Tuesday, April 15, 2025

వచన కవిత్వపు చిరునామా ఫ్రీవర్స్ ఫ్రంట్

- Advertisement -
- Advertisement -

అర్ధశతాబ్ద ప్రయాణం

సంఘటితం

అభ్యుదయ కవి కుందుర్తి ఆంజనేయులు (1922- 1982) తెలుగు సాహితీ లోకాన వచన కవితా పితామ హుడుగా ప్రశంసలు అందుకున్న ప్రముఖ కవి. అనేక కవితా సంక లనాలను ప్రచురించడమే కాకుండా, అయన అనేక పురస్కారాలు కూడా అందుకున్నాడు. వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు 1969లో అందుకున్నసోవియట్ లాండ్ నెహ్రూ పురాస్కారం ముఖ్యమైనవి. వచన కవిత్వాన్ని సాహిత్యంగా పరిగణించని రోజు లలో కందుర్తి వచన కవిత్వాన్ని ప్రాచుర్యం లోకి తెచ్చేందుకు, ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేసాడు. ఆ పనిని ఉద్యమంలా తెలుగు నాట అవిశ్రాంతంగా అయన కొనసాగించా డు. అందుకోసం ఫ్రీవర్స్ ఫ్రంట్ అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసి ఉత్తమ కవితా సంకల నాలకు అవార్డులు ఇవ్వడం, కవులను సత్క రించడం అనే పనిని ఆయన ఎంతో శ్రద్ధగా, పట్టుదలగా కొనసాగించాడు. ఫ్రీవర్స్ ఫ్రంట్ గుర్తించడం అన్నది కవులకు అత్యంత విలువై న ప్రశంసగా నేటికి కూడా ఉంది.

1967లో మొదటిసారి శీలా వీర్రాజుకి ఇవ్వడంతో ప్రారంభమైన ఈ అవార్డ్ పరంపర 50 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తరువాత వరవరరావు, వేగుంట మోహనప్రసాద్, చెరబండరాజు, నగ్నముని, కె.శివారెడ్డి, ఇస్మాయిల్, ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ, దేవిప్రియ, ఎన్.గోపి, రేవతీదేవి, నందిని సిధారెడ్డి, కొండేపూడి నిర్మల, అఫ్సర్, నారాయణస్వామి, జయ ప్రభ, ఘంటసాల నిర్మల, యాకూబ్, అనిశెట్టి రజిత ఇలా అనేక మంది ప్రముఖ కవులు ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. కవిత్వాన్ని ప్రేమిస్తూ, ఒక కవిత్వ సంస్థను ఈ నాటికీ కొనసాగించడం, ఒక తరం నుండి మరోతరం ఆ వెలుగును అందుకొని పదిల పరుస్తూ సాగటం సామాన్యమైన విషయం కాదు. ఫ్రీవర్స్ ఫ్రంట్‌ను నేడు పట్టుదలగా కొనసాగిస్తున్న శీలా సుభద్రాదేవి, కవిత కుందుర్తిలతో విమల సంభాషణ

కుందుర్తి ప్రారంభించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ ఏర్పడి 50 ఏళ్లు గడిచింది. అసలు ఈ సంస్థ ఏర్పాటు చేయాలని కుందుర్తి, మిత్రులు ఎందుకు ఆలోచించారు? అది ఎప్పుడు ప్రారంభమైంది? దాని ప్రయాణం గురించి చెప్తారా?

యాభైయ్యవ దశకంలో కవిసమ్మేళనాల్లో పద్యం, గేయమే ఎక్కువగా రాజ్యమేలాయి. కుందుర్తి ఆంజనేయులు గారు కవిత్వం రాసుకుంటూ కూర్చోకుండా వచనకవిత్వాన్ని ప్రచారం చేసి వేగవంతం చేసేందుకు ఊరూరా తిరుగుతూ కవితోత్సాహం ఉన్న యువకులకు వెన్నుతడుతూ, పీఠికలు రాస్తూ వచనకవిత్వ రచనల ప్రోత్సా హం కోసం విస్తృత ప్రచారం చేసారు. ఆ ప్రయత్నంలోనే 1958లో ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ (ఆంగ్లం: Freeverse front) సంస్థ ను హైదరాబాదులో నెలకొల్పారు. వచన కవితా ప్రక్రియను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన ఆశయం. సెలవు రోజుల్లో మా ఇం ట్లో గానీ, కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో గానీ కుందుర్తి గారి అధ్వర్యంలో నిర్వహించే కవితా గోష్టులు కావ్యపఠనాలలో అడవికొలను మురళీధర్, అరిపిరాల విశ్వం, నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, శివారెడ్డి, శీలా వీర్రాజు మొదలైన వచనకవులు పాల్గొనే వారు. యువ కవులను వెన్నుతట్టి మరింత ఉత్సాహపరచటానికి 1967 నుండి ఉత్తమ వచన కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డును ప్రకటించారు. కుందుర్తి గారు ఉన్నంత కాలం అవార్డు ఎంపిక పూర్తిగా ఆయనదే.

