Saturday, November 23, 2024

ఫ్రెంచ్ మాండలిక మహాకవి ఫ్రెడరిక్ మిస్ట్రాల్

- Advertisement -
- Advertisement -

ఏటేటా ఈకలను రాల్చే నైటింగేల్ ఎన్నటికీ తన పాటను మార్చదు. – మిస్ట్రాల్.

ఫ్రెడరిక్ మిస్ట్రాల్ 1904 నొబెల్ పురస్కార గ్రహీత. 19 వ శతాబ్దపు గొప్ప ఫ్రెంచ్ కవి. అతని కవిత్వంలోమౌలికత కొత్తగా విచ్చుకుంది, అచ్చమైన ప్రాంతీయతా స్ఫూర్తి వెల్లివిరిసింది, సిసలైన మాండలిక చైతన్యంసహజసిద్ధంగా ప్రతిఫలించింది కనుక ఈ బహుమానంఅని నొబెల్ కమీటీ ప్రకటించింది. అతని రచనలన్నీఆయన అత్యంత ప్రియమైన స్వంత పరగణా ప్రొవాన్సాల్ ( provencal) ఘనతను ఆవిష్కరరించే కీర్తి స్తంభాలు. సూర్యుడు నా చేత పాట పాడిస్తాడు – ఇది తన మిత్రమండలి Felibrige కు అతడు పెట్టుకున్న మోటో. ఆతనిరాష్ట్రసూర్యుడు (Provencal Sun) దేశదేశాలలో పల్లె ప్రతిభలను ఆరబోశాడు. డాంటే, పెట్రాష్ వంటి పలు ప్రఖ్యాతయురోపియన్ కవుల నవీన రచనలలో ఆ మాండలిక సూర్యుని ప్రకాశం కనిపిస్తుంటుంది. ప్రొవాన్స్ (Provence) అలనాటి దక్షిణ ఫ్రాన్స్ కు చెందిన భూభాగం. ఇటలీ, మెడిటరేనియన్ సముద్రాలనుఆనుకొని వుంటుంది. అందమైన ఆలఫ్స్ పర్వతాలతో, ఆకుపచ్చని అడవులతో, లావండర్ మైదానాలతోకనువిందు చేస్తుంటుంది. ప్రొవాన్స్ మిస్ట్రాల్ జన్మభూమి. ఆతని కవిత్వపు జీవనాడి. ఫ్రాన్స్ కు చెందిన మేలానే (Maillane) గ్రామం లో జన్మించి , అదే చోట 1914 లో మరణించాడు. అతని భార్య మేరీ లూయిస్ రివియర్. అతనికి సంతానం కలుగ లేదు. సంపన్న వ్యవసాయక కుటుంబం. తెమ్మిదవ ఏట గాని బడిలో చేరలేక పోయాడు. పోకిరి చేష్టల కారణంగా అతన్ని బోర్డింగ్ స్కూల్ లో వేయకతప్పలేదు. డిగ్రీ తరువాత న్యాయశాస్త్రం(Law) చదివాడు. ఆరోజుల్లోనే, వెనుకబడి వున్న తన స్వంత ప్రాంతమైనProvence మీద అభినివేశం పెరిగింది. రాష్ట్రీయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం కలలు కన్నాడు. తన ప్రాంతపుప్రొవాన్సాల్ ( Provencal) భాషను తొలి నవవాగరిక యుూరోప్ సాహిత్య స్థాయికి చేర్చాలని జీవిత పర్యంతంపాటుబడ్డాడు. తమ భాషను ఒక దైవ భాషగా భావించాడు. జాతి అంటే ముమ్మాటికీ మూల భాషల వికాసమేననిగట్టిగా నమ్మాడు. కొందరి మిత్రులతో కలిసి Filibrige అనే సాహిత్య సంస్థను స్థాపించుకొని ఆక్సిటాన్ (Occitan) భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ప్రొవాన్సాల్ కు సరిపడే సజాతీయ భాష ఆక్సిటాన్. దక్షిణ యూరోప్ లోనిఫ్రాన్స్, స్పేన్, ఇటలీ, మొనాకో