Wednesday, January 22, 2025

మూడో రౌండ్‌లో స్వియాటెక్, రూడ్

- Advertisement -
- Advertisement -

మూడో రౌండ్‌లో స్వియాటెక్, రూడ్
ఎకటెరినా, రిబకినా ముందుకు
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), నాలుగో సీడ్ ఎలినా రిబకినా (కజకిస్థాన్) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 15వ సీడ్ బొర్నా కొరిక్ (క్రోయేషియా) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. ఇతర పోటీల్లో 27వ సీడ్ యోషిహిటో నిషియోకా (జపాన్), 28వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) తదితరులు జయకేతనం ఎగుర వేశారు. దిమిత్రోవ్ రెండో రౌండ్‌లో ఎమిల్ (ఫిన్లాండ్)ను ఓడించాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో దిమిత్రోవ్ 76, 63, 64తో జయభేరి మోగించాడు.

మరో మ్యాచ్‌లో యోషిహిటో 46, 62, 75, 64తో ఆస్ట్రేలియాకు చెందిన మాక్స్ పుర్సెల్‌ను ఓడించాడు. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరి వరకు దూకుడుగా ఆడిన జపాన్ ఆటగాడు మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఇక నాలుగో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించాడు. ఇటలీకి చెందిన గియిలియో జెప్పిరోతో జరిగిన మ్యాచ్‌లో రూడ్ 63, 62, 46, 75 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. తొలి రెండు సెట్లలో రూడ్ అలవోక విజయం అందుకున్నాడు. కానీ మూడో సెట్‌లో ప్రత్యర్థి ఆటగాడు పైచేయి సాధించాడు. కానీ మళ్లీ నాలుగో సెట్‌లో గెలిచిన రూడ్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు.

గట్టెక్కిన కొరిక్..
మరో మ్యాచ్‌లో బొర్నా కొరిక్ అతి కష్టం మీద విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన రెండో రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు పెడ్రొ కాచిన్‌ను ఓడించాడు. ఐదు సెట్ల సమరంలో కొరిక్ 63, 46, 46, 63, 64తో ప్రత్యర్థిని కంగుతినిపించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు కొనసాగింది. తొలి సెట్‌లో కొరిక్ విజయం దక్కించుకున్నాడు. కానీ తర్వాత కాచిన్ వరుసగా రెండు సెట్లు గెలుచుకుని కొరిక్‌కు షాక్ ఇచ్చాడు. అయితే కీలక సమయంలో కొరిక్ పుంజుకున్నాడు. వరుసగా రెండు సెట్లను గెలిచి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. అర్జెంటీనాకు చెందిన టొమాస్ మార్టిన్ చేతిలో మినార్ కంగుతిన్నాడు.

ఇగా అలవోకగా..
మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ అలవోక విజయం సాధించింది. అమెరికాకు చెందిన క్లెర్ లియుతో జరిగిన రెండో రౌండ్‌లో ఇగా స్వియాటెక్ 64, 60తో జయభేరి మోగించింది. తొలి సెట్‌లో ఇగాకు ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైంది. అయితే రెండో సెట్‌లో మాత్రం ఇగా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ రిబకినా విజయం సాధించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన లిండా నొసొకొవాతో జరిగిన పోరులో రిబకినా 63, 63తో జయకేతనం ఎగుర వేసింది. మరో మ్యాచ్‌లో బ్రెజిల్‌కు చెందిన హద్దాద్ మాయ విజయం సాధించింది. రెండో రౌండ్‌లో మాయ 62, 57, 64తో రష్యాకు చెందిన డయానాను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News