Wednesday, January 22, 2025

ప్రజా పాత్రికేయాన్ని కాపాడుకుందాం

- Advertisement -
- Advertisement -

పత్రికా స్వేచ్ఛ వదలరాని విలువైన ప్రత్యేక హక్కు అని గాంధీ అన్నారు. పత్రికా రంగం ప్రజాస్వామ్య నాల్గవ స్తంభం. మానవత్వ విలువల, సామాజిక బాధ్యతల, నైతిక పాత్రికేయత సమాజ నిర్మాణానికే మూలం. భారత జాతీయోద్యమంలో, స్వాతంత్య్ర సమరంలో, స్వేచ్ఛా సాధనలో, జాతీయ భావాల ప్రచారంలో, ఉద్యమాల నిర్మాణంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమీకరణ, ఐక్యతలలో, బలమైన ప్రజాభిప్రాయ నిర్మాణంలో పత్రికా రంగం కీలకంగా కృషి చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో, బ్రిటిష్ రాణి ప్రత్యక్ష ఏలుబడిలో బ్రిటిష్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై అనేక పరిమితులు విధించింది. లండన్ నుండి ప్రచురించే పత్రికలు భారత స్వాతంత్య్ర పోరాట ఘటనలను వక్రీకరించాయి. స్వాతంత్య్రం తర్వాత భారత రాజ్యాంగ అధికరణ 19, దాని ఉపాధికరణలు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛలను అందించాయి. జాతీయోద్యమంలో పాత్రికేయ కట్టడితో బాధలు పడిన భారత తొలి పాలకులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించ లేదు.

ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించినట్లు, తనపై శంకర్స్ వీక్లీ విమర్శలను ఆహ్వానించినట్లు చరిత్ర చెపుతోంది. ప్రభుత్వ విధానాల విమర్శ వ్యక్తి విమర్శ కాదని, దిద్దుబాట్లకు అవకాశమిస్తుందని, దేశ నిర్మాణంలో అది అవసరమని నెహ్రూ ఉద్దేశం కావచ్చు.ఆర్‌ఎస్‌ఎస్ మతవాదయితే తానూ మతవాదినేనని వితండీకరించిన సోషలిస్టు జయప్రకాశ్ నారాయణ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైన్యాన్ని, పోలీసులను, ప్రజలను ఒక బహిరంగ సభలో రెచ్చగొట్టారు. రాజ్యాంగ అధికరణ 352(2) ప్రకారం ఇందిర ఆత్యయిక స్థితిని రుద్దారు. 25 జూన్ 1975 నుండి 21 మార్చి 1977 వరకు 21 నెలల పాటు సాగిన అత్యవసర స్థితి కాలంలో పత్రికా స్వేచ్ఛ హరించబడింది. పాత్రికేయులను జైళ్ళలో పెట్టారు. కాని సమాజాన్ని మతపరంగా చీల్చలేదు. వైదికవాదులను ముస్లిం, క్రైస్తవులపై ఉసిగొల్పలేదు. ఆధిపత్య వర్ణాధికారంతో అల్పసంఖ్యాకులను పరాయీకరించలేదు. ప్రపంచీకరణలో ఉత్పత్తి రంగాలు, జాతి సంపదలతో పాటు సేవలనూ ప్రైవేటీకరించారు. ఈ నేపథ్యంలో పాత్రికేయ విధానంపై పరిమితులు ప్రారంభమయ్యాయి.