ప్రాంతాల మూలజాతుల జనసామాన్యపు వాడుక భాష. Provencal కు అధికప్రాధాన్యత వున్న Occitan గ్రామీణ సాహిత్యాన్ని పునరుద్ధరించ్చేందుకు జీవితాన్ని ధారపోశాడు. తన కావ్యాలనుగొల్ల వాళ్లకు(Shepherds), రైతు కూలీలకు అంకితం చేశాడు. ఆక్సిటాన్ భాషను సంస్కరించి, 20 ఏళ్ళు శ్రమించి, తొలిడిక్షనరీని సృష్టించిన భాషావేత్త మిస్ట్రాల్. దక్షిణ యూరోపాలో కాలిక పుటలలో నిక్షిప్తమై వున్నపురాగాధాసాహిత్యాన్ని సేకరించి ప్రచురించాడు. నోబెల్ పురస్కారంలో లభించిన మొత్తం డబ్బును Provencal సంస్కృతి, గ్రామీణ కళలు ప్రతిబింబించే వినూత్న మ్యూజియమ్ నిర్మాణానికి వెచ్చించాడు.
మిస్ట్రాల్ గ్రామీణ అభినివేశం సాటిలేనిది. Provence పై తనకున్న ప్రేమాభిమానాన్ని ఇలా ప్రకటించుకోవడంఅతని ప్రాంత ప్రీతికి అద్దం పడుతుంది: దేవుడు ప్రపంచం గురించి సందేహం లో పడిపోయినప్పుడు, తానునిర్మించిన Provence ను గుర్తు చేసుకుంటాడు. మిస్ట్రాల్ భాష సంగీత భాష. సూర్యతేజాన్నీ, కళాత్మక వైభవాన్నీ పుణికిపుచ్చుకున్న సరళ సుందరకవితాత్మక భాష. అతని కవిత్వం సహజ సాధారణమానవ సంవేదనలను, స్వచ్ఛమైన ప్రకృతి రామణీయకతను, నిరాడంబర గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే అక్షరాకృతి. అతనెప్పుడూ పల్లెలను, పల్లె బతుకులనుపాడుతుంటాడు. అతని ముఖ్యమైన ప్రసిద్ధ కావ్యాలు నాలుగు. అన్నింట తలమానికం అతని దీర్ఘ కవిత మీరయు( Mireio). మిస్ట్రాల్ కాలంనాటి వాస్తవ కథకు కవితాత్మక కథన రూపం మీరయు(Mireio). ఓ సంపన్న వ్వసాయదారునికూతురు ఒక నిరుపేద మేదరి యువకుని ప్రేమలలో పడుతుంది; ఆమె చావుతో కథ ముగుస్తుంది. కథసామాన్యమైనదే, కాని, మిస్ట్రాల్ అందులో తన పల్లె ప్రేమను కుమ్మరించాడు. అద్భుతమైన కథన కౌశలంతో, వర్ణణలతో, సంభాషణలతో శ్రావ్యగానం చేశాడు. ఓ ప్రొఖ్యాత ఫ్రెంచ్ నాటక దృశ్యరూపకంగా ‘మీరయు’(Mireio) ప్రదర్శించబడింది. మరో విషాదాంత ప్రేమకథలో కథానాయకుడు హాలండ్ దేశ యువరాజు, నాయకి ..కూతురు. వాళ్ళు పడవలోపారిపోతుంటారు; రోన్ నదిలో ఓడ మునిగిపోతుంది. ఈ కవితలో మానవ జీవనం లోని రంగులు, పురాసాంస్కృతిక వైభవం కవిత్వీకరించబడింది. ఇందులో, లోకంలో తాను ఆశించిన ఆశయం, తన జీవితధ్యేయం నెరవేరలేదన్న మిస్ట్రాల్ నిరాశ ధ్వనించిందని అంటారు. మిస్ట్రాల్ రచించిన కవిత ‘పవిత్ర పాత్ర’ – Coupo Santo (Holy Cup)- రాష్ట్రగీతంగా గౌరవించబడింది. వాళ్ళ మిత్రమండలి (Felibrige) అన్ని సమావేశాలను విధిగా ఈ గీతంతో ముగిస్తారు.

