Friday, December 27, 2024

ఇంఫాల్‌లో తిరిగి వర్గ ఘర్షణలు.. వీధుల్లో సైన్యం పహారా

- Advertisement -
- Advertisement -

వీధుల్లో సైన్యం పహారా..కర్ఫూ

గువహతి : మణిపూర్ తిరిగి కుల ఘర్షణలతో రగులుకుంది. రాజధాని ఇంఫాల్‌లో మైతీ, కుకీ వర్గాలు న్యూ చెకోన్ ప్రాంతంలో తలపడ్డాయి. దీనితో ఇంఫాల్‌లో సోమవారం తిరిగి కర్ఫూ విధించాల్సి వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. సైన్యాన్ని తిరిగి రప్పించారు. రాష్ట్రం తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటోన్న దశలో స్థానిక మార్కెట్ స్థలంపై ఇరు వర్గాల మధ్య వివాదం చివరికి కొట్లాటలకు దారితీసింది.

ఉదయం పూటనే ఘర్షణలు చోటుచేసుకోవడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కర్ఫూ విధించారు. ఆ తరువాత మధ్యాహ్నం నాలుగు గంటల వరకూ సడలిస్తున్నట్లు తెలిపినప్పటికీ తిరిగి ఘర్షణలు, హింసాకాండ నెలకొనడంతో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తిరిగి కర్ఫూ విధించి, దుకాణాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలను మూసివేయించారు. మైతీ కులస్థులను ఎస్‌టి జాబితాలో చేర్చే హైకోర్టు ఆదేశాలు రాష్ట్రంలో హింసాకాండకు దారితీశాయి. ఇతర అంశాలు కూడా తోడయి పరిస్థితి దిగజారింది. అయితే కేంద్ర బలగాలు, సైన్యం రంగంలోకి దిగడంతో అతి కష్టం మీద పరిస్థితి అదుపులోకి వచ్చింది.

కానీ ఆదివారం రాత్రి నుంచి పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఈ నెల 3న కుకీలు తీసిన శాంతియుత ప్రదర్శన దశలో పెద్ద ఎత్తున అల్లర్లు, ఘర్షణలు చెలరేగి , రాష్ట్రమంతటికి విస్తరించుకున్నాయి. వారం రోజుల ఈ పరిస్థితి దశలో 70 మందికి పైగా ఘర్షణలలో చనిపొయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసం జరిగింది. ఇప్పటికీ పలువురు సహాయక కేంద్రాలలోనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితిని పర్యవేక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగిందని, అప్రమత్తంగా ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News