పారిస్ : ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు నికోలస్ సర్కోజీకి అవినీతి కేసులో ఫ్రాన్స్ న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్ష విధించింది. 66 సంవత్సరాల ప్రెసిడెంట్ 2007 నుంచి 2012 వరకూ దేశాధ్యక్షులుగా ఉన్నారు.ఈ దశలో ఆయన మొనాకోలో న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కు అక్రమంగా పదోన్నతి కల్పించారనే ఆరోపణలు ఉన్యా. తన ప్రచారానికి సంబంధించి ఆర్థిక విషయాలు వెలుగులోకి రాకుండా ప్రమోషన్ ఇచ్చారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనను దోషిగా ఖరారు చేసి శిక్షలు ప్రకటించింది. సీనియర్ న్యాయమూర్తి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టుకున్నారని కేసులో తేల్చారు. ప్రస్తుత శిక్ష ప్రకారం మాజీ అధ్యక్షులు ఓ ఏడాది జైలులో ఉండాల్సి వస్తుంది. రెండేళ్ల పాటు సస్పెండెడ్ శిక్ష దశలో ఉంటారు. తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి, ఇంట్లోనే ఎలక్ట్రానిక్ కడియంతో బందీగా ఉండేందుకు అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. మరో కేసుకు సంబంధించి నర్కోజీపై ఇతరులతో పాటు ఈ నెలాఖరులో విచారణ జరుగుతుంది.