సాహిత్య పురస్కారాలలో ఫ్రీవర్స్ ఫ్రంట్ ఇచ్చే పురస్కారాన్ని కవులు ఉత్తమ పురస్కారంగా భావిస్తారు. ఉత్తమ వచన కవిత్వానికి, కవులకు అవార్డు ఇచ్చే ఈ సంప్రదాయం ఫ్రీవర్స్ ఫ్రంట్ ఎప్పటినుంచి ప్రారంభం ఇచ్చింది?

యువకవులను వెన్నుతట్టి మరింత ఉత్సాహ పరచటానికి 1967 నుండి ఉత్తమ వచన కవితా సంకలనానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డును ప్రకటించే వారు. తొలి అవార్డు శీలా వీర్రాజు గారి ‘కొడిగట్టిన సూర్యుడు సంపుటికి అందుకున్నారు. ప్రారంభం లో ఒకటి రెండు బహుమతులకు సి.నారాయణరెడ్డిగారు సహకరించారు. బహుమతి కింద రూ. 116/- ఇచ్చేవారు మొదట్లో. తర్వాత ఈ అవార్డు కింద ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.10,000ల నగదు, జ్ఞాపిక ప్రదానం చేస్తూ వచ్చారు.

కుందుర్తి ప్రారంభించిన ఈ సంస్థ ఆయన మరణించిన తర్వాత కూడా ఎంతోకాలంగా నడుస్తూనే ఉంది. ఆయన అనంతరం ఫ్రీవర్స్ ఫ్రంట్ బాధ్యతల్ని తీసుకొని ఎవరు ఎలా కొనసాగించారు?

కుందుర్తి గారు ఉన్నంతకాలం అవార్డు ఎంపిక పూర్తిగా ఆయనదే. 1982లో కుందుర్తి గారి మరణానంతరం వారి కుమారుడు కుందుర్తి సత్యమూర్తిగారు శీలా వీర్రాజు గారి సహకారంతో అవార్డు లు కొనసాగించారు. అపుడు వీర్రాజు గారు ముగ్గురు న్యాయనిర్ణేతల ఎంపికని అనుసరించి పారదర్శకంగా పురస్కారాలు ఇచ్చారు. 2013లో సత్యమూర్తి ఆకస్మిక మరణంతో వీర్రాజు గారు అవార్డులు గురించి కొంత ఆందోళన చెందారు. అప్పటికే 44అవార్డులు పూర్తయ్యాయి. ఒక దశలో వీర్రాజు గారు మరొక ఆరు పురస్కారాలు మేమే ఇచ్చి యాభై పూర్తి చేయాలనే ఆలోచన చేసారు. కానీ సత్యమూర్తి గారి శ్రీమతి కుందుర్తి శాంత తన భర్త,మామగారి ఆశయ సాధనకు ముందుకు వచ్చి శీలా వీర్రాజుగారితో సంప్రదించి యాభై అవార్డు లు పూర్తి చేయాలనుకున్నట్లు చెప్పారు. ఆ విధంగా ఒక వ్యక్తి తలపెట్టి స్థాపించిన ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ విజయవంతంగా యాభై అవార్డులను పూర్తిచేసిన ఘనత సాధించింది.

ఫ్రీవర్స్ ఫ్రంట్ తరపున గతంలో బ్యాంకులో వేసిన కొద్ది సొమ్ము డెడ్ అకౌంట్‌గా మారింది. కుందుర్తి సమత చొరవతో కరోనా సమయంలోనే బ్యాంకుకు తీసుకువెళ్ళి శీలా వీర్రాజుగారి చేత సంతకం చేయిస్తే రూ.45వేలు వచ్చింది. దీనిని ఫ్రీవర్స్ ఫ్రంట్ కోసం వినియోగించాలని మరో రూ.15 వేలు కలిపి ఆరుగురు సీనియర్ కవులకు కుందుర్తి శతజయంతి సందర్భంగా ప్రతిభా పురస్కారాలను శీలా వీర్రాజుగారు ప్రకటించారు. అయితే వీర్రా జుగారు ఉన్నప్పుడు జరగాల్సిన ఆ కార్యక్రమం వారి నిష్క్రమణ తర్వాత జూమ్ వేదికగానే 2022 జూలై 22న కుందుర్తి వారసులతో నేను కలిసి సమావేశం నిర్వహించాను.

ఫ్రీవర్స్ ఫ్రంట్ కవిత్వ ప్రచురణలను తీసుకు వచ్చిందా? ఆ వివరాలు చెబుతారా?

