Friday, November 22, 2024

డ్రైనేజీలలో మంచినీటి వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేస్తాం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : వేపూరి గేరి వద్ద ఉన్న పెద్ద డ్రైనేజీ మురుగు నీటితో స్థానికులకు దుర్వాసన వెదజల్లుతోందని త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసిన తర్వాత ఇదే ప్రదేశంలో వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేసి స్థానికులు సాయంత్రపు వేళల్లో ప్రశాంతంగా సేదతీరేలా తీర్చిదుద్దతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణంలోని అబ్దుల్ ఖాదర్ దర్గ వద్ద ఉన్న రహమానియా బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఇరుకైన రోడ్లు, అధ్వాన్నమైన డ్రైనేజీ సిస్టం వల్ల వర్షాకాలం వచ్చిందంటే రహదారులన్ని జలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉండేవని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాలమైన రహదారులు, జంక్షన్లు అభివృద్దితో పట్టణానికి ఒక రూపును తీసుకువచ్చినట్లు తెలిపారు.

అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించడానికి 12 సంవత్సరాలు పట్టిందని, రైల్వే గేట్ పడినప్పుడు అంబులెన్స్‌లు ఆగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు భూత్పూర్ నుండి మహబూబ్‌నగర్ , జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్ పట్టణానికి వచ్చేందుకు విశాలమైన రహదారులు నిర్మించామన్నారు. పట్టణంలోని రహదారులన్నింటిని విస్తరించడమే కాకుండా, జంక్షన్లు సైతం అభివృద్ధి చేశామని, అస్తవ్యస్తం రహదారులతో అవస్థలు పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రహమానియా బ్రిడ్జి పక్కన ఉన్న పెద్ద మురుగు కాలువలో డ్రైనేజీ వాటర్ వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేసి మంచినీళ్లు ప్రవహించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఒక ఫౌంటెన్ ఏర్పాటు చేస్తామని, వేపురిగేరి , చుట్టు పక్కల ఉన్న వాళ్లందరూ ఇక్కడ ప్రశాంతంగా సేద తీరేలా చర్యలు చేపడతామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు రాం లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ బెంజమిన్ , డిఎస్పీ మహేష్ , ఆర్‌అండ్‌బిడిఈ సంధ్య, జాతీయ రహదారుల సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి పనులను పరిశీలించిన మంత్రి :
మహబూబ్‌నగర్ .. జడ్చర్ల మార్గంలో ఎనుగొండ వద్ద కొంత మేర మిగిలిపోయిన రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, డిసిసిబి ఇంచార్జీ చైర్మన్ వెంకటయ్యలతో కలిసి ఆయన పనులను పరిశీలించారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వరకు ఇకపై ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనే పదమే లేకుండా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News