వార్తా ప్రసారం ప్రభుత్వాధికారంగా మారింది. వార్తా ప్రసార వ్యవస్థలు అందులో ప్రవేశించరాదన్న భావం నిర్మించబడింది. అయినా నాటి ప్రభుత్వాలు క్రమం తప్పకుండా పత్రికా సమావేశాలను నిర్వహించేవి. నేటి పాలకులు అధికరణ 19ని తుంగలో తొక్కారు. పత్రికా సమావేశాల ఊసే లేదు.సంఘీయులు పాత్రికేయులను విదేశాల్లో కూడా అవమానించారు, దాడులు చేశారు. నిజాలను బయటపెట్టి, నిర్మొహమాటంగా ప్రశ్నించిన, దేశభక్త, సత్యశోధక, ప్రజాపాత్రికేయులు, నిర్వాహకులను పాలకులు నేర పరిశోధన సంస్థల దాడులకు గురి చేస్తున్నారు. తమను సమర్థించని పాత్రికేయుల కంప్యూటర్లను విచ్ఛిన్నం చేశారు. వాటిలో తప్పుడు సమాచారాలను ఎక్కించారు. దొంగ సాకులతో ప్రాథమిక సమాచార నివేదిక, విచారణలు లేని, బెయిలు అవకాశం లేని చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం (ఉపా) కింద వారిని నిర్బంధిస్తున్నారు. జైళ్ళలో కుక్కుతున్నారు. టెలిగ్రాఫ్ ఆంగ్ల దినపత్రిక సంపాదకుడు ఆర్. రాజగోపాల్, అంతర్జాల పత్రికలు వైర్ సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్, న్యూస్ క్లిక్ సంపాదకులు ప్రబీర్ పురకాయస్థ, నిర్వాహకులు ముకేశ్ చక్రవర్తి మొదలగు వారు ఈ జాబితాలో ఉన్నారు.

అస్మత్ పాత్రికేయులకు అనుచిత ప్రయోజనాలు కల్పిస్తున్నారు. రిపబ్లికన్ టివి సంపాదకులు ఆర్ణబ్ రంజన్ గోస్వామి వీరిలో ప్రముఖులు. న్యాయస్థానాలు కూడా పాత్రికేయుల ప్రభుత్వ అనుబంధాన్ని బట్టి బెయిల్ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఆర్ణబ్ గోస్వామి బెయిల్ కోసం ఒకేసారి కింది కోర్టు నుండి సుప్రీంకోర్టు దాకా అభ్యర్థనలు దాఖలు చేసినా న్యాయమూర్తులు అభ్యంతర పెట్టలేదు. పాత్రికేయులకు న్యాయం చేయడం న్యాయస్థానాల బాధ్యతన్నారు. బెయిల్ ఇచ్చి, ఆ తీర్పు ప్రతి అందినంత వరకు ఆగవద్దని, అంతర్జాల ప్రతి పైనే చర్య తీసుకొమ్మని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత బాలిక అగ్రవర్ణ సామూహిక అత్యాచార హత్యకు గురయ్యారు. ఆ సమాచార సేకరణకు వెళుతున్న కేరళ వాసి, ఢిల్లీ పాత్రికేయుడు సిద్ధీక్ కప్పన్‌ను ఉపా చట్టం కింద అక్టోబర్, 2020 లో అరెస్టు చేసి మథుర జైళ్ళో పెట్టారు. జైల్లో ఆయనకు కోవిడ్ సోకినా బెయిల్ ఇవ్వలేదు. రెండేళ్ళ తర్వాత బెయిల్ ఇచ్చినా మరొక కేసులో జైల్లోనే ఉంచారు. 23 డిసెంబర్ 2022 న అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇద్దరు స్థానికుల రూ. లక్ష హామీ షరతు విధించింది. కేరళీయ, ఢిల్లీ పాత్రికేయునికి స్థానిక నగదు పూచీకత్తు సాధ్యమా?

