హైదరాబాద్: రైతుభరోసా, పెన్షన్లపై అపోహలకు తావులేదని, పాత లబ్ధిదారులకు యథావిధిగా ఈ పథకాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా కావాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యకార్యదర్శి వి శేషాద్రితో రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ వివరాలతో పాటు అభయహస్తం గ్యారంటీ పథకాల వివరాలు కూడా ఇచ్చారు.
పథకాలు కావాల్సిన వారు టిక్ చేయడంతో పాటు ఈ వివరాలు కూడా నింపాల్సి ఉంది. రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, వితంతు, చేనేత, బీడీ కార్మికులకు, దివ్యాంగ పెన్షన్లు పాత వారికి యథావిదిగా ఇస్తామని వెల్లడించారు. కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మకాలపై ఆయన రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి హాజరవుతున్న ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాత పథకాల విషయంలో ఎలాంటి గంగరగోళానికి గురి కావొద్దన్నారు.