Friday, November 8, 2024

సెమీస్‌లో స్వియాటెక్, హద్దాద్

- Advertisement -
- Advertisement -

సెమీస్‌లో స్వియాటెక్, హద్దాద్
అల్కరాజ్ ముందుకు, సిట్సిపాస్, జాబేర్ ఔట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్, 14వ సీడ్ బియట్రిట్జ్ హద్దాద్ మయా (బ్రెజిల్) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) ముందంజ వేశాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ ఓన్స్ జాబేర్ (ట్యూనీషియా), ఆరో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీస్) ఓటమి పాలయ్యాడు. ఇక మహిళల విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ అలవోక విజయాన్ని అందుకుంది.

అమెరికా యువ సంచలనం గాఫ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6-4, 6-2తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో స్వియాటెక్‌కు ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైంది. అయితే చివరి వరకు దూకుడుగా ఆడిన ఇగా సెట్‌ను తన ఖాతాలో సెట్‌ను వేసుకుంది. తర్వాతి సెట్‌లో ఇగా మరింత చెలరేగి పోయింది. ఈసారి ప్రత్యర్థికి కనీసం కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చూడచక్కని షాట్లతో అలరించిన ఇగా అలవోకగా సెట్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో బ్రెజిల్ క్రీడాకారిణి హద్దాద్ విజయం సాధించింది. ఏడో సీడ్ జాబేర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హద్దాద్ 3-6, 7-6, 6-1తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో హద్దాక్‌కు చుక్కెదురైంది. జాబేర్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ సెట్‌ను సొంతం చేసుకుంది.

రెండో సెట్‌లో కూడా ఒక దశలో జాబేర్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగిన హద్దాద్ టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో జాబేర్ పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యర్థికి కనీస పోటీ కూడా ఇవ్వకుండానే సెట్‌ను చేజార్చుకుంది. ఇక మూడో సెట్‌లో అలవోకగా గెలిచిన హద్దాద్ సెమీస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా హద్దాద్ చరిత్ర సృష్టించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో అల్కరాజ్ అలవోక విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. సిట్సిపాస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6-2, 6-1, 7-6తో జయకేతనం ఎగుర వేశాడు. సిట్సిపాస్ కేవలం మూడో సెట్‌లో మాత్రమే కాస్త గట్టి పోటీ ఇచ్చాడు. ఇదిలావుంటే మూడో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News