర్రులు చాచేవారు ఇతరులను విమర్శిస్తూనే తమ అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు అనివార్యంగా సబ్సిడీ, సంక్షేమ పథకాలను అనుసరిస్తారనేందుకు తాజా నిదర్శనం ప్రధాని నరేంద్ర మోడీ. సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018 డిసెంబరు నుంచి కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రకటించి మూడు విడతలుగా పదకొండు కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ. ఆరువేలు నేరుగా బాంకుల్లో వేస్తున్నారు. ఇప్పటికి పదకొండు విడతలు అందించారు. ధరల పెరుగుదలకు దారి తీసిన కారణాల్లో ప్రధానమైనదిగా చమురుపై సెస్‌ల పెంపుదల ఒకటి.

జనానికి ఉపశమనం కలిగించటం కంటే అదెక్కడ తన ఓటు బ్యాంకుకు గండికొడుతుందో అన్నభయంతో ఎలాంటి ఆందోళనలు తలెత్తక ముందే సెస్‌లను కొంత మేరకు తగ్గించటంతో పాటు తమ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్‌ను కొంత మేరకు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం చేసిన త్యాగం అని పేరు పెట్టారు. అంతర్జాతీయ ధరలను బట్టి ప్రతి రోజు చమురు ధరల తగ్గింపు లేదా పెంపు అన్నది ఒక విధానంగా చెప్పారు. ఏప్రిల్ ఆరు నుంచి వాటి ధరలను స్తంభింపచేశారు. సదరు విధానం నుంచి వైదొలిగినట్లా లేక మరొకటా? ఉచిత విద్యుత్, రైతాంగ రుణాల రద్దు, వివిధ సంక్షేమ కార్యక్రమాలకు కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తాలు కూడా త్యాగాల కిందకు రావా? అవి ఏటేటా పెరుగుతుంటే ఎంతకాలం భరించాలని కొందరు అంటున్నారు. అందుకే విధానాల గురించి చర్చ జరగాలి, కొన్ని రాష్ట్రాలు ఎందుకు అమలు జరుపుతున్నాయి, కొన్ని ఎందుకు అమలు జరపటం లేదు ? విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఉచితాల గురించి హితవు చెప్పారు. అలాంటి వాటిని పెంపొందించే ధోరణికి అడ్డుకట్ట వేస్తూ ప్రతిన పూనాలని అన్నారు.

ఉచితాలు దేశ హితం కోసం కాదు, దేశాన్ని వెనక్కు నెడతాయి. రాజకీయాల్లో స్వార్ధం ఉంటే ఎవరైనా వచ్చి పెట్రోలు, డీజిలు ఉచితంగా ఇస్తామని చెబుతారు. ఇలాంటి స్వార్ధం వలన నిజాయితీగా పన్ను చెల్లించేవారి మీద భారం పడుతుంది. ఇది విధానం కాదు, అనైతికం అంటూ మాట్లాడారు. ఇదే మోడీ గారు తన ఏలుబడిలో చేస్తున్నదేమిటి ? ప్రోత్సాహకాలు, పన్ను ఎక్కువగా ఉంటే ఎగవేత ఎక్కువగా ఉంటుందంటూ కార్పొరేట్లకు పన్ను తగ్గించి ఏటా కొన్ని లక్షల కోట్ల రూపాయలను కట్టబెడుతున్నారు. ఇది ఉచితమా అనుచితమా? జనానికి రావాల్సిందాన్ని ధనికులకు మళ్లించటమా? 2014 21 సంవత్సరాలలో కార్పొరేట్ పన్ను 30 నుంచి 18 శాతానికి తగ్గించారు. పోనీ దీన్ని సదరు కంపెనీలు తిరిగి పెట్టుబడులుగా పెట్టాయా? అలాంటి దాఖలాల్లేవు. పెట్టి ఉంటే దేశ వృద్ధి రేటు 8 నుంచి కరోనా ముందు నాలుగు శాతానికి ఎందుకు దిగజారినట్లు? కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ప్రకారం కొత్తగా పెట్టే సంస్థలకు కార్పొరేట్ పన్ను 15 శాతానికి పరిమితం చేశారు. ఎవడబ్బ సొమ్మునీ రామచంద్రా !

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News