Wednesday, January 22, 2025

ఫ్రెంచ్ ఓపెన్‌: మెద్వెదేవ్‌కు షాక్..

- Advertisement -
- Advertisement -

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌లలో ఒకడిగా పరిగణించిన రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. బ్రెజిల్‌కు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు థియాగో సిబోథ్ వైల్డ్ చేతిలో డానిల్ కంగుతిన్నాడు. హోరాహోరీగా సాగిన ఐదు సెట్ల మారథాన్ సమరంలో థియాగో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆరంభం నుంచే నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో వైల్డ్ 7-6, 6-7, 2-6, 6-3, 6-4 తేడాతో డానిల్‌పై విజయం సాధించాడు.

తొలి సెట్ నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు డానిల్ అటు థియాగో ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో తొలి రెండు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లాయి. తొలి సెట్‌లో వైల్డ్, రెండో సెట్‌లో డానిల్ విజయం సాధించారు. కీలకమైన మూడో సెట్‌లో మెద్వెదేవ్ మరింత చెలరేగి పోయాడు. అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ తర్వాతి రెండు సెట్లలో థియోగో దూకుడును ప్రదర్శించాడు. డానిల్ జోరుకు బ్రేక్ వేస్తూ లక్షం దిశగా సాగాడు. ఇదే క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) విజయం సాధించాడు.

స్వీడన్ ఆటగాడు ఎలియాస్ ఇమర్‌తో జరిగిన మ్యాచ్‌లో రూడ్ 64, 63, 62 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. 22వ సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), 27వ సీడ్ యోషిహిటో నిషియోకా (జపాన్), 23వ సీడ్ ఫ్రాన్సిస్కో (అర్జెంటీనా) తదితరులు కూడా తొలి రౌండ్ పోటీల్లో విజయం సాధించి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్), ఆరో సీడ్ కొక గాఫ్ (అమెరికా) రెండో రౌండ్‌కు చేరుకున్నారు. గాఫ్ హోరాహోరీ పోరులో 3-6, 6-1, 6-2 తేడాతో రెబెకా మసరొవా (స్పెయిన్)పై విజయం సాధించింది. రిబకినా 6-4, 6-2తో బ్రెండా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. అయితే 13వ సీడ్ బార్బొయా క్రెజ్సికొవా (చెక్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News