ఇవి, లూయిస్ ఎషర్ ఆంగ్లం లోకి అనువదించిన మిస్రాల్ కవితాఖండికలకు నా స్వేచ్ఛానువాదాలు:
1.
అప్పుడు నేను / ప్రేమలో పడిన పడచు కన్నె వలపును పాడాను, / ఇప్పుడు / రత్నరాశినీ, రాజ్యాన్నీ, ప్రేమ సామ్రాజ్యాన్నీ గెలిచిన / ఒక సామాన్య జాలరి కథను పాడుతాను. / ఓ నా జాతి హృదయమా!
నీ మెరుపు / నా దేశభాషలో ఉంది,
నీ జీవితం / నా ఐతిహ్యంతో పెనవేసుకుంది.
రోడ్ నదీ లలిత పవనాల మంద్ర స్వనాలతో,
మన వన గానాలతో, స్రవంతీ సంగీతంతో
మమేకమైన / ఓ నా జాతీయ ఆత్మచైతన్యమా!
నిన్ను అవతారంగా భావిస్తాను.
2.
హో, నా పవిత్ర నగరమా! / సూర్యుడు తన ప్రభలను సదా నీపై నిలిపి ఉంచు గాక! / అన్ని వేళలా మమ్ములను ఆనందంలో ముంచి ఉంచు గాక!
నీవు మరువ లేదు మన పురాతన భాషను;
నిగూఢ రహస్యాలను, సనాతన నిధులను, సాహితీ సౌరభాలను! / ఈకలను రాల్చుతుంటుంది ఏటేటా నైటింగేల్, / కాని, ఎన్నటికీ మార్చదు తన తేనె పాటను!
3.
మౌనంగా ఉండిపో ఓ నైటింగేల్! / విను అందాల గీతాల ఆగస్ట్ పాటలను / చందమామ అంటున్నది:
మేఘమా నేను నా నగరం మీద / నా కిరణాలను రాల్చాలనుకుంటాను; / కాని నీ నీడ నన్ను అడ్డగిస్తున్నది.
చిన్ని మిణుగురు అంటున్నది:
కన్నె ప్రేయసీ పట్టు కెళ్ళు నా ఒంటి దివ్వెను; /కాచుకున్నాడు నీ ప్రియతముడు / చిట్టి పిట్టలను ఊపుతున్న గూటి గువ్వ
నా ప్రేయసిని చూడాలని తొంగిచూస్తున్నది.
మౌనంగా ఉండిపో ఓ నైటింగేల్!
ఆగస్ట్ అందాల గీతాలను పాడుతున్నది.
4.
ఆమె రాచకన్నె! / ఆజాతశత్రువు ఆమె అందం, వంశం.
ఆమె మాటలకు / పడి చస్తుంది ప్రేమలోకం.
కవులూ మూగుతారు చుట్టూ, / ఆమె ఓ ఆణిముత్యం;
రవికిరణాల రాచరికపు దుస్తుల్లో / వెలిగి పోతుంటుంది.
ఆమె అన్నీవున్నా, / ఏమీలేని ఓ ఒంటరి దొరసాని!
ఆమె అందాల కంటి తుదల / ఎల్లప్పుడూ ఏదో
దైన్యమేఘం వేలాడుతుంటుంది.
5.
ఓ! నా ప్రాంతీయ ప్రభూ! / నా గొల్లల నడుమ ప్రాణం పోసుకున్న ఏలికా! / నా మాటలలో జ్వాలలను మండించు,
నాకు నా శ్వాసను ప్రసాదించు.
( ఇది ఏసు ప్రభువును దృష్టిలో పెట్టుకొని రాసిన కవిత. అతనికి ప్రభువు కూడా ప్రాంతీయుడే!
6.
ప్రొవాన్సాల్ ప్రజలలారా! / ఇది పవిత్ర పాన పాత్ర!
రండి, సేవిద్దాం మన ద్రాక్ష తోటల మధుర పానీయాన్ని.
ఓ నాయకులారా! వంచండి ఈ కలశం లోకి
మన పూర్వీకుల యువోత్సాహాన్ని,/ నిన్నటి ఆశావహ స్వప్నద్రవాన్ని,/ మృత్యువును సైతం ధిక్కరించే
సత్యాన్ని, జ్ఞానాన్ని, అందా న్ని, ఆనందాన్ని,
మనిషిని దేవునిగా మార్చే కవన పీయూషాన్ని.
పల్లె జీవన పునరుద్ధరణకై అహరహం తపించిన ఫ్రెంచ్ మాండలిక మహాకవి ఫ్రెడరిక్ మిస్ట్రాల్!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News