Sunday, December 22, 2024

మణిపూర్ చల్లారదా?

- Advertisement -
- Advertisement -

ఆరు మాసాలు కావొస్తున్నా మణిపూర్‌ను చల్లార్చలేకపోతున్న వైఫల్యం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో గల భారతీయ జనతా పార్టీ పాలకులకు చేతకాకనా, చేసే ఉద్దేశం లేకనా అనే ప్రశ్న తలెత్తుతున్నది. జులైలో అదృశ్యమైన ఇద్దరు మెయితీ విద్యార్థుల హత్యపై అట్టుడికినట్టు ఉడికిపోతున్న ఆ వర్గం గత మూడు రోజులుగా తీవ్రమైన నిరసన తెలియజేస్తున్నది. గురువారం నాడు సాయంత్రం తూర్పు ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సొంత ఇంటిపై దాడికి ఈ వర్గం యత్నించడంతో ఉద్రిక్తత మళ్లీ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇంటర్‌నెట్‌ను నిషేధించినట్టు తెలుస్తున్నది. 20 ఏళ్ళ మెయితీ విద్యార్థి, 17 ఏళ్ళ విద్యార్థిని గత జులై మొదటి వారంలో అదృశ్యమయ్యారు. వారి మృత దేహాల ఫోటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో ఆ వర్గం భగ్గుమంటున్నది. ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. అయినా హంతకుల ఆచూకీ ఇంత వరకు బయటపడలేదు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని, జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సి) ను అమల్లోకి తేవాలని కేంద్ర బలగాలను, అర్ధ సైనిక దళాలను రాష్ట్రం నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దే పేరిట, తిరగబడుతున్న వారిపై చర్యలు తీసుకొనే నెపంతో భద్రతా దళాలే హతలకు పాల్పడుతున్నట్టు వారు ఆరోపిస్తున్నారు.

గత మూడు రోజుల పరిణామాల్లో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో దాదాపు 200 మంది విద్యార్థులు గాయపడినట్టు వార్తలు చెబుతున్నాయి. మణిపూర్ కల్లోలం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత వరకు మరణించిన వారి సంఖ్య 160కి చేరుకొన్నట్టు తెలుస్తున్నది. ఇదిలా వుండగా రాజధాని ఇంఫాల్ లోయను మినహాయించి కేవలం తాము నివసిస్తున్న గిరిజన ప్రాంతాల్లోనే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని మరి ఆరు మాసాల పాటు పొడిగించడం పట్ల కుకీ, జోమి, నాగా తెగల ఆదివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెయితీ తెగకు చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కుకీ తదితర ఆదివాసీలపై కక్షతో వ్యవహరిస్తున్నట్టు మొదటి నుంచి విమర్శ వున్నది. ఆయనను తొలగిస్తే సమస్య చాలా వరకు పరిష్కారానికి నోచుకుంటుందనే అభిప్రాయం కూడా నెలకొని వుంది. కాని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయనకు గట్టిగా వెన్నుదన్నుగా వుంటున్నారని భావిస్తున్నారు. మెజారిటీ వర్గమైన మెయితీల్లో అత్యధికులు హిందువులే. కుకీ తదితర ఆదివాసీల్లో ఎక్కువ భాగం క్రైస్తవులు. ఈ విభజన కూడా మణిపూర్‌ను దహించివేస్తున్నదని బోధపడుతున్నది. ఇటువంటప్పుడు పాలకులు ఏ వర్గం వైపు కొమ్ము కాయకుండా నిషక్షపాత వైఖరి తీసుకుంటే మంచి తొందరగా జరుగుతుంది. తమది డబులింజిన్ ప్రభుత్వమని చెప్పుకొనే బిజెపి పాలకులు మెజారిటీ మెయితీల వైపు తూగుతున్నారని అనుకోడానికి అవకాశం కలుగుతున్నది.

మైనారిటీలను పర్వత ప్రాంతాల నుంచి తరిమివేసి అక్కడ గల అపారమైన ఖనిజ సంపదను అదానీ, అంబానీల వంటి దేశీయ కార్పొరేట్ శక్తులకు, విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించే కుట్ర దీని వెనుక వుందని కూడా చెప్పుకొంటున్నారు. అదేమైనప్పటికీ దేశంలోని కీలకమైన ఒక సరిహద్దు రాష్ట్రంలో అశాంతి ఆరు మాసాలుగా కొనసాగుతుండడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. మణిపూర్‌లో మహిళలపై అత్యాచారాలు తదితర దురదృష్టకర సంఘటనలతో కూడిన అశాంతి కొనసాగడం పట్ల ఈ మధ్య ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు విమర్శించగా, మన విదేశాంగ శాఖ దానిని తీవ్రంగా తిప్పికొట్టింది. అక్కడ పరిస్థితులు ప్రశాంతంగా వున్నాయని ఢంకా బజాయించింది. అయితే వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా వున్నది. బయటి వారు విమర్శించినప్పుడు దానిని ఖండించడం సబబే అనిపించినా ఎప్పటికీ పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోడం చెప్పనలవికాని అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. గత మే నెల 4న మెయితీ వర్గం తమ ఊళ్ళపై, ఇళ్ళపై దాడులు చేసి తగలబెడుతున్న దుర్భర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోడానికి పారిపోతున్న కొంత మంది కుకీలను పోలీసులు తమ వాహనాలు ఎక్కించుకొని తీసుకు వెళుతుండగా దారిలో

మెయితీ మూకలు వారిలోని ఇద్దరు మహిళలను చెరబట్టి సామూహిక అత్యాచారానికి గురి చేయడం, వారి మగ వారిని హత్య చేయడం మణిపూర్ మంటలకు మూలంలో వున్న దారుణ ఘటన. దీనిపై ప్రధాని మోడీ పెదవి విప్పకపోడంతో ప్రతిపక్షాలు ఆయనను పార్లమెంటుకు రప్పించడం కోసం ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు కూడా ఇచ్చారు. దానితో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని మోడీ పార్లమెంటుకు హాజరై మొక్కుబడిగా ఒక ప్రకటన చేసి ఊరుకొన్నారు. ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధితో ఆలోచించి మణిపూర్ కల్లోలానికి పూర్తిగా తెర దించేందుకు తగిన గట్టి చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News