బెర్లిన్ :జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు చెందిన క్రిష్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయు ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్‌షోల్జ్‌నకు చెందిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ) ఘోర పరాభవం చెందింది. కేవలం మూడో స్థానానికి పరిమితం అయింది. దీంతో క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్‌కు సారథ్యం వహిస్తున్న 69 ఏళ్ల ఫ్రెడిక్ మెర్జ్ జర్మనీకి నూతన ఛాన్సలర్ కానున్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మెర్జ్ చెప్పారు.
“ ఏప్రిల్ 20న ఈస్టర్ పండగ జరగబోతోంది. అప్పటికల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అమెరికా రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేలా ఐరోపా ఖండాన్ని ఏకం చేయడానికే తొలి ప్రాధాన్యం ఇస్తా. ఇటీవలే జర్మనీ ఎన్నికల్లో ఎలాన్ మస్క్ వచ్చి ప్రచారం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగా జర్మనీ రాజకీయ పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీకి మద్దతు ప్రకటించారు. ” అని వెల్లడించారు.