Wednesday, January 22, 2025

దళిత క్రైస్తవుల మత స్వేచ్ఛకు భంగం

- Advertisement -
- Advertisement -

క్రిస్మస్ వచ్చిందంటే కేంద్ర, రాష్ట్ర అగ్రకుల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వాటిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి కేవలం క్రిస్మస్ పండుగకు హాజరైతే చాలు వాళ్ళకు అమలు కాని హామీలిస్తూ గత 75 సం॥రాలుగా పాలక సమాజం మోసం చేస్తున్నది. ముఖ్యంగా మత స్వేచ్ఛ విషయానికి వస్తే భారత రాజ్యాంగం అధికరణ 14, 15, 25 ప్రకారం రాజ్యాంగం ముందు అందరూ సమానమే. మత స్వేచ్ఛ భారత పౌరులందరికీ సమానంగా వర్తిస్తుందని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ మతం మారిన దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛను హరిస్తూ వారికి ఉన్న 15 శాతం రిజర్వేషన్లను తగ్గిస్తూ బిసిసి కోటా కింద దళిత క్రైస్తవులకు ఒక శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇంకా వారిపై అంటరానితనం కొనసాగుతుందనడానికి మంచి ఉదాహరణ. ఎందుకంటే అగ్రవర్ణాలు క్రైస్తవ, ఇస్లాం మతం మారినా 10 శాతం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు వారికి వర్తిస్తాయి.
అలాగే ఒబిసిలు క్రైస్తవ, ఇస్లాం మతం తీసుకుంటే వారికి 27% రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే ఆదివాసీలు క్రైస్తవ, ఇస్లాం మతం మారితే వారికీ 7% రిజర్వేషన్లు యథాతథంగా అమలవుతున్నాయి.

దళితులు అంటరానివారైనందుకే ఈ దేశంలో పుట్టిన హిందూ, సిక్కు, బౌద్ధం మతాలు స్వీకరిస్తే తప్ప వారికి రిజర్వేషన్లు వర్తించవు. ఇవి కుల వివక్ష కాదా? అంటరానితనాన్ని దళిత క్రైస్తవ/ ముస్లింలకు పాటించడం కాదా? ఇతర కులాలకి రిజర్వేషన్లు రద్దు కానప్పుడు కేవలం దళితులకు మాత్రమే రిజర్వేషన్లు రద్దు చేయడం మత స్వేచ్ఛను హరించడం కాదా? అట్లాగే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మతం మారిన దళిత క్రైస్తవ /ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమని సుప్రీం కోర్టుకు లిఖిత పూర్వకంగా ఇవ్వడమే కాకుండా ఈ అంశంపై సుప్రీం కోర్టు మొదటి దళిత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటి ఏర్పాటు చేసింది. గత 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దళిత క్రైస్తవులకు ఎస్‌సి హోదా ఇచ్చి వారికి రిజర్వేషన్ కల్పిస్తామని జస్టిస్ రంగనాధ్ మిశ్రా కమిషన్ 2004లో, జస్టిస్ రాజేంద్ర సంచార్ కమిటీని 2009లో ఏర్పాటు చేసి దళిత క్రైస్తవ /ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం వుందని, ఎందుకంటే వారు అత్యంత పేదరికంలో నేటికీ వున్నారని మతంతో ముడిపెట్టి కులపరంగా వివక్షను ఎదుర్కొంటున్న పై వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా ఈ కమిటీలు చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి 15% రిజర్వేషన్లు అమలు చేయకుండా, దళిత క్రైస్తవ /ముస్లింలను నేటికీ మోసం చేస్తూనే ఉన్నది.

బ్రిటీష్ ప్రభుత్వం ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ భారత రాజ్యాంగం రాష్ట్రపతి ఆర్డర్ 1950 పేరా నెం. 3 లో దళిత క్రైస్తవ/ ముస్లింలు మతం మార్చుకుంటే రిజర్వేషన్లు రద్దు చేసి ఈ ఆర్డర్ వర్తింపజేసి రాజ్యాంగ ప్రాథమిక హక్కులైన చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రానికి విరుద్ధం. అలాగే మత స్వేచ్ఛ అందరికీ సమానమని చెబుతున్న భారత రాజ్యాంగ అధికరణ 25కు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం అధికారికంగా కులవివక్షను పాటించడమే అవుతుంది. స్వాతంత్య్రం వచ్చి 75 సం॥రాలు గడిచినా, భారత రాజ్యాంగం అమలై 73 సం॥రాలు గడిచినా తమ మతాన్ని చెప్పుకునే హక్కు దళిత క్రైస్తవ/ ముస్లింలకు లేదు. వారి సర్టిఫికేట్‌లో హిందూ మతం, చర్చిల్లో క్రైస్తవ మతం ఈ రెండింటినీ ఆచరించలేక వారి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రతి పౌరునికి మత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా కేవలం అంటరాని కులాలైన దళితులకు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తూ పాలక సమాజం ఈ వర్గాలపై అంటరానితనాన్ని అధికారికంగా అమలు చేస్తున్నది. గత 30 సం॥రాలుగా మాదిగ దండోరా ఉద్యమం చేస్తున్న మందకృష్ణ మాదిగ అసలు పేరు మంద ఏలియా, క్రైస్తవుడు ప్రస్తుత బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ క్రైస్తవుడు అయినప్పటికీ తన మతాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి వీరికి లేదు. వీరే కాకుండా భారత దేశంలోని ప్రముఖ నాయకులు, అధికారులు నుండి మొదలుకుంటే సామాన్య ప్రజల వరకు ఇదే వివక్ష కొనసాగుతున్నది.

ఒక వైపు రాజ్యాంగ పరంగా అన్ని మతాలు సమానమే అని చెబుతున్న భారత రాజ్యాంగ నియమావళికి విరుద్ధంగా సెక్యులర్ సిద్ధాంతానికి తూట్లు పొడిచే విధంగా హిందూ మతంలో వుంటేనే మీకు రిజర్వేషన్లు ఉంటాయి క్రైస్తవ / ఇస్లాం మతాలను తీసుకుంటే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అని దళితులకు మాత్రమే ఎందుకు ఈ నిబంధనలు. మిగతా కులాలకు లేని ఈ నిబంధన దళితులకు గత 75 సం॥రాలుగా కొనసాగించడం ప్రపంచ మానవ హక్కుల నియమావళికి అలాగే కుల వివక్ష వ్యతిరేక చట్టాలకు విరుద్ధం. కేవలం క్రిస్మస్ మాత్రం కేక్ కట్ చేసి క్రైస్తవులకు భవనాలు కట్టిస్తామని, శ్మశాన వాటికలు నిర్మిస్తామని, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తూతూ మంత్రంగా అమలు కాని హామీలిస్తూ దగా చేస్తున్న ఈ అగ్రవర్ణ పార్టీలు ముఖ్యంగా కేంద్రంలో సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత 10 ఏండ్లుగా అధికారాన్ని కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలి. కనీసం క్రిస్మస్ సందర్భంగానైనా వీరి డిమాండ్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని వారి రక్షణ చట్టాలను తక్షణమే అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News