టిఎంసి నేతలపై స్థానికుల ఆగ్రహం
కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని కల్లోలిత సందేశ్‌ఖలిలో గురువారం మధ్యాహ్నం మళ్లీ నిరసనలు ప్రజ్వరిల్లాయి. మహిళలపై అత్యాచారాలు, భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా స్థానికులు రోడ్లపైకి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. కర్రలు చేత పట్టుకున్న స్థానికులు చెరువు సమీపంలో ఉన్న ఒక గుడిసెకు నిప్పుపెట్టారు.
పరారీలో ఉన్న టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్, అతని సోదరుడు సిరాజ్‌పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ సిరాజ్‌కు చెందిన గుడిసెకు నిప్పుపెట్టారు. షాజహాన్, అతని సోదరుడు సిరాజ్ తమ భూమిని కబ్జా చేశారని ఒక నిరసనకారుడు తెలిపాడు. తమ మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, తమకు న్యాయం చేసి తమ భూమిని తమకు అప్పగించాలని అతను డిమాండ్ చేశారు. రాష్ట్ర డిజిపి రాజీవ్ కుమార్ ఆ ప్రాంతాన్ని సందర్శించి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించి తమ ఫిర్యాదులను, ఆధార పత్రాలను అందచేయవలసిందిగా స్థానికులకు సూచించారు.
మీ భూమికి సంబంధించిన ఆధారాలను సమర్పిస్తే దాన్ని మీకు స్వాధీనం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్థానికులకు హామీ ఇచ్చారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన టిఎంసి నాయకులు సందేశ్‌ఖలిని సందర్శించి స్థానికులకు మద్దతు తెలియచేశారు. అయితే వారికి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. షాజహాన్, అతని సోదరుడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.