ఈ రోజు 72% పత్రికలు, టివిలు న్యూస్- 18 పేరుతో ముకేశ్ అంబానీ వే. పత్రికా రంగంలో సంచలన మార్పులు తెచ్చిన రామోజీ రావు దిన పత్రికలు, టివిలు (ఈనాడు తెలుగు దినపత్రిక, ఈటివి తెలుగు తప్ప) ముకేశ్ అంబానీ సొంతం. కోల్‌కత పాత్రికేయురాలు రాధిక రాయ్, ఆమె భర్త ఆర్థిక నిపుణులు ప్రణయ్ రాయ్ 1984లో 24 గంటల ప్రసార స్వతంత్య్ర న్యూ ఢిల్లీ టివి (ఎన్‌డిటివి) ని స్థాపించారు. వార్తా ప్రసారాలపై ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తెంచారు. నిష్పక్షపాత వార్తలను అందించారు. ప్రధాని మోడీ ఎన్‌డిటివికి ప్రకటనలు ఆపు చేయించారు. వ్యాజ్య వ్యూహం పన్నారు. వారి పత్రికా స్వేచ్ఛపై దాడి చేశారు. 2022 ఆగస్టులో బహుళ జాతి సంస్థ యజమాని మోడీ మిత్రుడు గౌతం అదానీ ఎన్‌డిటివిలో 29.18 % వాటాను కబ్జాచేశారు. నవంబర్‌లో మరో 8% వాటాను కొన్నారు. డిసెంబర్ లో రాయ్ దంపతుల నుండి 27.53% వాటాను మాయాజాలంతో సంపాదించారు. దీంతో ఎన్‌డిటివిలో అదానీ వాటా 64.71కి ఎదిగింది. మోడీ అనానుకూల, ప్రజానుకూల పాత్రికేయత మూతపడింది. పత్రికల సంపాదక ప్రమాణాల పెంపుకు, పత్రికా స్వేచ్ఛ రక్షణకు స్థాపించబడ్డ స్వతంత్ర సంస్థ భారత ఎడిటర్స్ గిల్డ్ కు మౌనమే మిగిలింది.

దేశంలో ప్రతి రాజకీయ పార్టీకి దినపత్రికలు, టివి ఛానళ్ళున్నాయి. 2021 ఫిబ్రవరికి 900 అనుమతించిన ప్రైవేట్ ఉపగ్రహ ఛానళ్ళున్నాయి. ఇవి తమ యాజమాన్య కార్పొరేట్ సంస్థలకు, తమకు వాణిజ్య ప్రకటనలిచ్చిన సంస్థలకు, కార్పొరేట్ అనుబంధ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తాయి. ప్రజాస్వామ్యానికి, సమాజానికి ప్రజలు ఐదవ స్తంభం. ఈ రోజు ప్రజలు మతాధారంగా చీల్చబడ్డారు. పాలకులు మెజారిటి మతస్థులకు మతోన్మాదాన్ని ఎక్కించారు. వారి మెదళ్ళను అబద్ధాలతో, చారిత్రక వక్రీకరణలతో నింపారు. ఈ పనిలో పాలకవర్గ దళారీ సంస్థల ధృతరాష్ట్ర విశ్వవిద్యాలయం (వాట్స్యాప్‌లు) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు పురుషుల క్రికెట్, నేరాలు, చలనచిత్ర ప్రముఖులు, రాజకీయులు పత్రికారంగ ప్రధాన అంశాలు. సామాన్యులకు, స్త్రీలకు, సామాజికంగా వెనక్కునెట్టబడ్డ వారికి స్థానం లేదు. నేటి పాలకులు రాబోయే ఎన్నికల్లో కూడా నెగ్గితే ప్రజాపాత్రికేయతకే కాదు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, పేద ప్రజా బాహుళ్యానికి ముప్పు.

సమాజ మార్పుకు పత్రికా రంగం తక్షణ స్వల్పకాలిక ఆయుధం. సత్యసేకరణ, వాస్తవ నివేదిక పాత్రికేయతకు ప్రధానం. పాత్రికేయతనూ, పాత్రికేయులనూ నేటి పాలకులు చీల్చారు. ప్రభుపక్ష పాత్రికేయులను ప్రయోజనాలతో ప్రోత్సహిస్తున్నారు. ప్రజాపాత్రికేయుల మీద ఊహించని రీతుల్లో విపరీతమైన వత్తిడి పెంచారు. స్వేచ్ఛగా నిజాలు రాయడానికి, పాలకపక్ష ప్రజాస్వామ్య, రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను, భావజాల, సాంస్కృతిక దుర్మార్గాలను ప్రస్తావించడానికి అనేకులు జంకుతున్నారు. జనసామాన్యానికి అవసరమైన ప్రజా పాత్రికేయులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరిదీ. రాజ్యాంగమిచ్చిన పాత్రికేయ రక్షణకు ప్రజా సంఘాలు, పౌర హక్కుల వేదికలు, ప్రత్యామ్నాయ పార్టీలు కూడా పోరాడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News