Monday, December 23, 2024

కాటో-పుట్జ్ జోడీకి మిక్స్‌డ్ టైటిల్

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో మియు కాటో(జపాన్), టిమ్ పుట్జ్ (జర్మనీ) జోడీకి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ దక్కింది. గురువారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో కాటో జంట 4-6, 6-4, 10-6 తేడాతో బియాంకా అండ్రెస్కో (కెనడా)మైఖేల్ వెనస్ (న్యూజిలాండ్) జోడీని ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో అండ్రెస్కో జోడీ ఆధిపత్యం చెలాయించింది. అద్భుత షాట్లతో కాటో జంటను హడలెత్తించింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ సెట్‌ను దక్కించుకుంది. అయితే తర్వాతి సెట్‌లో కాటో జంట పుంజుకుంది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగింది. ప్రత్యర్థి జంటను వెనక్కి నెడుతూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో సెట్‌ను సొంతం చేసుకుంది. కాగా, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా హోరాహోరీ పోరు తప్పలేదు. ఈసారి ఇరు జోడీలు ప్రతిపాయింట్ కోసం సర్వం ఒడ్డాయి. దీంతో పోరులో ఉత్కంఠ తప్పలేదు. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో కాటో జోడీ విజయం సాధించి మిక్స్‌డ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

టైటిల్ పోరుకు డొడిగ్ జంట
పురుషుల డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా)అస్టిన్ క్రాజిసెక్ (అమెరికా) జంట టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరో సెమీ ఫైనల్లో బెల్జియంకు చెందిన జొరాన్ వ్లిగెన్‌సాండర్ గిల్లె జంట విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో డొడిగ్ జోడీతో ఈ జంట తలపడనుంది. కాగా, గురువారం జరిగిన సెమీఫైనల్లో డొడిగ్ జంట 6-3, 7-6తో మార్సెల్ గ్రానొలర్స్ (స్పెయిన్), హరాసియో జెబాలొస్ (అర్జెంటీనా) జంటను ఓడించింది. ఆరంభం నుంచే డొడిగ్ జోడీ దూకుడును ప్రదర్శించింది. వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో జొరాన్ జంట 6-4, 7-5తో అండ్రిస్ మైస్(జర్మనీ) మిడెల్ కూప్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించింది.

సెమీ ఫైనల్లో రూడ్
పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో రూడ్ ఆరో సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్)ను ఓడించాడు. నాలుగు సెట్ల సమరంలో రూడ్ 6-1, 6-2, 3-3, 6-3 తేడాతో రూనేపై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో రూడ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. రూనేకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లను దక్కించుకున్నాడు. అయితే మూడో సెట్‌లో మాత్రం రూనే జోరును కొనసాగించాడు. అద్భుత షాట్లతో రూడ్‌ను హడలెత్తించాడు. చివరి వరకు దూకుడును ప్రదర్శించిన రూనే సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే నాలుగో సెట్‌లో మళ్లీ రూడ్ ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News