1966లో కుందుర్తి గారు తన కవితా సంపుటాలు ‘నాలోని నాదాలు ‘నగరంలో వాన’ తో పాటూ సివి కృష్ణారావుగారి ‘వైతరణి’ ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణ క్రింద తీసుకువచ్చారు. ‘తరం తరం ‘వంద మంది కవితల సంకల నం కుందుర్తి సంపాదకత్వం లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణ లు పేరుతో ప్రచురించారు. శీలా వీర్రాజు, సత్యమూర్తి కలిసి కవి సమ్మేళనం ఏర్పాటు చేసి ఆ కవితలను ‘పెన్‌గన్’ గానూ, ఆ తర్వాత down to earth ఆంగ్ల అనువాద సంకలనం ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలుగా వచ్చాయి. మళ్ళీ ఇటీవల కుందుర్తి ఆంజనేయులు గారి మనవరాలు కుందుర్తి కవిత ముందుకు వచ్చి తన కవితా సంపుటి ‘జస్ట్ ఎ హౌస్ వైఫ్’తో పాటు ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహంలో 2023లో బహుమ తి కవితల సంకలనం ‘ఆనవాళ్ళు’ని ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలకు పునర్వైభవం తీసుకువచ్చే ఉద్దేశ్యంతో వెలువరించింది.

ప్రస్తుతం ఫ్రీవర్స్ ఫ్రంట్ చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి?

ఫ్రీవర్స్ ఫ్రంట్ 49, 50 బహుమతులు ప్రకటించే సమయానికి ప్రపంచాన్ని కరోనా రాజ్యమేలుతుం ది. సింగపూర్‌లో ఉంటున్న కుందుర్తి మనవరాలు కుందుర్తి కవిత ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం తయారు చేసింది. గతంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్న వారిని, స్నేహితులు, హితుల్నీ అందర్నీ చేర్చాము. 201819లలో ప్రదానం చేయాల్సిన 49, 50 అవార్డులు 2021లో జూమ్ సమావేశం ద్వారా నిర్వహించిన అనంతరం వాట్సాప్ సమూహం 2022లో కుందుర్తి శతజయంతి వరకు కొనసాగించి, కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారాలు కూడా జూమ్ వేదికగానే 2022 జూలై 22న కుందుర్తి వారసులతో కలిసి నేను నిర్వహించాను. కుందుర్తి శతజయంతి అనంతరం ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహన్ని నిలిపివేయాలనుకుని కూడా కవి మిత్రుల కోరిక మేరకు కేవలం మంచి కవిత్వం చదివేందుకు, ఆస్వాదించేందుకు వేదికగా ఈనాడు ఈ సమూహం కొనసాగుతోంది. దాదాపు 50ఏళ్ళుగా కవిత్వ సృజన చేస్తున్న వారితో పాటు కొత్తగా రాస్తున్న యువకవులు, కవిత్వ ప్రేమికులు, ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహంలో చేరుతూనే ఉన్నారు. తెలుగు కవిత్వమే కాక ఇతర భాషలలో ఎటువంటి కవిత్వం వస్తుందో తెలుసుకోవటానికి ప్రతీ శనివారాన్ని ఇతర భాషల తెలుగు అనువాదాలకు కేటాయించాము. ప్రతి నెలా ఫ్రీవర్స్ ఫంట్ కవితల పోటీ నిర్వహించి మూడు కవితలు ఎంపిక చేసి రూ.500 చొప్పున కవులకు అందజేస్తున్నాం. 2023లో ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహంలో ప్రతీ నెల బహమతి పొందిన కవితలను సంకలనంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణగా తీసుకువచ్చాం. కుందుర్తి, శీలావీ ఆశయం మేరకు ప్రస్తుతం 200 మందికి పైగా కవులతో కేవలం వచన కవిత్వాన్ని ప్రోత్సహించడం కోసమే ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం కొనసాగుతోంది.

ఇప్పటివరకు సుభద్ర గారు సమాధానాలు ఇచ్చారు. కవిత కుందుర్తి, మీరు కుందుర్తి మనవరాలు మాత్రమే కాకుండా, కవియిత్రి కూడా. ప్రస్తుతం ఫ్రీవర్స్ ఫ్రంట్ కార్యక్రమాల్లో మీరు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. కుందుర్తి ప్రభావం మీ మీద ఉందా? ఫ్రీవర్స్ ఫ్రంట్‌ను ఇప్పటికీ కొనసాగించాలని మీరు ఎందుకు అనుకున్నారు ?

తాతగారి ప్రభావాన్ని నేను మాటల్లో చెప్పలేను. వచన కవిత్వం పట్ల ఆయన అంకితభావం తెలిసాక ఆ ప్రక్రియ పట్ల నాకు ఇంకా ఎక్కువ ఆసక్తి పెరిగింది. కవిత్వం పామర భాషలోకి రావాలని, అది సామాన్యుల చేతిలో ఆయుధం కావాలన్నది తాత ఎందుకాశించారో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. ఆయన ఆశయం కోసమే ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ ఎప్పుడూ పనిచేసింది. ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ గ్రూప్, ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల ద్వారా ముఖ్యంగా కొత్తగా రాస్తున్న యువతరాన్ని ప్రోత్సహించాలని మా ఆకాంక్ష.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News